మారుతీపురంలో ఉండే ఆకాష్‌కి చాలా గుండె ధైర్యం. దేనికీ భయపడే వాడు కాదు.

ఒకసారి వాడు ఏదో పని పడి భీమాపురానికి బయలుదేరాడు. ఆ ఊరికి వెళ్ళే దారిలో ఒక చింత చెట్టు ఉంది. 'ఆ చెట్టులో ఒక దెయ్యం ఉంది' అని చెప్పుకునేవాళ్ళు. "పగటి పూట అది ఎవరినీ ఏమీ అనదు; కానీ రాత్రి పూట మాత్రం ఎవరైనా అటుగా వచ్చినట్లయితే వాళ్లని రకరకాలుగా భయపెట్టి పగలబడి నవ్వుతుంది" అనుకునేవాళ్ళు అంతా. ఎవరో ఆకాష్‌కు కూడా చెప్పారు ఆ సంగతి: "చీకటి పడేలోపు చింత చెట్టు దాటి పో" అని.

అయితే వీడు ధైర్యవంతుడుకదా, భయపడలేదు. చెట్ల కొమ్మలు నరికే కత్తితో పాటు కొన్ని సామానులను తన చేతి సంచిలో పెట్టుకొని, భీమాపురానికి బయలుదేరాడు. ఊరికి వెళ్ళి పని ముగించే సరికి సాయంత్రం అయింది.

"వెళ్ళొస్తాను ఇంక" అని మారుతీపురానికి బయలు దేరాడు వాడు. ఆ ఊళ్ళో వాళ్ళత్త "ఇప్పుడు, ఈ సమయంలో వద్దులేరా, రేపు ప్రొద్దున్నే వెళ్దువు. దారిలో చింతచెట్టు దగ్గర అల్లరి దెయ్యం ఉంది. దానితో‌ నీకెందుకు?" అన్నది. కానీ మనవాడు దానికి భయపడలేదు. "నేను వెళ్లాల్సిందే" అని పంతం పట్టి, చీకటి పడుతుండగా తమ ఊరికి బయలు దేరాడు.

చింతచెట్టును చేరుకునే సరికి చీకటి పడుతున్నది. దయ్యం ఆకాష్‌ ని చూడగానే చెట్టు మీది నుండి క్రిందికి దూకింది. గబగబా ఆకాష్ ముందుకు వచ్చి నిలబడి, "హి హి హీ!" అని నవ్వింది. చీకటిలో‌ దాని పళ్ళు మిలమిలా మెరిసాయి.

ఆకాష్ తన సంచీలో చెయ్యి పెట్టి పట్నంలో కొనుక్కొచ్చిన మాస్క్ ఒకదాన్ని బయటికి తీసాడు. అది బ్రహ్మరాక్షసుడి మాస్క్. వాడు ముఖానికి దాన్ని పెట్టుకొని, దయ్యం కంటే భయంకరంగా నవ్వాడు!

దయ్యం‌ ఒకక్షణం బిత్తరపోయింది. అయినా తేరుకొని, తన చేతి గోళ్ళు ముందుకి చాచింది. వాడిగా, వంకరలు తిరిగి వెన్నెలలో మిలమిల మెరిసాయవి.

మనవాడు గబుక్కున సంచిలో చెయ్యి పెట్టి, తను కొనుక్కున్న గ్లవ్స్ బయటికి తీసాడు. అవి ప్లాస్టిక్ గోర్లతో ఇంకా బాగా మెరిసాయి. వీడు వాటిని చేతులకు తగిలించుకొని, మరింత ధైర్యంగా దయ్యం వైపుకు నడిచాడు. "ఓలమ్మో! నిజం రాక్షసుడు!" అని అరుస్తూ దయ్యం‌ వెనక్కి తిరిగి పరుగు పెట్ట సాగింది. వీడు తను తెచ్చుకున్న కత్తి పట్టుకొని దాని వెంట పడి, చివరికి దాని జుట్టు పట్టుకొని వెనక్కి లాగాడు!

ఆశ్చర్యం, దయ్యం‌ జుట్టు పూర్తిగా ఊడి చేతులోకి వచ్చింది! "ఓలమ్మో! నా జుట్టు! నా జుట్టు పీక్కున్నాడు రాచ్చసుడు!" అని గట్టిగా అరిచిందది.

"ఎహె! రాచ్చసుడు లేడు, గీచ్చసుడు లేడు" అంటూ‌ పొదల్లోంచి బయటికొచ్చిన మరొక దయ్యం, ఆకాష్‌ని చూడగానే కెవ్వున కేక పెట్టింది.

ఒక చేత్తో దయ్యం జుట్టును, మరొక చేత్తో కత్తిని చేత పట్టుకున్న ఆకాష్ వాటిని ఊపుతూ, ఇంకా బలంగా నవ్వుతూ "ఇప్పుడు దొరికినై దయ్యాలు! మనుషుల్ని తినీ తినీ నాకు విసుగు పుట్టింది. ఇప్పుడు వీటిని తిని పండగ చేసుకుంటాను" అని అరిచాడు. "అయ్యో! చమించు! మేం మడుసులమే! మమ్మల్ని వదిలెయ్యి" అంటూ కాళ్ల మీద పడ్డాయి ఆ దయ్యాలు రెండూ.

ఆకాష్ ఒక్క క్షణం‌ బిత్తర పోయాడు. అయితే వెంటనే తేరుకొని "మడుసులైతే దయ్యాల వేసం వేసినారు ఎందుకురా?!" అని అరిచాడు.

"మా మడుసులు ఇక్కడ నిదులకోసం తవ్వుతున్నారు సోమీ, నడి రేత్తిరి వరకూ పని నడుస్తాది. అందుకని ఇక్కడికి వేరే ఎవ్వురూ రాకుండా మేం ఇట్టా వేసం వేసినాం" చెప్పింది ఒక దయ్యం, ఏడుస్తూ.

"నేను ఆ నిధులకు కాపలాగా వచ్చిన కొత్త రాక్షసుడిని. మర్యాదగా ఇక్కడినుండి పోయారా, సరే సరి. లేకపోతే రేపు రాత్రి మిమ్మల్ని అందరినీ కాల్చుకొని తింటాను" అని వాటిని బెదిరించి, పొదల్లోకి తరిమి, తన దారిన తాను చక్కా పోయాడు ఆకాష్.

తర్వాతి రోజున "పోలీసులను వెంటబెట్టుకొని అక్కడంతా తిరుగుదామా" అనుకున్నాడు గానీ, "అంత అవసరం ఉండదు" అని ఆగిపోయాడు వాడు. అయితే వాడి మంత్రం పని చేసినట్లుంది. ఆరోజునుండి అక్కడ ఎవ్వరికీ‌ ఇక దయ్యం కనిపించలేదు. జనాలు ఆ దారిన నిర్భయంగా తిరగసాగారు.