(గత సంచిక తరువాయి..) అప్పుడు నక్క కాకికేసి కొరకొరా చూస్తూ- "మొదటిసారి చూసినప్పుడు జింకకు నువ్వుకూడా కొత్తదానివే. మరి నీకు-జింకకు మధ్య స్నేహం రాను రానూ ఎందుకు బలపడుతున్నది? ఏమీ అడ్డు లేదు గనుక, నీ నోటికి వచ్చినట్లు నీతులు వల్లిస్తున్నావు. పండితులు లేనిచోట కొంచెం బుద్ధి ఉన్నవాడికి కూడా గౌరవం లభిస్తుంటుంది. చెట్లు లేని దేశంలో ఆముదపు చెట్టే మహావృక్షం కాదూ? అల్ప బుద్ధి కలవారికి వీడు తనవాడు, వీడు పరాయివాడు' అని ఎంచ బుద్ధవుతుంది. మహాత్ములకు ఈ లోకమంతా కుటుంబమే. ఈ జింక నాకెంత బంధువో నువ్వూ అంతే బంధువువు, కాదా? ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఎవ్వరమూ ఉండబోము. అందరినీ ఎప్పుడో ఒకప్పుడు మింగేందుకు యముడు కాచుకొని కూర్చున్నాడు. మనం ఇక్కడ ఉన్న సమయంలో అందరిచేతామంచివాడు' అనిపించుకొని పోవాలిగాని, ఇట్లాంటి కుళ్లు బుద్ధి వల్ల లాభం ఏంటి?” అని తిట్టింది.

అప్పుడు జింక "ఈ వాదులాట ఎందుకు? మనం అందరం కలిసిమెలసి ఉందాం. మంచి మాటలతో సుఖంగా కాలక్షేపం చేద్దాం. `వీడికి వీడు మిత్రుడు, వీడు శత్రువు' అని నియమాలేమీ ఉండవుకదా? ప్రవర్తన వల్లనే ఎవరైనా మిత్రులు, శత్రువులు అవుతూంటారు" అన్నది.

ఆ మాటలు విని కాకి "సరే, అలాగే కానీ" అని ఊరుకున్నది. తరువాత జింక, కాకి, నక్కలు చాలా స్నేహంగా ఆ అడవిలో ఉంటూ వచ్చాయి.

ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున నక్క జింకతో - “నేను ఈ రోజున ఒక పొలాన్ని చూశాను. దాని నిండుగా పచ్చని పంట ఉన్నది. నువ్వు నాతోరా. నీకు ఆ పొలాన్ని చూపిస్తాను" అని చెప్పి, తను దగ్గరుండి ఆ జింకను వెంటబెట్టుకొనిపోయి, ఆ పంటపొలాన్ని చూపించింది. ఆ నాటినుండి జింక ప్రతిరోజూ అక్కడికే వెళ్లి పంటను మేయటం మొదలుపెట్టింది.

పొలపు రైతు ఒకరోజున దాన్ని చూసి "అరే! ఈ జింక పైరు మేయ మరిగింది. దీన్ని ప్రాణాలతో వదలకూడదు” అనుకొని, రహస్యంగా పొలంలో వల పన్ని, ఇంటికి వెళ్లాడు. అలవాటు కొద్దీ మర్నాడు అక్కడికి వచ్చిన జింక, పొలంలోకి దిగీ దిగగానే ఆ వలలో చిక్కుకున్నది.

“అయ్యో! వలలో చిక్కుకున్నానే! ఏమి చేయాలి? యముడి పాశం లాంటి ఈ వల నుండి నన్ను విడిపించే దిక్కెవ్వరు? నా నేస్తమైన నక్క వస్తే బాగుండును- ఇప్పుడు నన్ను ఈ ఆపదనుండి అది కాపాడగలదు కదా!” అని అది వాపోయింది.

అంతలోనే అక్కడికి చేరుకున్న నక్క వలలో చిక్కుకున్న జింకను చూసి, మనసులో ఎంతో సంతోషపడి, "ఆహా! నా ప్రయత్నం ఇన్నాళ్లకు కదా, సఫలమైంది! పొలపు కాపు ఇవాళ్ల దీన్ని చంపక మానడు. దీని రక్తమాంసాలు అతుక్కున్న ఎముకలు నాకు కావలసినన్ని దొరుకుతాయి, ఈ రోజు నాకు నిజంగా పండుగ రోజే! ” అనుకుంటూ జింక దగ్గరికి పోయింది.

ఆ అమాయకపు జింకేమో నక్కను చూసి, ఇక తనకు భయంలేదు అనుకొని, “నేస్తమా! వెంటనే వచ్చి, వల కొరికి, నన్ను కాపాడు!" అన్నది.

