చాలా కాలం క్రితం వెంగళప్ప రైతుగా ఉన్న కాలంలో అతనికి ఒక భార్య, ఒక కూతురు ఉండేవాళ్ళు: భార్య వెంగళమ్మ, కూతురు వెంగమాంబ.
వెంగమాంబ పెళ్లి యీడుకు వచ్చింది. దాంతో వెంగళప్ప అల్లునికోసం బాగా వెతికి వెతికి, చివరికి టౌనులో పని చేసే రాముడు తన అల్లుడిగా వస్తే బాగుంటుందని నిశ్చయించాడు.
ప్రతి రోజూ సాయంత్రం కాగానే రాముడు వెంగళప్ప ఇంటికి వచ్చేవాడు. అంతా కలసి కుర్చొని, టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకునే వాళ్లు. పశువుల శాలలో నుంచి అప్పుడే పిండిన గుమ్మ పాలు తెచ్చి, చిక్కటి "టీ" చేసి పెట్టే వెంగమాంబ అంటే సహజంగానే ఇష్టం అయింది రాముడికి.
అట్లా ఒక సారి పాలు తెచ్చేందుకు పశువుల శాలలోకి వళ్లిన వెంగమాంబ, కొట్టం పైకప్పు వైపుకు చూసింది.
అక్కడ ఓ వాసానికి వేలాడుతూ కనిపించింది- ఒక గొడ్డలి! అది అక్కడ చాలా కాలంగానే ఉండి ఉండాలి; కాని ఈమె దాన్ని ఇప్పుడే, చూడటం.
గొడ్డలిని చూసిన కొద్దీ ఆమె మనసులో ఆలోచనలు తిరుగాడటం మొదలైంది: "ఈ గొడ్డలి.. ఇక్కడ ఎందుకుంది? ఇది ఇట్లా వ్రేలాడుతూ ఉండటం ఎంత ప్రమాదకరమో కదా?! నాకూ రాముడికీ పెళ్ళి అయ్యిందనుకో; మాకు ఒక కొడుకు పుట్టాడనుకో; వాడు పెద్దయ్యాడనుకో; వాడు కూడా నా మాదిరే, పాలు తెచ్చేందుకు ఈ కొట్టంలోకి వచ్చాడనుకో; అప్పుడు వాడి నెత్తిమీద ఈ గొడ్డలి పడితే-.. ఎంత ఘోరం జరిగిపోతుంది?!" ఈ ఆలోచనతో ఆమె నోరు ఎండిపోయింది; పెదవులు ఆరాయి; ఉన్నది ఉన్నట్లు కూలబడిపోయి వెక్కివెక్కి ఏడవటం మొదలుపెట్టింది.
బిడ్డ ఎంతకీ రాకపోయేసరికి వెంగళమ్మ తనే పోయి చూసింది. అక్కడ ఏడుస్తున్న వెంగమాంబను చూసి ఆమెలోనుండి దు:ఖం తన్నుకొచ్చింది.
"ఎంత కష్టం రాకపోతే మరి, తన బిడ్డ ఇట్లా పశువుల కొట్టంలోకి వచ్చి కూర్చొని ఏడుస్తుంది?" అనుకున్నది. "ఏమైంది, తల్లీ? ఏమైంది? చెప్పు!" అని అడిగింది బొంగురు గొంతుతో.
"అయ్యో అమ్మా, ఏం చెప్పేది! అదిగో ఆ దుష్ట గొడ్డలిని చూడు! నాకూ, రాముడికీ పెళ్ళి అయ్యిందనుకో; మాకు ఒక కొడుకు పుట్టాడనుకో; వాడు పెద్దయ్యాడనుకో; నాలాగే వాడు కూడా పాలు తెచ్చేందుకు ఇక్కడికి వచ్చాడనుకో; ఇంత లావు గొడ్డలి వాడి నెత్తిన పడితే, ఇక నిలుస్తాయా, వాడి ప్రాణాలు?!" అని బిగ్గరగా ఏడ్చింది.
