రామాపురంలో ఉండే విజయమ్మకు విత్తనాల గురించి బాగా తెలుసు. చిన్న చిన్న కమతాల్లో రకరకాల పంటల్ని వేసి, వాటినుండి మంచి విత్తనాలు తయారు చేసి, అమ్మేది ఆమె.

అంతేకాక రకరకాల విత్తనాలను ఆమె సేకరించి పెట్టుకొనేది కూడా. విత్తనాలను ఎంపిక చేసుకోవటంలో ఆమెకు చాలా నేర్పు ఉండేది.

అందరూ ఆమెని విత్తనాల విజయమ్మ అని పిలిచేవాళ్ళు.

అదే ఊళ్ళో నాగమ్మ అనే 'లీడర్' ఒకామె ఉండేది. ఆమె, ఆమెకు తోడుగా మరో ఇరమంది స్త్రీలు ఉండేవాళ్ళు- వీళ్లంతా కలిసి వరి మడులు గుత్తకు తీసుకొని నాట్లు వేసేవాళ్ళు. అట్లా చేసి చేసి వాళ్ళు అంతా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారంటే, అందరూ నాగమ్మను 'నాట్ల నాగమ్మ' అని పిలువసాగారు.

ఆ ఊళ్ళోనే ఉన్న చింపిరయ్య క్రిమినాశక మందులు తయారు చేసేవాడు. రకరకాల ఆకులను, మూలికలను సేకరించి, వాటితో నాటు మందులు తయారు చేసేవాడు. వాటిని చల్లితే పంటలను ఆశించే పలురకాల పురుగులు నశించేవి. అందరూ అతన్ని 'చీడపీడల చింపిరయ్య' అనేవాళ్ళు.

ఆ చుట్టు ప్రక్కల పల్లెల్లో అంతటా 'సత్తవ సత్తయ్య' అందరికీ పలు రకాలుగా సాయం చేస్తుండేవాడు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో, ఉన్న వ్యర్థ పదార్థాలను అన్నింటినీ‌ ఉపయోగించి, చెట్ల ఆకులు కొట్టి మడుల్లో వేయించి- అలా పొలాలకు కావలసిన 'సత్తువ' అందించేవాడు అతను. ఎవరైనా వరిపొలం పెట్టుకోవాలంటే ముందుగా 'సత్తువ సత్తయ్య'ను తప్పక సంప్రదించేవాళ్ళు.

ఇక పంటలు కోతలకు వచ్చాయంటే, ఊళ్ళో అందరిలోకీ బిజీగా ఉండేది 'కోతల సుబ్బారాయుడు', అతని బృందం. వాళ్ళు కోతలకు వస్తే ఒక్క గింజ కూడా వృధాపోదని, నీతిగా పంట మొత్తాన్నీ‌ రైతుల ఇళ్ళకు చేర్చేవరకూ బాధ్యత తో వ్యవహరిస్తారని చెప్పుకునేవాళ్ళు.

అయితే వ్యవసాయ పద్ధతులు మారిన కొద్దీ వీళ్ళందరికీ బ్రతుకు తెరువు లేకుండా అయ్యింది. రైతులు హైబ్రిడ్ విత్తనాలు కొనుక్కొచ్చుకుంటున్నారు, ప్రభుత్వాలు కూడా విత్తనాలు సరఫరా చేస్తున్నాయి; నాట్లు వేసేందుకు, కోతలకు యంత్రాలు వచ్చాయి, అట్లా కూలి పని తగ్గిపోయింది; రసాయనిక ఎరువులు-పురుగుమందులు వచ్చి, కంపెనీల వాళ్ళ ప్రచారంలో కొట్టుకు పోతున్న రైతులు సత్తయ్యల్ని, చింపిరయ్యల్ని పట్టించుకోలేదు.

రామాపురం పెదరైతు రాఘవేంద్రరావు దీన్నంతా గమనించాడు: అతని పిల్లలు పెద్దవాళ్లయ్యారు, మంచి ఉద్యోగాలలో ఉన్నారు; 'తాము పర్యావరణానికి చాలానే చెడు చేస్తున్నాం' అని ఆయనకు బాగా అర్థమైంది.

'ఏం చేయాలి' అని ఆలోచించి ఆయన, ఆ సంవత్సరం విత్తనాల విజయమ్మ దగ్గర విత్తనాలు తీసుకున్నాడు; నాట్ల నాగమ్మ తో నాట్లు వేయించి నీరు పెట్టాడు; మరో రెండు వారాల వ్యవధిలో చీడపీడల చింపిరయ్యతో పురుగు మందులు పెట్టించాడు; అందువల్ల ఆ పంటను ఇక పురుగులు ఆశించ లేదు.

అట్లా ఇరవై రోజుల తర్వాత సత్తవ సత్తయ్యని పిలిచి, అతనితో పొలానికి గండి కొట్టించి, పొలానికి కావలసిన ఎరువులను- సేంద్రియ పద్దతిలో తయారైనవి, ఎక్కువ మొత్తాలలో వేయించాడు. చక్కగా పెరిగిన వరి దట్టంగా పిలకలు వేసింది. అట్లా నాలుగు నెలలు గడిచే సరికి పంటమొత్తం కంకులతో‌ కళకళలాడింది.

దాంతో ఈసారి కోతల సుబ్బారాయుడుతో పంటని కోయించాడు రాఘవేంద్రరావు. పడిన కష్టానికి ఫలం దక్కి, పంటంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నది. పంట దిగుబడి అధికంగా ఉండటంతో దానికి ఒక మంచి రేటు కూడా వచ్చింది.

రైతుగా రాఘవేంద్రరావు సంతోషించాడు. విత్తనాల విజయమ్మ, నాట్ల నాగమ్మ, చీడపీడల చింపిరయ్య, సత్తవ సత్తెయ్య , కోతల సుబ్బారాయుడు అందరూ తమకు పని దొరికినందుకు సంతోషించారు.

క్రూరమైన రసాయనాలు చల్లకుండా, చక్కని ఎరువులిచ్చి తనని ప్రేమగా కాపాడుకున్నందుకు నేలతల్లి కూడా మురిసింది.


,



,