ఒక అడవిలో కుందేలు జంట ఒకటి నివసిస్తూ ఉండేది. వాటికి బాగా దు:ఖంగా ఉంటున్నది ఈమధ్య. ఏమంటే వాటికి ఆ అడవిలో బ్రతుకు దినదిన గండం అయిపోయింది.

అందుకు కారణం, ఆ అడవి అంతటికీ బలశాలి అయిన పెద్దపులి. అది చిన్న జంతువులన్నింటినీ విచక్షణా రహితంగా చంపుతూ వుండేది. దాంతో అడవిలోఉండే చిన్నా-చితకా జంతువులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సి వస్తున్నది.

ఒకనాడు కుందేళ్ళు జంట ఆహారం కోసం నేలలో దుంపలను త్రవ్వుకుంటున్నది. అంతలో అక్కడికి ఓ ముళ్ల పంది వచ్చింది. కుందేళ్ళు త్రవ్వుకున్న దుంపల్ని అది తినేయటం మొదలుపెట్టింది! ఆ ముళ్ళ పంది వేరే అడవి నుండి వచ్చినట్లుంది- తన వాడి ముళ్ళను విచ్చుకొని, కుందేళ్లను బెదిరిస్తూ, అవి త్రవ్వుకున్న దుంపలను తినేస్తోంది నిబ్బరంగా!

"ఇది అన్యాయం, ముళ్ళ పందీ! ఎక్కడ నుంచోవచ్చి, మా కష్టంతో తవ్వుకొన్న దుంపలు తింటున్నావేంటి, దౌర్జన్యంగా?" అన్నాయి కుందేళ్ళు. ముళ్ల పంది ముళ్ళను నిక్క బొడుచుకొని. "దౌర్జన్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ముళ్ళతో పొడిచి చంపేస్తాను, జాగ్రత్త!" అంది.

ఇలా కుందేళ్ళు సంపాదించిన ఆహారాన్ని ముళ్ళ పంది తినేస్తూనే ఉంది. అసలే పెద్దపులి భయంతో దినదిన గండంగా బ్రతుకు సాగిస్తుండగా,దానికి తోడు ముళ్ళ పంది దాపురించటంతో ఆ కుందేళ్లు జంట ఆహారానికి మాడవలసి వచ్చింది.

'ఎలాగైనా ముళ్లపంది పీడను వదిలించుకోకపోతే వీలయేటట్లు లేదు'అని కుందేళ్లు అవకాశం కోసం ఎదురు చూడసాగాయి. ఒక రోజున కుందేళ్ళు అడవిలో పోతుంటే, పొదమాటున వున్న పెద్దపులి ఠపాలున వాటి మీదికి దూకింది!

"ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లాయి" అనుకుని, భయంతో వణికిపోయాయి, కుందేళ్ళు. అది చూసి, పెద్ద పులి- "భయపడకండి కుందేళ్ళూ, నేనిప్పుడు మిమ్మల్ని చంపను. అడ్డమైన జంతువులనూ ఎక్కువగా చంపి తినటం చేత, నాకు అజీర్తి రోగం పట్టుకున్నది. నా ఆరోగ్యం బాగు పడేందుకు సరైన మార్గం ఏదైనా సూచించారంటే, ఈసారికి మిమ్మల్ని వదిలేస్తాను" అన్నది.

కుందేళ్ళకు ప్రాణం లేచివచ్చినట్లైంది. అవి ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. వాటిలో ఒకటి ముందుకు వచ్చి, "మీ అజీర్తి రోగం తగ్గటానికి, నాకు తెలిసి ఒక చక్కని మార్గం వుంది. అదేమిటంటే, ముళ్ల పంది మాంసాన్ని- దాని ముళ్ళతో సహా- మింగేయటం. మీరుగానీ ఆ పని చేశారంటే, క్షణాల్లో మీకు ఇక రోగమంటూ ఉండదు" అన్నది, ఉత్సాహంగా. పెద్దపులి సంతోషపడింది, కానీ వెంటనే దానికి ఓ అనుమానం వచ్చింది: "ఈ అడవిలో ముళ్ళ పందులు లేవుకదా, మరెలాగ?" అని అడిగిందది.

"లేకపోవటం ఏంటి? మీ అనుమతి లేకుండానే ఎక్కడి నుండో ఒక ముళ్ళ పంది వచ్చి ఇక్కడ తిష్ఠవేసింది-ఏనాడో!" అని చెప్పాయికుందేళ్లు రెండూ. "ఓహో, అట్లాగా? అయితే ఆ ముళ్లపందిని తక్షణం చంపేసి తింటాను. ముందు అది ఎక్కడ వుందో చూపించండి" అని గర్జించింది పెద్దపులి.

ముళ్లపంది తిరిగే చోటుకు పెద్దపులిని తీసుకొని పోయాయి కుందేళ్ళు. అపాయాన్ని గ్రహించిన ముళ్ళపంది ఆత్మరక్షణగా ముళ్ళను నిక్కబొడిచింది.

"నువ్వేం చేసినా నానుండి తప్పించుకు పోలేవు!" అని, పెద్దపులి దాన్ని ముళ్ళతో సహా నోట పెట్టుకున్నది! పులి నోట పడ్డ ముళ్ళపంది ఇక తప్పించుకోలేక, చచ్చిపోయింది. కానీ దాని ముళ్ళు పులి గొంతులో కత్తుల్లాగా గుచ్చుకున్నాయి. ఇక దాన్ని పూర్తిగా మింగలేకా, కక్కలేకా గందరగోళపడిన పులి, ఆ ముళ్ళబాధకు చచ్చింది.

ఒకే దెబ్బకు ముళ్ళపందినీ, పులినీ కూడా మట్టుబెట్టిన కుందేళ్ళు అడవిలోని జంతువులన్నిటినీ కాపాడిన హీరోలైనాయి!