హుస్నాబాదులో చింటు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి మనుషుల కంటే జంతువులంటేనే చాలా ఇష్టం.

ఒకరోజున వాడు బడినుండి ఇంటికి వస్తుంటే చిన్న కుక్క పిల్ల ఒకటి కనిపించింది. అది 'కుయ్-కుయ్' మనుకుంటూ ఆ వీధిలో అందరి ఇళ్ళలోకీ వెళ్తోంది; ఎవరింటికి వెళ్ళినా, కొద్ది సేపటికి వాళ్ళు దానిని చూడటం, బయటికి తరమటం!

'వాళ్ళ అమ్మ ఏమైనా దగ్గర్లో ఉందా?!' అని శ్రద్ధగా ఒక అర్థగంట సేపు అక్కడే నిలబడి చూసాడు చింటూ. పెద్ద కుక్కలు ఏవీ ఆ దరిదాపుల్లో లేవు.

దాంతో వాడికి ధైర్యం వచ్చి, దాని దగ్గరికి వెళ్లి దాన్ని ఎత్తుకున్నాడు.

అది 'కుయ్ కుయ్; మనటం ఆపి, నాలుక బయట పెట్టి వాడిని నాకేందుకు ప్రయత్నించింది. చింటు దాని వీపును కొద్ది సేపు నిమిరి, వదిలేద్దామనుకున్నాడు, కానీ చేతులు రాలేదు. చివరికి దాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళాడు వాడు.

చింటూ వాళ్లమ్మ కుక్క పిల్లని చూడగానే కెవ్వుమని అరిచి, చింటూని ఇష్టం వచ్చినట్లు తిట్టి, "బట్టలు మార్చుకొని చేతులు సబ్బుతో‌ కడుక్కో పోరా!" అని అరిచింది. "అది ఈ ఇంట్లోకి రావటానికి లేదు. ఇన్ని పనులున్నై; ఇంకా దానికి కూడా వండి వార్చాలంటే నావల్ల కాదు!" అన్నది.

ఇంకొంత సేపటికి వచ్చిన చింటూ వాళ్ళ నాన్న కుక్కపిల్లని చూడగానే పులిని చూసినట్లు భయపడ్డాడు: "ఇదిగో అబ్బాయీ! నువ్వు దీన్ని ఎక్కడికి పంపుతావో‌ పంపించు, ఇది మాత్రం‌ ఇక్కడ మా పరుపులెక్కి తిరిగే వీలు లేదు అంతే!" అని తిట్లు లంకించుకున్నారు.

"ఇప్పుడు ఏం చేయాలి దీన్ని?!" అనుకుని, ఆ కుక్కని ఎత్తుకుని ఇంటి బయటికి వచ్చాడు చింటూ. దాన్ని పంపనూ లేడు; ఉంచుకోనూ లేడు! చివరికి వాళ్ళ ఇంటి సరిహద్దు గోడకు ఆనించి దాని కోసం‌ ఒక చిన్న ఇల్లు కట్టాడు. వాళ్ల అమ్మా నాన్నాఏమైనా అంటారేమో అని చూసాడు కానీ వాళ్ళు ఏమీ అనలేదు.

మొదట్లో అమ్మ తనకోసం పోసే పాలలోంచే కొన్ని దానికి పోసాడు వాడు. అది చూసి ఇంట్లో వాళ్ళు విసుక్కుని, కొన్ని పాలు తామే ఇవ్వటం మొదలు పెట్టారు.

అట్లా కొన్ని రోజులు గడిచాక, అది ఇంట్లో వాళ్ళు వదిలేసిన కూరల్ని, అన్నం మెతుకుల్ని కూడా తినసాగింది. ఇప్పుడిప్పుడే చింటూ వాళ్ల అమ్మ కూడా దానికి కొంచెం కొంచెం అన్నం పెడుతోంది. దాని మెడలో ఒక గొలుసు వేసి, రోజూ దాన్ని బయట త్రిప్పుకొచ్చేవాడు చింటూ. ఇంట్లోకి రాగానే మటుకు గొలుసు విప్పేసేవాడు.

చింటూ బడికి పోతుంటే కుక్కపిల్ల 'కుయ్ కుయ్' మంటూ‌ వాడి వెంట పడేది. వాడితో పాటు కొంచెం దూరం వెళ్లి, వాడు గదిమితే వెనక్కి వచ్చేసేది.

