సత్యశీలుడు - సుగుణావతి ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఆస్తిపరులు, పిల్లలు బుద్ధిమంతులు, డబ్బుకు ఏ లోటూ ఉండేది కాదు. ఆరోగ్యం మహత్తరంగా ఉండేది; అన్నీ బాగానే ఉండేవి- కానీ ఏదో తెలీని అసంతృప్తి వాళ్లని పీడించేది.
'భగవంతుడిని సేవిస్తే సంతోషం వస్తుంది' అని భార్యభర్తలిద్దరూ పూజలు చేసేవాళ్ళు; తీర్థయాత్రలు చేసేవాళ్ళు; పుణ్యక్షేత్రాలు దర్శించేవాళ్ళు; ఉత్సవాల్లో పాల్గొంటుండేవాళ్ళు.
అయితే కేవలం ఆ సందర్భల్లో మాత్రమే వాళ్ళ మనసుకు ఉల్లాసంగా, తన్మయంగా అనిపించేది. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు యధా ప్రకారం అసంతృప్తికి గురయ్యేవాళ్ళు.
అట్లానే 'గ్రంథ పఠనం' వల్ల సంతృప్తి వస్తుంది అని ఎవరో చెబితే కొన్నాళ్లపాటు వరస పెట్టి ధార్మిక గ్రంధాలు చదివించుకున్నారు; పురాణ కాలక్షేపాలు అవీ చేయించారు కానీ మళ్ళీ యథాప్రకారం అసంతృప్తే.
ఆ సమయంలో వాళ్ళకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువుగారు వాళ్ల ఊరికి వచ్చారు. సత్యశీలుడు-సుగుణవతి ఆయన్ని దర్శించుకొని తమ సమస్య చెప్పుకున్నారు. ఆయన అన్నారు- "చూడు నాయనా! మనిషి సంఘజీవి.
'తనతోబాటు, తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి' అని కోరుకుంటాడు ఎప్పుడూ. అందువల్లనే, తను ఒక్కడూ సుఖంగా ఉన్నంతమాత్రాన మనిషికి సంతృప్తి రాదు.
ఈ సమాజంలో ఎంతోమంది రకరకాల కష్టాలకు లోనవుతున్నారు; వైద్యం చేయించుకునే శక్తి లేక ప్రాణాలు కోల్పోతున్నారు; జ్ఞానపిపాస ఉన్నా యువకులు చాలామంది చదువులు కొనసాగించలేకపోతున్నారు. పలువురు బ్రతుకు తెరువు లేక కష్టపడుతున్నారు. వాళ్లకు మీ చేతనైనంత సాయం, మీ చేతనైన రీతుల్లో చేయండి. అప్పుడు చూడండి ఎంత తృప్తి కలుగుతుందో" అని.
గురువుగారి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న సత్యశీలుడు-సుగుణవతి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ గ్రామంలో రోగుల కోసం ఒక వైద్యశాల, యువతరం విద్యను కొనసాగించేందుకుగాను పాఠశాల, కళాశాల నిర్మించారు. ఊళ్ళో అందరికీ బ్రతుకు తెరువులు చూపే వ్యవస్థలు ఏర్పరచారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు సాయం చేసి, నిలద్రొక్కుకునేట్లు చూసారు.
వృద్ధులకు గౌరవాన్నీ, ప్రేమను పంచే కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇక అటుపైన వాళ్ళకు అసంతృప్తి అన్నమాటే గుర్తు రాలేదు!