గోవాలో ఉండే శ్రీర్ధన్‌కు చాలా బలం, ధైర్య సాహసాలు ఉండేవి. వాడికి బాడీబిల్డింగ్ అన్నా, వ్యాయామం, సముద్రంలో ఈత, సర్ఫింగ్ మొదలైన ఆటలు, సాహసక్రీడలన్నా చాలా ఇష్టం.

ఒకసారి వాడు, వాడి మిత్రులు అంతా తరగతి గదిలోనే సమావేశం పెట్టి, "ఈ సంవత్సరం విహారయాత్రకు అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తే బాగుంటుంది" అనుకున్నారు. వాళ్ళు ఎంత సీరియస్‌గా చర్చించుకున్నారంటే, తరగతిలోకి శివ సార్‌ వచ్చిన విషయాన్నే వాళ్ళు గుర్తించలేదు.

అయితే సార్ చెప్పారు- "గోవా నుండి అరేబియా మహా సముద్రంలో ప్రయాణించి, కన్యాకుమారి దగ్గర బంగాళాఖాతంలోకి పోవాలి. చెన్నైలో షిప్ మారాలి. పోర్ట్ బ్లెయిర్‌కు ప్రయాణమే వారం-పది రోజులు పడుతుంది. వెనక్కి వచ్చేందుకు మరో పది రోజులు! అంటే ట్రిప్పుకు కనీసంగా ఇరవై-ఇరవై ఐదు రోజుల సమయం పడుతుందనమాట! అందుకని ఇది మన బడి విహారయాత్రకు సరిపోదు" అని.

పిల్లలంతా ప్రాధేయపడ్డ మీదట, శివసార్ అన్నారు- కావాలంటే మనం కొంతమందిమి ఎండాకాలం సెలవల్లో ఆవిధంగా ప్లాన్ చేయచ్చు. పడవ ప్రయాణపు ఖర్చే ఒక్కో‌ పిల్లవాడికీ పది వేల రూపాయలవరకూ కావచ్చు. రిస్కు కూడా చాలా ఉంటుంది. మరి మీ పేరెంట్స్ ఏమంటారో, అడిగి చూడండి. ట్రిప్పుకు వచ్చేవాళ్లకు ఈత తప్పని సరిగా వచ్చిఉండాలి.." అని.

సెలవలు మొదలవ్వగానే అంతా అండమాన్‌-నికోబార్‌ దీవులకు షిప్‌లో బయలు దేరారు.

రెండు రోజులు ప్రయాణం చక్కగా సాగింది. మూడో రోజున అనుకోకుండా షిప్‌ సముద్ర మధ్యంలో నిలబడిపోయింది! "షిప్ రిపేరుకు వచ్చింది. దీనిని బాగుచేసేవాళ్ళు ఇప్పుడు రష్యా నుండి రావాల్సి ఉంటుంది!" అన్నాడు షిప్‌ కెప్టెన్. అందరూ "ఓ..!" అని మూలిగారు- "అంటే మనం ఇక్కడే నాలుగైదు రోజులు ఇరుక్కు పోయాం అనమాట!" అంటూ.

అయితే మన శ్రీ వర్ధన్‌ మాత్రం నీళ్ళను చూసుకుంటూ కుర్చున్నాడు. అంతలోకే అతని ముందు నీళ్ళలోంచి డాల్పిన్‌ ఒకటి తల బయటికి పెట్టి చూసి, మళ్ళీ బుడుంగున మునిగి, కొద్ది దూరంలో దూరంగా తేలింది.

దాన్ని చూడగానే శ్రీవర్ధన్‌ తన ప్రక్కనే దగ్గర ఉన్న బకెట్‌లోని చేపను ఒక దాన్ని తీసి సముద్రంలోకి విసిరేసాడు. ఆ చేప సముద్రంలో పడేలోగా డాల్ఫిన్‌ చటుక్కున పైకి ఎగిరి ఆ చేపను అందుకుంది!

అట్లా రోజూ ఈ డాల్ఫిన్‌ షిప్ దగ్గరికి రావటం, వీడు చేపలు విసిరితే అది పైకి ఎగిరి, పల్టీ కొట్టి అందుకోవటం, అటుపైన నీళ్ళమీద తేలుతూ సముద్రపు నీళ్లనే ఫౌంటెన్ లాగా విరజిమ్మటం, వీడు ఈల వేసినప్పుడు తనూ ఈల వేస్తున్నట్లు అరవటం, ఇట్లా జరుగుతూ పోయింది.

నాలుగో రోజుకి పడవ రిపేరయి, చెన్నై వైపు ప్రయాణం మొదలు పెట్టింది. అందరూ సంతోషపడ్డారు కానీ, శ్రీ వర్ధన్‌కి మాత్రం డాల్ఫిన్‌ని వదిలేసి వెళ్తున్నందుకు విచారమే వేసింది. కానీ ఆశ్చర్యం! డాల్ఫిన్ ఇప్పుడు షిప్ వెనకనే రావటం మొదలు పెట్టింది! షిప్ ఎక్కడ ఆగినా అది పైకి వచ్చి, శ్రీ వర్ధన్‌ని పిలుస్తున్నట్లు ఈల వేస్తున్నది!

