ఆఫ్రికాను తెల్ల దొరలు పరిపాలిస్తున్న రోజులవి. తెల్లవారికి మాత్రమే కేటాయించిన జోహన్నెస్‌బర్గ్‌లోని ఒకానొక ప్రాంతంలో యిద్దరు నల్ల వాళ్ళు కలుసుకున్నారు.

వాళ్ళలో ఒకతనికి ఆ ప్రాంతంలో పని చేయటానికి పర్మిట్ వుంది. మరొకతనికి లేదు: అంటే హద్దుమీరి ఆ ప్రాంతానికి వచ్చినందుకుగాను అతడిని పోలీసులు కటకటాలలో పెట్టొచ్చన్నమాట.

అంతలో అకస్మాత్తుగా ఒక పోలీసు అటువైపు వస్తూ కనిపించాడు. "ఏయ్! ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏవీ, మీ పర్మిట్లు చూపించండి!" అని చెయ్యి చాచాడు పోలీసు, దూరం నుండే.

"త్వరగా! నువ్వు ముందు పరిగెత్తు! నీ వెనకాలనే నేనూ వస్తా!" అని చెప్పాడు పర్మిట్ వున్న మిత్రుడు. వెంటనే మిత్రులు యిద్దరూ కాలికి బుద్ధి చెప్పారు: అంటే పరిగెత్తిపోయారు అనమాట!

వీళ్లు పారిపోవడం చూసిన పోలీసు "ఆగండి...ఆగండి" అని అరుస్తూ వెంట పడ్డాడు. అట్లా చాలాదూరం‌ పరుగు పెట్టాక గానీ, పర్మిట్ ఉన్న వ్యక్తి పోలీసు చేతికి చిక్కలేదు.

"ఇప్పుడు చిక్కావు! ఇక నీతో ఆటాడుకుంటాను!" అనుకున్న పోలీసు, ఆయాసపడుతూనే అతడిని అడిగాడు- "ఏదీ, నీ పర్మిట్ చూపించు!" అని.

తత్తర పడుతున్నట్లుగా నటిస్తూ అతను కొంత సేపు ఆ జేబు యీ జేబు వెతికి, చివరికి తన పర్మిట్ తీసి చూపించాడు!

పోలీసు కంగు తిన్నాడు: "పర్మిట్ ఉంచుకొని కూడా ఎందుకు పరిగెత్తావు?!" అని అరిచాడు అసహనంగా.

"డాక్టర్‌ సలహా ప్రకారం పరిగెత్తాను సార్‌ ! డాక్టరుగారు నన్ను రోజు ఒక మైలు దూరం పరిగెత్తమన్నారు!" అన్నాడు అతను. "అలాగయితే మరి నీ స్నేహితుడెందుకు పరిగెత్తాడు?" అని పోలీసు అడిగాడు.

"ఎవరు?" అంటూ అటూ ఇటూ చూసాడు నల్ల అతను. పర్మిట్ లేని వ్యక్తి ఆ సరికి కంటికి కనబడనంత దూరం పారిపోయి ఉన్నాడు.

"నీకంటే ముందు పరుగు పెట్టిన వాడు!" అన్నాడు పోలీసు చికాకుగా.

"ఓహ్ అతనా! అతన్ని కూడా డాక్టరు పరిగెత్తమన్నాడు సార్!" అన్నాడు నల్లవాడు.

"ఆగండి! ఆగండి!‌" అని నేను మీ వెంట పడుతుంటే కనీసం ఆగలేదు మీరు- ఎందుకు? పోలీసు ఆగమన్నప్పుడు ఆగాలని తెలీదా?!" అని అడిగాడు పోలీసు, మరింత పట్టుదలగా.

"'మీకు కూడా పొట్ట బాగా వచ్చింది కదా, డాక్టరుగారు మిమ్మల్ని కూడా పరుగెత్తమన్నాడేమో!' అనుకున్నాను సర్. మీరు ఊరికే తోడు కోసం మమ్మల్ని ఆగమంటున్నారేమో అనుకున్నాను!" అన్నాడతను నింపాదిగా.

ఇంక ఏమీ‌ అనలేని పోలీసు పళ్ళు నూరుకుంటూ వెనుతిరిగాడు.