అమ్మా! నేను బడికి పోనే!

నేనొట్టి చిన్న పిల్లనే, అమ్మా. నాకెవరైనా కథలు చెప్పాలి, నాకెవరైనా నేర్పించాలి.

కప్పపిల్లల్నీ, సీతాకోక చిలకల్నీ చూడటం నాకిష్టం- అవేం తింటాయో, ఎక్కడ నిద్రపోతాయో తెలుసుకోవటం నాకిష్టం. ఇంకా నేనో కొండనెక్కాలి, పైన ఎగిరే మబ్బుని పట్టుకొని, అది దేంతో తయారైందో చూడాలి.

పారే ఏరులో చేతులు పెట్టి చూడాలి నేను. ఈదే చేపలు నా వేళ్ళకి తగిల్తే ఎంత బాగుంటుందో చూడాలి.

కుక్క పిల్లల్తోబాటు పరుగులెత్తాలి నేను, పిట్టలతో కలిసి పాటలు పాడాలి, వానలో కాయితపు పడవల్ని తేల్చాలి.

మెత్తటి పచ్చ గడ్డిలో పడుకొని పిల్లగాలి చెప్పే కబుర్లు వినాలి- ఆ తర్వాతే నాకు వాటిని గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనిపిస్తుంది, ఆ తర్వాతే వాటిని చదవాలనిపిస్తుంది.

నా ఊహలు ఎగిరాకే, తెలుసుకోవాలనే దాహం మొదలయ్యాకే, 'ఎందుకు?'అనే బీజం నా మెదడును తొలిచాకే- ఏమైనా చదువుతా.

అమ్మా! నాకీ బడి జైలు వద్దే!

వాళ్ళు యంత్రాల మాదిరి చెప్పుకుపోతుంటే నా ఆత్మ ముడుచుకుపోతోందే!

మొదట్లో అడగాల్సిందేదైనా అడిగితే, వాళ్లు "అది చెప్పాలంటే సమయం చాలదు. సిలబస్ అయిపోవాలి" అంటారే!

నిజంగా అర్థం కావాలంటే నేను కొంచెం ఆగాలే. -ఆగకుండా మార్కులకోసం పరిగెత్తి నేను అలిసిపోతున్నానే!

పురాతన వస్తువుల్ని చూపించి మా టీచర్లు వాటి చరిత్ర చెప్పాలని నా కోరిక.

ప్రకృతిలో నడిపించి నిజం జీవశాస్త్రం నేర్పిస్తే బాగుండు.

బ్రద్దలయ్యే అగ్ని పర్వతాల్నీ, సముద్తాలలోని అగాధాల్నీ వీడియోల్లో చూపిస్తేనేం?

మేముండే నగరంలోని చారిత్రక కట్టడాల్నీ, సాంస్కృతిక నిర్మాణాల్నీ నిజంగా చూపిస్తేనేం?

ఖగోళ విజ్ఞానం చదివేముందు, కనీసం ఒక్కసారన్నా టెలిస్కోపులోంచి ఆకాశాన్ని చూస్తానే!

వీటన్నిటినీ ఊరికే చదవటం నాకిష్టం లేదే, అమ్మా! నేను వీలైనన్నిటిని చూడాలి, వినాలి, తాకాలి, వాసన చూడాలి, రుచి చూడాలి- నాకు వీటన్నిటి అనుభూతీ కావాలే!

బడి సంవత్సరంలో కనీసం ఒక్కసారన్నా అట్లా బైట తిప్పచ్చుగదే!

ఇంకా..

పుస్తకాల సంచీ బరువును మోసేందుకు నా నడుమును ఇంకా వంచటం నావల్ల కాదే! ఇప్పటికే నడుం విరిగేందుకు సిద్ధంగా ఉంది. అన్ని పుస్తకాలూ రోజూ ఎందుకు మొయ్యాలి, నేను? రోజుకో రెండు సబ్జెక్టులు నేర్పించచ్చుగా, ఎందుకు చేయరలాగ? లేకపోతే వేరే దేశాల్లోలాగా బళ్లో లాకర్లు పెట్టమనండే, నా పుస్తకాల్ని అక్కడే పడేసి వస్తాను. నేను ఊపిరాడని ఆ ఆటోల్లో ఇరుక్కుని ఎందుకు పోవాలే?

ఎదగటం నాకు నచ్చట్లేదే, అమ్మా! అసలు పెద్దవ్వాలనే అనిపించట్లేదు. పెద్దైతే ఇంకా ఎక్కువ హోం వర్కులు, ఇంకా పెద్ద శీతాకాలం ప్రాజెక్టులు, వేసవి తరగతులు, వారాంతపు పరీక్షలు, నెలవారీ పరీక్షలు, మూడు నెలల పరీక్షలు, ఆరు నెలల పరీక్షలు, వార్షిక పరీక్షలు, బయటి పోటీ పరీక్షలు, ఇంకా పరీక్షలు, ఇంకా పోటీలు, ఇంకా వత్తిడి, ఇంకా ఒత్తిడి... నేనసలు పెద్దవ్వనే, అమ్మా!

నేనెప్పుడు పాడాలి, బొమ్మలకి రంగులెయ్యాలి, డాన్సు చెయ్యాలి, ఈదాలి, ఎప్పుడు సైకిల్ తొక్కాలి? ఎప్పుడు క్రికెట్ ఆడుకోను, నేను? ఎప్పుడు దాగుడు మూతలు ఆడను?

నువ్వెప్పుడూ చెబుతావే, " పిల్లలు కనీసం ఇన్ని గంటలు నిద్రపోవాలి" అని? ఆ లెక్కలు ఇప్పుడు ఎక్కడికెళ్లాయే, అమ్మా?

నేనెందుకు ఎప్పుడూ చదవాలి, చదవాలి, చదవాలి?

అమ్మా, నాకు భయమేస్తోందే. నమ్మటానికి వీల్లేని టీచర్లు చేసే చెడ్డపనులు పెరిగిపోతున్నాయే. పెద్ద పిల్లలు ర్యాగింగ్ చేస్తారట. కొందరు తిక్కోళ్లకు యాసిడ్ అంటే ఇష్టమట, వెకిలి పెద్దవాళ్లూ ఎక్కువౌతున్నారే!

అమ్మా, నాకిప్పుడే డాక్టరవ్వాలనీ లేదు; ఇంజనీరవ్వాలనీ లేదు- అసలు ఎవ్వరవ్వాలనీ లేదు.

భద్రంగా, జాగ్రత్తగా ఉండాలి, ముందు.

ఎట్లాంటి ఒత్తిడీ లేకుండా ఆడుకోవాలి. ఆడుకుంటూ నేర్చుకోవాలి, అంతే.