చెన్నై దాటి బంగాళాఖాతంలో ప్రయాణం మొదలయ్యాక, వాతావరణంలో స్పష్టమైన మార్పు తెలియ వచ్చింది. 'రెండు సముద్రాల నీళ్ళూ, వాటి తీరూ వేరు!'; 'రెండింటిలోనూ పెరిగే జీవజాలాలు వేరు!': "మరి ఈ నీళ్ళలో మన డాల్ఫిన్‌ బ్రతుకగల్గుతుందా?" అని అడిగాడు శ్రీవర్ధన్. శివసార్ చెప్పాడు:

డాల్ఫిన్‌లు గోవా ప్రాంతంలోనూ ఉన్నాయి, ఇటు అండమాన్ వైపు కూడా ఉన్నాయి. అందువల్ల అది 'ఇక్కడ బ్రతకలేకపోవటం' అంటూ లేదు. ఏమంటే డాల్ఫిన్‌లు సామాజిక జీవులు. గుంపులుగా ఉండేందుకు ఇష్టపడతాయి. దీని గుంపును వదిలి ఇది ఒక్కటీ మనతో బాటు వస్తోందంటే, మన బాధ్యత ఇంకా ఎక్కువ అయిందనమాటే.. దాని భద్రత మనదే!"

ఆ రోజున, అటు తర్వాత కూడా రెండు రోజులు డాల్ఫిన్ కనబడలేదు. శ్రీవర్ధన్ విచారం ఎక్కువైంది. షిప్‌లో పరిచయం అయిన గజ యీతగాళ్ల దగ్గర ఆక్సిజన్ సిలిండర్, సముద్రంలోకి దిగేప్పుడు పనికి వచ్చే డ్రస్ ఒకటి ఇప్పించుకొని, రక్షణకోసం అన్నట్లు రెండు కత్తులు కూడా నడుముకు తగిలించుకొని, శివ సర్ చూస్తూండగానే సముద్రంలోకి దూకాడు. పైనుండి అతన్ని వారిస్తున్నాడు సర్.. కానీ అతను వినిపించుకోలేదు..

సముద్రంలో కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఎరుపు రంగు కలిసిన నీళ్ళలో దూరంగా కనిపించింది డాల్ఫిన్- అయితే దానికి దగ్గర్లోనే తిరుగుతున్నదొక సొరచేప!

ఆ సొరచేపను షిప్ వైపుకు రానివ్వకుండా దూరంగా ఉంచేందుకు డాల్ఫిన్ ప్రయత్నిస్తున్నది. ఈదుకుంటూ అది ఉన్నవైపుకు పోయాడు వర్ధన్. సొర చేప ఇతని వైపుకు వేగంగా రాసాగింది. వర్ధన్ కత్తుల్ని రెండు చేతులతోటీ పట్టుకొని దాని వైపుకు పోయాడు గానీ, అది ఇతన్ని తప్పించుకొని వెనకగా వచ్చి, బలంగా నెట్టింది.

అదుపు తప్పిన వర్ధన్ మరో వైపుకు పోతూ, తనకు ఎదురుగా వచ్చిన చేపను ఒకదాన్ని కత్తులతో తెగ కోసాడు! వాటి రక్తానికి ఆకర్షింపబడి సొరచేప అటువైపుకు దూసుకు వచ్చింది.

ఒక క్షణం ఆలస్యం అయినా అది వర్ధన్‌ మీదికి దూకేదే- అయితే అంతలోనే డాల్ఫిన్ వేగంగా వచ్చి దానిని గుద్దింది. తేరుకున్న సొరచేప ఇప్పుడు వర్ధన్‌ని, డాల్ఫిన్‌నీ ప్రధాన శత్రువులుగా గుర్తించి, వర్థన్ వైపుకూ దూసుకు రాబోయింది!

అయితే మధ్యలోనే దాన్ని అడ్డుకున్న డాల్ఫిన్, చటుక్కున దాన్ని పైకి ఎత్తి విసిరింది. వెంటనే శ్రీవర్ధన్ కూడా తన దగ్గరున్న విషపు కత్తులను దాని మీదికి విసిరాడు. రెండు కత్తులూ సొరచేప కడుపును చీల్చి వేసినై! సొరచేప గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది!

కానీ అంతలోపే శ్రీ వర్ధన్‌ ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోసాగాయి. ఆ సంగతి అర్థమైనట్లు, డాల్ఫిన్‌ చటుక్కున అతని క్రిందుగా వచ్చి, అతన్ని వేగంగా నీళ్ల పైకి చేర్చింది!

శివ సార్, ఇతర పిల్లలు అతనికి చేతులు అందించి షిప్ పైకి లాక్కొని, ప్రథమ చికిత్స చేసారు. తనకు ఇష్టమైన డాల్ఫిన్ కోసం సొరచేపతో యుద్ధం చేసిన వర్ధన్ సాహసాన్ని ఒకవైపున మెచ్చుకుంటూనే, అంత అతి చేసినందుకు వాడిని మందలించారు షిప్‌లోని వాళ్ళు అందరూ!

వాడిని కాపాడిన డాల్ఫిన్‌కు అందరూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దానికి తమ దగ్గరున్న చేపలను ఆహారంగా వేసారు! అటుపైన వాళ్ల అండమాన్ యాత్ర గొప్పగా సాగింది.


అండమాన్ నుండి వెనక్కి వచ్చేంతవరకూ కూడా డాల్ఫిన్ వీళ్ల షిప్‌ను అనుసరించి వస్తూనే ఉంది!