అప్పుడు నక్క మెల్లగా దాన్ని చేరి, వలను దీక్షగా చూస్తూ- "అయ్యో! మిత్రమా! ఈ వలను సన్నటి నరాలతో చేసినట్లుందే! మరి ఈ రోజు, చూడగా ఆదివారం. ఆదివారంనాడు పళ్లతో నరాల్ని నేనెట్లా తాకేది? నన్ను తప్పుగా అనుకోకు, ఈ పని ఒక్కటీ తప్ప, వేరే ఏ పని చెప్పినా నేను తప్పకుండా చేసిపెడతాను” అన్నది.

ఇక మెల్లగా సాయంత్రం అయ్యింది. కాకి తన స్నేహితుడైన జింక 'ఇంకా ఇంటికి చేరుకోలేదేమి?' అని చాలా కంగారుపడి, అక్కడా ఇక్కడా వెతుకుతూ, చివరికి ఆ పొలం దగ్గరకు వచ్చి చూసింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను కనుగొని, అది కళ్లనీళ్లు పెట్టుకొని, “మిత్రమా, ఇదేంటి?” అని అడిగింది.

“స్నేహితుడి మాట వినకపోవడం వల్ల కలిగిన ఫలితం ఇది. వినాశకాలం వచ్చినప్పుడు మేలుకోరే వాళ్ల మాటలు ఎందుకు వింటాం?” అని బాధపడింది జింక.

“మరి ఆ నక్క ఏది?” అని అడిగింది కాకి.

“నా మాంసం తినాలని ఇక్కడే ఎక్కడో కాచుకొని ఉన్నది!" అని చెప్పింది జింక.

అప్పుడు కాకి “నేను ముందే చెప్పాను- అయినా నా మాట వినలేదు నువ్వు. 'నేను ఇతరులకు కీడు చేయను, కాబట్టి వాళ్ళూ నాకు కీడు తలపెట్టరు' అని నమ్మటానికి లేదు. మంచివాళ్లకు కూడా దుష్టుల వల్ల కష్టాలు తలెత్తుతాయి. పోయేకాలం దాపురించిన వాళ్ళు- "దీపం ఆరిపోయినప్పటి వాసనను పీల్చరు; అరుంధతీ నక్షత్రాన్ని చూడరు; స్నేహితుల సలహాలను వినరు"-అని పెద్దలు చెబుతారు. ఎదురుగా ఉన్నప్పుడు మెత్తగా మాట్లాడి, చాటున కీడు తలపెట్టేవాడు స్నేహితుడు కాడు- పాల మరుగున ఉన్న విషపు కుండ లాంటివాడు. అట్లాంటి వాడితో స్నేహాన్ని తప్పకుండా వదిలిపెట్టాలి” అన్నది.

అప్పుడు జింక నిట్టూర్చింది. "మంచివాళ్లతో సహవాసం వల్ల ఎంత మంచి జరుగుతుందో, చెడ్డవాళ్లతో సహవాసం వల్ల అన్ని నష్టాలూ ఒనగూరుతాయి-సందేహం లేదు. ఆ జిత్తులమారి నక్క తేనె పలుకులకు మోసపోయాను. ఆ దుష్టునికి 'నాలిక తీపి-లోన విషం' అని తెలుసుకోలేకపోయానే? ” అని అది వాపోయింది.

అంతలో దూరంగా నడిచి వస్తున్న పొలం కాపును చూసింది కాకి. "మిత్రమా! ఇప్పుడు తగిన ఉపాయం ఆలోచించకుండా ఆలస్యం చేయకూడదు. అదిగో, రైతు వచ్చేస్తున్నాడు, దుడ్డుకర్రను చేత పట్టుకొని, యముడిలాగానే తోస్తున్నాడు అతను. నాకొక ఉపాయం తోస్తోంది, విను. నువ్వు ఊపిరి బిగపట్టి, కడుపును ఉబ్బించి, నాలుగు కాళ్లనూ నీల్గించి, బిర్ర బిగుసుకొని, చచ్చిపోయినట్లు పడి ఉండు. నేను నీమీద ఎక్కి, ముక్కుతో నీ కళ్ళు పొడుచుకొని తినేదాని మాదిరి కూర్చుని ఉంటాను. ఆపైన సమయం చూసుకొని నేను కూస్తాను. నేను కూసిన మరుక్షణం నువ్వు లేచి పారిపో" అని చెప్పింది అది, జింకతో.

సరేనని జింక, కాకి చెప్పినట్లు పడి ఉన్నది. అంతలోనే పొలపు కాపు దాని దగ్గరికి వచ్చి చూశాడు. జింక కదలక మెదలక పడి ఉండటం చూసి, అతను ఆ జింక చచ్చిందని నిశ్చయించుకున్నాడు. అతను ఆ వలను తొలగించాడో లేదో, కాకి అరిచింది-వెంటనే తేరుకున్న జింక చటుక్కున లేచి, పరుగెత్తింది.

“అయ్యో ! ఇదెంత మాయలమారి జింక! నన్నే మోసగించిందే!!" అని పొలపు కాపు దాని వెంటపడి పరుగెత్తుతూ, తన చేతిలోని దుడ్డుకర్రను దానిపైకి విసిరేశాడు. 'దైవ నిర్ణయమా' అన్నట్లు, ఆ దెబ్బ తగిలి, పొదల మాటున దాక్కున్న నక్క చచ్చింది.

