అనంతపురం జిల్లాలో ఒక మండల కేంద్రం చెన్నేకొత్తపల్లి. అన్నిచోట్లలాగే ఇక్కడా పిల్లలున్నారు. అన్ని చోట్లలాగే ఇక్కడా బడులు ఉన్నాయి. ఆ బడులలోనూ అన్నిచోట్లలాగే -బెత్తాలున్నాయి.

ఉత్సాహవంతులైన పిల్లలు స్వయంగా తమ చేతులతో కోసి, ప్రేమగా తెచ్చి టీచర్లకు ఇస్తుంటారు ఆ బెత్తాల్ని. వాటితో బాధ్యతగా, అత్యంత నిబద్ధతతో పిల్లల్ని అందరినీ వాయిస్తుంటారు ఉత్సాహవంతులైన టీచర్లు. క్రమశిక్షణ పేరిట చేతులు కట్టుకొని నిలబడటం దగ్గరనుండి, హిట్లర్ మూకల మాదిరి చేతిని ముందుకు చాచి ’మైకమిన్సార్’ అని అరవటం వరకూ అన్నీ నేర్పిస్తుంటారు పిల్లలకు. ఉత్సాహం, విధేయత ఎక్కువై, చదువులు తక్కువైన పిల్లలు వాళ్ల ఇళ్లకు పోయి కావలసిన పనులన్నీ ఇష్టంగా చేసిపెడుతుంటారు. అలా తమకోసం చదువుల్ని త్యాగం చేసినందుకు కృతజ్ఞతతో వాళ్లు పదోతరగతి పరీక్షల్లో(మాత్రం) యధాశక్తి ’సహాయం’ చేసి పిల్లల జీవితాలను నిలబెడుతుంటారు.

అలాంటి బానిసత్వంగానీ, అంకుశాలుగానీ లేని పిల్లల ఊరు ఉంటే బాగుండు.

ఆ కొత్త పల్లిలో పిల్లలు స్వేచ్ఛగా విహరిస్తుంటారు- ఆకాశాన ఎగిరే పక్షుల మాదిరి. స్వతంత్ర గీతాలు పాడుతుంటారు- కోయిలల మాదిరి. సంతోషంగా ఎగురుతుంటారు, ఇష్టంగా నేర్చుకుంటారు- పిల్లి పిల్లల్లాగాను, పులి బిడ్డల్లాగానూ. ఆ ఉత్సాహపు జల్లులు వెల్లువలై, కాలువలై, ఏర్లై, నదులై, మహా సముద్రాలైతే వాటి ఆనంద తరంగాలు ప్రపంచంలో పిల్లలందర్నీ చేరి, "మేమున్నాం, మీరూ రండి" అని పిలుస్తై.

అందులోనూ పెద్దలుంటారు- పిల్లలకు దాస్యం చేస్తుంటారు. వాళ్ల సంతోషాల్లోంచి రాలే ముత్యాలని ఏరుకుంటూంటారు. వాళ్లు అడిగితే, తమకు తెల్సిన కబుర్లు చెప్పి, వాళ్లకు సాయం చేస్తూ, అలా తమకు తాము మేలు చేసుకుంటారు. వాళ్లు అడక్కపోతే, అడిగేలా మాయచేసేందుకు ప్రయత్నిస్తారు, ఫలితం లేకపోతే తమ బ్రతుకు తాము బ్రతుకుతారు.

అన్ని జంతువుల పిల్లల్లాగే మనిషి పిల్లలుకూడా వారికి అర్థవంతంగా ఉండేవాటిని ఇష్టపడతారు. ఏవైనాసరే, అర్థమవ్వాలి, ఒత్తిడి కలిగించకూడదు, మరీ ఎక్కువ ప్రశ్నించి గందరగోళ పరచకూడదు, నేర్పాలి; పరీక్షించకూడదు, ఉన్నతత్వాన్ని చూపాలి; కానీ వారిని చిన్నబుచ్చకూడదు. కధల్లో, ఆటల్లో, పాటల్లో ఈ గుణాలన్నీ ఉంటాయి- అందుకనే కొత్త పల్లిలో ఇవన్నీ సజీవంగా ఉంటాయి. బొమ్మల్లో ప్రాణం పోసుకుంటాయి. పలకటం నేర్పుతాయి, వినటం నేర్పుతాయి, బొమ్మలు వేయటం నేర్పుతాయి, చదవటం నేర్పుతాయి, చూడటం నేర్పుతాయి, మాట్లాడటం నేర్పుతాయి, భాషని ఇష్టపడటం నేర్పుతాయి. చందమామని చేతికి అందిస్తాయి. పులకించని మది పులకించేలా చేస్తాయి...

ఈ ఊహ మాకందరికీ నచ్చింది. ’కొత్త’ పల్లిని గురించిన ఈ కల, కొత్తపల్లి (e)మాసపత్రిక రూపందాల్చి మీముందుకొస్తోంది. సర్వధారి ఉగాదికి అందరినీ కలిసేందుకు, తనకుదొరికిన సమయంలో, తనకున్న మంచి బట్టలు వేసుకొని, తనకు వీలైనంత అందంగా ముస్తాబై బయలుదేరింది. ముందుగా కొంతమంది పిల్లల ఊహల్నీ, కళల్నీ, కొందరు పెద్దల రచనల్నీ మోసుకొస్తోంది. మెల్లగా ఇంకొందరు పెద్దల్నీ, అందరు పిల్లల్నీ కలుపుకొంటుంది. రానున్న రెండు మూడు నెలల్లో మీ అభిరుచుల మేరకు కొత్త కొత్త రంగుల్నీ, కొత్త కొత్త శీర్షికల్నీ ధరించి కనువిందుచేస్తూ ఆనందాల్ని పంచుతుంది. ప్రస్తుతం రంగుల సమస్యలు, అక్షరాల సైజుల సమస్యలు కొన్ని ఉండొచ్చు; త్వరలో అవి పోతాయి. లైబ్రరీ పుస్తకం, మాటకట్టు, క్విజ్ వంటి అంశాలూ కలుస్తాయి-

మీరూ రండి. కలసి పోదాం. ఈ కలనీ పరీక్షిద్దాం.