అనగనగా నది ఒడ్డున ఉండే ఒక ఊళ్ళో సీతమ్మ , రామయ్య అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. రోజూ నదిలోకి దిగి చేపలు పట్టి, వాటిని తెచ్చి దక్కిన రేటుకు పట్నంలో అమ్ముకొనేవాళ్ళు.

రామయ్యకు, సీతమ్మకు సొరకాయ కూర అంటే చాలా ఇష్టం. ఒక రోజున రామయ్యకు సొరకాయ కూర తినాలనిపించింది. "ఇవాళ్ల సొరకాయ కూర చేసుకుందాం. నేను ఈ చేపలు ఇచ్చేసి, సొరకాయ తెస్తాను" అని, మూడు పెద్ద పెద్ద చేపలు పట్టుకొని పట్నం వెళ్ళాడు రామయ్య.

అయితే, ఆ రోజున సొరకాయలకు గిరాకీ ఎక్కువ ఉన్నది. సొరకాయల వాళ్లెవ్వరూ ఇతని చేపలు అక్కర్లేదన్నారు! చేపలు అమ్మితే వచ్చే డబ్బు ఒక్క సొరకాయకు కూడా చాలేట్లు లేదు!

దాంతో చిన్నబోయిన రామయ్య, తన చేపల్ని 'ఏం చేయాలా' అని ఆలోచించాడు. ఆ ఊరి రాజుకు చేపలంటే చాలా ఇష్టం. "తను చేపల్ని తీసుకెళ్ళి రాజుగారికి బహుమతి ఇస్తే, ఆయన సంతోషపడి, 'ఏంకావాలి?' అని అడుగుతాడు. అప్పుడు తను 'రెండు సొరకాయలు ఇప్పించండి, మారాజా!..' అంటాడు" అనుకొని, వాటిని తీసుకెళ్ళి రాజుగారి ముందు పెట్టాడు రామయ్య.

అయితే, ఆ రోజు యువరాణి పుట్టిన రోజు. అందరూ ఆ పాపకు ఏవేవో‌ బహుమతులు ఇస్తున్నారు. రాజుగారు, యువరాణి చేపల్ని అయితే తీసుకున్నారు గానీ, బదులుగా రామయ్యకు ఏమీ ఇవ్వలేదు!

రామయ్య చాలా బాధపడ్డాడు. విచారంగా ఇంటికి బయలు దేరాడు. బయట ఉన్న కాపలావాళ్ళు అతని ముఖం చూసి, 'సంగతేంటి' అని అడిగారు. రామయ్య తన గోడంతా వెళ్లబోసుకున్నాడు.

"అయ్యో! ఎంత పనైంది! ఇవాళ్ళ ఆ పాప పుట్టినరోజు కదా, అందరికీ భోజనాలు పెడుతున్నారు. చూడు- అక్కడ సొరకాయ కూర వేస్తున్నారు! నువ్వు అక్కడే భోజనం చేసిపో, కనీసం ఆ కోరిక కొంతైనా తీరుతుంది" అన్నారు వాళ్ళు.

రామయ్య పోయి, అందరితో బాటు భోజనం చేసాడు. సొరకాయ కూర చాలా బాగుంది! మూడు నాలుగు సార్లు వేయించుకొని తిన్నాడు. తనకైతే తృప్తి అయ్యింది గానీ 'సీతమ్మకి ఏమీ లేదే' అనిపించింది అతనికి. కొంచెం కూర తీసి, తన గిన్నెలోకి వేసుకొని, లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాడు.

బయట నిలబడి ఉన్నది రాజకుమార్తె. రామయ్య చేసిన పని చూస్తూనే ఉంది. అతన్ని పిలిచి, 'ఏంటి తీసుకెళ్తున్నావు?' అని అడగనే అడిగింది!

"నా భార్యకి సొరకాయ అంటే చాలా ఇష్టం.. తన కోసం కొంచెం కూర పెట్టించుకున్నానమ్మా" అన్నాడు రామయ్య, తన గిన్నె చూపిస్తూ.

ఆ పాప అతనికేసి ఒక క్షణం చూసి, నవ్వి "అంత ఇష్టమైతే ఒక సొరకాయే ఇప్పిస్తానుగా? ఆగు!" అని సేవకులతో చెప్పి, ఒక మంచి సొరకాయను తెప్పించి ఇచ్చింది! అంతే కాక గిన్నె నిండా సొరకాయ కూర పెట్టి పంపించింది!

రామయ్య మబ్బుల్లో తేలిపోతున్నట్లు నడిచి, గబగబా ఊరు చేరుకున్నాడు. ఆరోజంతా సీతమ్మ, రామయ్య ఇద్దరూ రాజుగారు పెట్టిన సొరకాయ కూరని పొగుడుతూనే ఉన్నారు!

మరునాడు కూర చేద్దామని సొరకాయని కోస్తే, అందులోంచి టపుక్కున ఒక వజ్రం రాలి పడింది!

రామయ్య, సీతమ్మ యువరాణికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు: 'వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో భూమి కొని, సొరకాయల పంట వేద్దాం' అనుకున్నారు సంతోషంగా.