అనగనగా ఒక దేశం. ఆ దేశంలో కారులు, బైకులు ఉండవు. ఆ దేశంలో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడి పేరు జేమ్స్. జేమ్స్ నాకు ఒక లేఖ రాశాడు. దానిలో ఏమి ఉంది అంటే, 'అక్కడ వాళ్ల లోకంలో ఎగిరే తివాచీ, ఎగిరే బూజు కర్ర దొరుకుతాయట! దానిని తను కొనుక్కున్నాడట!

ఇప్పుడు వాళ్ల దేశంలో కారులు, బైకులు కన్నా అవే ఎక్కువగా ఉన్నాయట! వాటి మీదే తను రోజు బడికి వెళుతున్నాడు. అవి కూడా బాగా చవక ధరలోనే అమ్ముతున్నారు.

ఒకసారి వాటి మీద ఎగురుతూ జేమ్స్, వాళ్ళ స్నేహితులు అడవికి వెళ్ళారట. అక్కడ ఎన్నో విచిత్రమైన జంతువులను చూసారు. అయితే, వీళ్ళు చూస్తుండగా ఆ జంతువుల మధ్యన ఏదో కలకలం‌ రేగింది. ఆ గందరగోళంలో వాళ్ల బూజుకర్ర ఎక్కడ పడిపోయిందో, పడిపోయింది!

దాని మీద ఆశ పెట్టుకొని వీళ్లెవ్వరూ తాము వెళ్ళిన చోటుకు దారి కూడా చూసుకోలేదు. ఇప్పుడు ఇంటికి వెనక్కి వెళ్ళేదెలాగ?! వాళ్ళంతా చాలా భయపడ్డారు. అయితే సరిగ్గా ఆ సమయానికి అటుగా వెళ్తున్న ఒకాయన వాళ్ళని చూసి ఆగాడు: "ఏమైంది? ఏమైనా సమస్య?" అని అడిగాడు. వాళ్ళు తమ బూజుకర్ర పడిపోయిన సంగతి చెప్పారు.

"దానిదేమున్నది, దాని పేరు పెట్టి పిలవండి, వస్తుంది!" అన్నాడాయన.

జేమ్స్ బిక్క మొఖం వేసాడు. "మా బూజుకర్రకు ఇంకా పేరు పెట్టలేదు!" అన్నాడు.

అయ్యో, అందుకనే నేను ఎప్పుడూ చెబుతుంటాను, "బూజుకర్రలు కొనగానే వాటిని రిజిస్టర్ చేయాలి" అని అన్నాడాయన జాలిగా. "అయినా పర్లేదు, ఈమధ్య వాళ్ళు వాటికి గొంతును గుర్తుపట్టే విద్య కూడా నేర్పుతున్నారు. మీ బూజుకర్ర మీ గొంతును గుర్తుపట్టచ్చు. ఏదైనా ఒక పాట- 'రా రా రా, బూజుకర్రా, రా' లాంటిది పాడండి" అని చెప్పాడు ఆయన. వీళ్ళు ఆ పాట పాడేటప్పటికి ఎక్కడున్నదో గాని, బూజుకర్ర వాళ్ళ దగ్గరికి ఎగిరి వచ్చేసింది!

మిత్రులు ఇద్దరూ ఆయనకు థాంక్స్ చెప్పి, దానిని ఎక్కబోయారు.

ఆయన తన తివాచీ మీదనే వాళ్లకు దగ్గరగా వచ్చి, "మీరు ఇంకా రిజిస్టర్ చేయలేదు గనక ఈ బూజుకర్రని వాడేందుకు లేదు. ఒక పని చేయండి- మీరు దాన్ని ప్రక్కన పెట్టుకొని, నా తివాచీ మీదికే వచ్చేయండి. నేను కూడా అటే, వెళ్ళేది. మిమ్మల్ని మీ‌ ఇంటి దగ్గర దింపేసి పోతాను" అన్నాడు.

"సరే" అని వాళ్లంతా తివాచీ ఎక్కారు.

అయితే వాళ్లంతా అట్లా పోతుంటే ఒక పెద్ద పక్షి ఒకటి వాళ్ల మీద దాడి చేసింది. పెద్దాయన ఏదో‌ మంత్రం చదివేసరికి అది కాస్తా మాయమైపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే ఎంత సేపటికీ వాళ్ల ఇల్లు రాలేదు! కొద్ది సేపటికి తేరుకున్న జేమ్స్ క్రిందికి చూస్తే ఏముంది? వాళ్ళు వాళ్ళ దేశం కూడా దాటి వెళ్ళిపోతున్నారు!

"ఏంటి ఇది, మనం ఎటు పోతున్నాం?" అన్నాడట జేమ్స్ అతనితో, ఆదుర్దాగా. అతను గట్టిగా నవ్వాడు- "అహ్హహ్హహ్హ" అని. "'మీరు వట్టి తిక్క పిల్లవాళ్ళు; మీకు మంత్రాలు రావు' అని మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టేశాను. మీలాంటి వాళ్ళు మన మంత్రాల లోకంలో‌ ఉండనక్కర్లేదు. మీలాంటి మొద్దుల వల్ల మన లోకానికే చెడ్డపేరు వస్తుంది. అందుకనే ఇప్పుడు మిమ్మల్ని ఆఫ్రికా తీసుకెళ్ళిపోతున్నాను. అక్కడ మిమ్మల్ని క్రింద పడేసి నేను వెనక్కిపోతాను! మిమ్మల్ని వదిలించినందుకుగాను మన ప్రభుత్వం ఇచ్చే బహుమతులను అందుకుంటాను!" అన్నాడు కోపంగా.

"మాకైతే మంత్రాలు రావు నిజమే, కానీ‌ నీకు మటుకు తెలివి లేదు!" అని జేమ్స్, వాళ్ళ మిత్రుడు ఇద్దరూ ఒక్కసారిగా ముందుకు దూకి, ఆ మాంత్రికుడినే తివాచీ మీదినుండి క్రిందికి నెట్టేసారు! అతను హాహాకారాలు చేస్తూ అంత ఎత్తునుండి క్రింద పడిపోయాడు.

అటుపైన వీళ్ళు తివాచీని వెనక్కి తిరగమంటే అది తిరగలేదు: వీళ్ళు దాని యజమానులు కారు కదా?! వీళ్ల గొంతులు వేరాయె!
అప్పుడు జేమ్స్ కొంచెం ఆలోచించి, మిత్రుడిని కూడా తన బూజుకర్ర మీద కూర్చోమని, దానికి తమ ఇంటి అడ్రసు చెప్పాడు! మరుక్షణం ఆ బూజుకర్ర గాలిలోకి లేచి, వీళ్ల లోకం వైపుగా వెనక్కి తిరిగింది.

తివాచీ మటుకు దాని దారిన అది ఆఫ్రికా వైపుకు ఎగిరి వెళ్ళిపోయింది!

అట్లా క్షేమంగా ఇల్లు చేరుకున్నాక ఊపిరి పీల్చుకున్న మిత్రులిద్దరూ "ఈ మాయ మంత్రాల లోకం‌ కంటే అవి లేని మీ లోకమే చాలా మంచిది! అక్కడ అందరినీ కనీసం బ్రతకనిస్తున్నారు!" అనుకున్నారట!

ఆ సంగతి చెప్పేందుకే, జేమ్సు నాకు ఉత్తరం వ్రాసాడు!