చూడు, నక్క ఏమి ఆశించుకొని అక్కడ ఉన్నది, చివరికి ఏం జరిగింది? ఇతరులకు కీడు తలపెట్టేవాళ్లు తామే చెడిపోతారు.” అని కాకి-జింకల కథను ముగించింది హిరణ్యకుడు.

ఆ మాటలు విని కాకి లఘుపతనకం హిరణ్యకుడితో- "ఎందుకు ఇట్లాంటి మాటలు? నీతో స్నేహం చేయాలని వచ్చాను. నన్ను వేరేగా అనుకోకు. నిన్ను నేను తిన్నంత మాత్రాన నా కడుపేమన్నా నిండుతుందా? నా మనవిని విను. చిత్రగ్రీవుడిని ఆదరించినట్లు, నీ స్నేహంతో నన్ను కూడా అనుగ్రహించు. నీ మంచితనమే నేను నిన్ను ఇంతగా ప్రాధేయపడేటట్లు చేస్తున్నది. నీకు నామీద దయ కలిగేంత వరకూ నిన్ను విడిచిపోను. నీలాంటి మంచి వాళ్లతో సహచర్యం చేసిన సుఖం దక్కకపోతే ఇక నా యీ జన్మ ఎందుకు?” అన్నది.

అప్పుడు హిరణ్యకుడు- “నువ్వు నిలకడలేని దానివి. ఎన్ని విధాలుగా చూసినా, చపలుడితో స్నేహం చేయకూడనిదే. అంతేకాదు- నువ్వు మాకు శత్రు పక్షంలోని దానివి. శత్రువు ఎంత మంచివాడైనా సరే, వానితో సహవాసం కూడదు. కాబట్టి, నీతో నాకు మైత్రి సరిపోదు. సాధ్యంకానిది ఎన్నటికీ సాధ్యంకాదు; సాధ్యమయ్యేది ఎన్నటికీ అసాధ్యం కాదు. నీటిమీద బళ్లూ, నేలమీద నావలూ నడుస్తాయా? అందని ఫలాలకోసం ఎందుకు అర్రులు చాస్తావు? నీపని చూసుకో. మిట్టమధ్యాహ్నం అవుతున్నది. కడుపు నింపుకోవటం గూర్చి ఆలోచించుకో. పో, పో!" అన్నది.

ఆ మాటలు విని- “నా స్వభావం ఏంటో తెలీకుండానే ఎందుకు, ఇంతలేసి వెగటు మాటలు మాట్లాడుతున్నావు? చివరగా చెప్తున్నాను విను. ఈ లోకంలో ఉన్న మంచివాళ్లలోకెల్లా మంచివాడివి నువ్వు. అలాంటి నీతో స్నేహం చేసి, చిత్రగ్రీవుడు మైత్రిలోని సుఖాన్ని చవి చూశాడు. నేను అదంతా గమనించి, నీతో చెలిమికై మనసుపడ్డాను. నా ప్రార్థన విని నువ్వు అంగీకరించావా, సరి. లేకపోతే నా భాగ్యం ఇంతే అనుకొని, ఇక్కడే నిరాహారదీక్ష చేపట్టి , ప్రాణాలు విడుస్తాను. ఇదే నా నిశ్చయం. చెడ్డవాడి నిర్ణయాలను మట్టి కుండలాగా సులభంగా పగలగొట్టవచ్చు, కానీ అతికించటం వీలు కాదు. బంగారు కుండలో మాదిరి, మంచివారి లక్షణం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది - (వారి నిర్ణయాలు సులభంగా తయారవుతాయి, కానీ వాటిని ఛేదించటం కష్టం). కరిగే గుణం వల్ల అన్ని లోహాలు, కారణం వల్ల జంతు-పక్షి సమూహాలు, భయంవల్ల–దురాశవల్ల మూర్ఖులు, దర్శించటంవల్ల మంచివాళ్లు కలుస్తారు. అంతేకాదు, 'శుభ్రంగా ఉండటం, త్యాగం, శౌర్యం, సుఖ-దు:ఖాలను సమ చిత్తంతో స్వీకరించటం, దయ, స్నేహం, నిజం పలకటం'- అనేవి మంచి హృదయంగలవారి లక్షణాలు' అని చెబుతూంటారు. ఈ గుణాలన్నీ నాకు నీలో కనబడుతున్నాయి. నీలాంటి వాళ్లు వేరెవరినీ నేను కనీ, వినీ ఎరుగను. నీవంటివానితో స్నేహం సంపాదించటం కంటే మంచి పని వేరే ఏదీ లేదు. నా కోరికను నెరవేర్చి, నాతో స్నేహం చేస్తే చాలా సంతోషపడతాను. లేకపోతే నా అదృష్టం ఇంతే అనుకుంటాను" అన్నది కాకి, హిరణ్యకునితో. (....మిగిలినది వచ్చే మాసం.)