నివసించే రాణికి పూలన్నా, పూలమొక్కలన్నా చాలా ఇష్టం.

ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో తను ఒక పూల తోటను పెంచేది. రోజూ నిద్రలేవగానే ఆ మొక్కల దగ్గరికి పోయి, వాటితో మాట్లాడేది; ఎండిపోయిన ఆకులు అవీ ఏరేసేది; మొక్కలకు నీళ్లు పోసేది; పూల తోటలో ఎగిరే సీతాకోకచిలుకలతో పాటు తనూ ఎగిరేందుకు ప్రయత్నించేది. సాయంత్రం బడినుండి రాగానే కొత్త కొత్త మొక్కలు నాటి, మళ్ళీ నీళ్ళు పోసేది!

అదే ఊళ్లో ఉంటాడు రాము. వాడిది చాలా నష్టబుద్ధి. సాయంత్రం రాణి అటు ఇంట్లోకి వెళ్ళగానే ఇటు వచ్చి, కావాలని ఏదో ఒక నష్టం కలిగించి పోయేవాడు వాడు. ఎవ్వరూ చూడట్లేదంటే ఏదో ఒక పూల మొక్కని పీకి పడేసి పోయేవాడు.

ఈ పని రోజూ జరగటంతో రాణికి కోపం వచ్చింది. "ఎవరో నా మొక్కలను రోజూ పాడు చేస్తూన్నారు. వాళ్ళని పట్టుకోవాలి!" అని ఒకరోజు సాయంత్రం ఒక ప్రక్కగా దాక్కొని చూసింది.

'తన తోటని పాడు చేస్తున్నది రామూనే' అని రూఢిగా తెలిసాక, వాడిని నిలేసింది: "రామూ! నువ్వు చేసేది తప్పు! ఇట్లా కుదరదు! నువ్వు ఎన్ని మొక్కలు పీకేసావో, అన్ని మొక్కలు నువ్వే తిరిగి తెచ్చి నాటాలి!" అని.

కానీ వాడు వెటకారంగా నవ్వి, "నేను నాటను! నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో" అని ఊరికే నిలబడ్డాడు.

"వీడు ఇట్లా చెబితే వినడు" అని రాణి పోయి రామూ వాళ్ళ అమ్మతో ఫిర్యాదు చేసింది. "అక్కా, చూడు! రాము నా తోటలోని మొక్కలను పీకి పడేస్తున్నాడు. నేను వద్దంటే వెటకారంగా నవ్వుతున్నాడు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి" అని.

సరిగ్గా ఆ సమయానికే అటుగా వచ్చాడు రాము. వాళ్ల అమ్మ వాడిని పిలిచి "ఏరా, నిజమేనా? ఆ పాప ఇష్టంగా పెంచుకునే మొక్కలు పీకేశావా? తప్పుకాదా? నువ్వు పెంచుకొనే మొక్కని ఆ పాప పీకేస్తే ఎలా ఉంటుంది నీకు?" అన్నది.

వాడు చటుక్కున ఏడుపు లంకించుకుంటూ, "పీకెయ్యమను! నా మొక్కని పీకెయ్యమను ఆ పాపని!" అంటూ లోపలికి పరుగు తీసాడు.

"చూడమ్మా, రాణీ! రాము ఒకే ఒక మొక్కను కుండీలో పెంచుకుంటున్నాడు. అదంటే వాడికి చాలా ఇష్టం. కానీ దాన్ని కూడా రోజూ నీళ్ళు పోయకుండా చంపుతున్నాడు. నువ్వు కావాలంటే ఆ మొక్కను తీసుకెళ్ళిపో! దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం" అన్నది, ఆ కుండీని చూపిస్తూ.

రాణి దాని దగ్గరికి వెళ్ళి, ఆ మొక్కని ప్రేమగా తడిమి, కాసిని నీళ్ళు తెచ్చి పోసింది. "వద్దులెండి అక్కా! వాడికి అంత ఇష్టమైన మొక్కని నేను తీసుకెళ్ళిపోతే వాడికి ఏం బాగుంటుంది? దాన్ని ఇక్కడే ఉండనివ్వండి. నేను రోజూ వచ్చి దానికి కూడా ఒక చెంబెడు నీళ్ళు పోసి పోతాను" అంది.

కిటికీలోంచి ఇదంతా వింటున్న రాముకు మనసులో ఏదో కదిలినట్లు అయింది.

ఆ తర్వాత వాడు ఆ మొక్కకి రోజూ నీళ్ళు అందించటమే కాక, మరిన్ని పూల మొక్కలు తెచ్చి నాటాడు. తమ ఇంట్లో‌ నాటటమే కాదు; రాణికి కూడా తెచ్చి ఇచ్చాడు! మొక్కల సంరక్షణలో రాణితో సమంగా పాలు పంచుకున్నాడు. తనకు మంచి స్నేహితుడయ్యాడు.

వాడిలో‌ వచ్చిన మార్పును చూసి వాళ్ల అమ్మ కూడా చాలా సంతోషపడ్డది.