తన కుక్కపిల్లని బడిలో పిల్లలకు అందరికీ చూపించాలని చింటూకి బాగా కోరికగా ఉండేది, కానీ అమ్మ-నాన్న దాన్ని బడికి తీసుకెళ్ళనిచ్చేవాళ్ళు కారు. "మీ టీచర్లు ఊరుకోరు. అయినా అసలు నీకు ఒక్కడికేనా కుక్కపిల్ల ఉన్నది? వాళ్లెవ్వరూ తమ కుక్కల్ని బడికి పట్టుకొని రారెందుకు?" అనేవాళ్ళు.

ఒక రోజు సాయంత్రం అయింది- చింటూ ఇంకా బడినుండి రాలేదు.

చింటూ వాళ్ల అమ్మ ఆందోళనగా మాటి మాటికి గేటు దగ్గరికి వచ్చి చూసి వెళ్తున్నది. గేటు గడియ వేసి లేదు. కొంచెంసేపు దానివైపే చూసాక, కుక్క చకచకా లేచి, తలుపు సందు చేసుకొని బయటికి పరుగు పెట్టింది.

చింటూ వాళ్ల బడి ఎక్కడుందో దానికి తెలుసు. చింటూ వాసన పట్టుకొని రోడ్ల వెంబడి పరుగెత్తుకుంటూ పోయిందది. అక్కడ ఒక చోట తుప్పల్లో కనబడింది, చింటూ పుస్తకాల బ్యాగు!

కుక్కపిల్ల పోయి, ఆ బ్యాగు వాసన చూసి, 'అది చింటూదే' అని కనుక్కున్నది. ఆ తర్వాత వాసన చూసుకుంటూ తుప్పల వెంబడి ఉన్న కాలి బాటలో‌ ముందుకు పోయి, ఎక్కడో ఓ కాలవ చివరన ఉన్న పాడుబడ్డ భవనం చేరుకున్నది.

చింటూ అందులోనే ఉన్నాడని దానికి తెలుసు. అది గబగబా ఆ భవంతిలోకి పోబోయింది. అయితే అక్కడ ఎవరో ఇద్దరు మీసాల వాళ్ళున్నారు. వాళ్ళు ఈ కుక్కపిల్లని అదిలించి, కట్టె పట్టుకొని తరిమారు!

కుక్కపిల్ల చాలా తెలివైనది. అది ఇంక లోపలికి దూరే ప్రయత్నం చెయ్యలేదు. వెనక్కి తిరిగి గబగబా చింటూ వాళ్ళ ఇంటికి పరుగు పెట్టింది.

బడినుండి వస్తుంటే ఈ ఇద్దరు దొంగలూ చింటూని కిడ్నాప్ చేసారనమాట! కుక్కపిల్ల ఇల్లు చేరుకునేలోగా కిడ్నాపర్లు చింటూ వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసారు. "మేం చెప్పిన సొమ్ము ఇవ్వకపోతే ఇంక చింటూని మీ ఇంటికి పంపించం" అని! అంతలో కుక్కపిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి చింటూ వాళ్ళ నాన్న అంగీ పట్టుకొని లాగ-సాగింది. ముందు ఆయన "ఛీ ఛీ! వదులు!" అని అరిచాడు గానీ, కుక్కపిల్ల వదలకపోయే సరికి ఆలోచన వచ్చింది- 'ఇది ఎక్కడికో రమ్మంటోంది' అని. వెంటనే ఆయన ఇరుగు పొరుగు వాళ్లని వెంటబెట్టుకొని కుక్క పిల్ల వెంట వెళ్లాడు. అక్కడ తుప్పల్లో చింటూ బ్యాగు చూడగానే, వాళ్లంతా పోలీసులకు ఫోన్‌ చేశారు.

వాళ్ళు చెప్పిన గుర్తుల్ని పట్టుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు, భవనాన్ని చుట్టుముట్టి, దొంగలిద్దరినీ తెలివిగా బంధించారు. చింటూని విడిపించి, వాళ్ళ అమ్మనాన్నలకు అప్పజెప్పారు.

ఆ దొంగలిద్దరూ అంతర్రాష్ట్ర దొంగల ముఠా వారట! ఇప్పటికే ఎంతో మంది పిల్లల్ని కిడ్నాప్ చేసారట వాళ్ళు. కుక్కపిల్ల తెలివితేటల మూలాన ఇప్పుడు వాళ్ళ నాటకానికి తెరపడింది.

కుక్కపిల్లని పోలీసులతో సహా ఊళ్ళోవాళ్లంతా చాలా మెచ్చుకున్నారు. చింటూ వాళ్ల అమ్మ-నాన్నలు కూడా అప్పటి నుండి కుక్కని రెండో కొడుకులాగా చూసుకోసాగారు.

ఇప్పుడు కుక్క కూడా రోజూ చింటూతో పాటు బడికి వెళ్తున్నది!