అది విని వెంగళమ్మకు కూడా దు:ఖం వచ్చేసింది. ఆమె కూడా అక్కడే కూలబడి ఏడవసాగింది.
ఎంతకీ వీళ్ళిద్దరూ రాకపోవటంతో ఈసారి స్వయంగా వెంగళప్పే వచ్చాడు కొట్టంలోకి- "ఏమైంది? ఏమైంది?!" అంటూ.
"ఆ దుష్ట గొడ్డలిని చూడు! ఊహించు!! మన అమ్మాయికి రాముడితో పెళ్ళి అయ్యిందనుకో, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడనుకో; వాడు పెద్దయ్యాడనుకో; పాల కోసం ఇక్కడికి వచ్చాడనుకో; ఈ దుష్ట గొడ్డలి వాడి పైన పడిందనుకో, వాడు నిలువునా చనిపోడా? ఎంత ఘోరం, ఎంత అమానుషం!" అని ఏడుస్తూ గొడ్డలిని కసితీరా తిట్టింది వెంగళమ్మ. అది వినగానే వెంగళప్ప పై ప్రాణాలు పైనే పోయాయి: "అయ్యో దేవుడా, ఎన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నావు!" అంటూ తను కూడా అక్కడే కూలబడి మొత్తుకోవటం మొదలెట్టేసాడు.
ఇక అక్కడ వంటగదిలో చాలాసేపు నిల్చున్న రాముడికి వీళ్లంతా ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. అంతలోనే వాళ్ళ ముగ్గురి ఏడుపులూ వినిపించే సరికి అతనికి భయం వేసింది. "ఇంతకీ ఇక్కడ ఏమి జరుగుతోందో చూడాల్సిందే!" అని అతను పశువుల పాకలోకి వచ్చాడు. అక్కడ ముగ్గురికి ముగ్గురూ కూర్చుని ఏడుస్తూ ఉండటం, పాలన్నీ ఒలికిపోయి ఉండటం చూసి ఏదో ఊహించరాని ఘోరమే జరిగిందనుకొని, "ఏమైంది!? ఎందుకు ఏడుస్తున్నారు?" అని అడిగాడు ఆత్రంగా.
"అయ్యో, ఏమి చెప్పాలి?! ఆ దుష్ట గొడ్డలికేసి ఒక్కసారి చూడు! నీకు, మా అమ్మాయికీ పెళ్ళి అయ్యిందనుకో; మీకు ఒక కొడుకు పుట్టాడనుకో; వాడు పెద్దయ్యి, పాలకోసం ఇక్కడికి వచ్చాడనుకో; ఈ గొడ్డలి జారి వాడి నెత్తిమీద పడితే,.. వాడు నిలువునా కూలిపోతే...." అని వెంగళప్ప అనటమేమిటి, మిగిలిన ఇద్దరితో బాటూ అతను కూడా ఒక్కసారిగా శోకాలు పెట్టడం మొదలుపెట్టటమేమిటి- తటాలున జరిగిపోయినై.
అయితే రాముడు బిగ్గరగా నవ్వేసి, దగ్గరలోనే ఉన్న ఒక బల్లనెక్కి, కప్పు నుండి వ్రేలాడుతూఉన్న గొడ్డలిని తీసి కిండ పడేస్తూ "నేను చాలా పల్లెలే చూసాను కానీ, మీ అంత తిక్కవాళ్ళని మటుకు ఎక్కడా చూడలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక సారి ఊళ్లన్నీ చుట్టి వస్తాను. ఎన్ని ఏళ్లైనా పట్టనీండి; మీకంటే మూర్ఖులు కనీసం ముగ్గురన్నా కనబడేంతవరకూ తిరిగి వచ్చేది లేదు. ఒకసారి అట్లాంటి గొప్పవాళ్ళు ఎక్కడైనా కనిపించారంటే, అప్పుడిక తిరిగివచ్చేసి, మీ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను" అని గుర్రమెక్కి బయలుదేరి పోయాడు.
'గొడ్డలి భయంతో పాటు ఇంటికి వచ్చిన అల్లుడు కూడా పోయాడే!' అన్న బాధతో వీళ్ళు ముగ్గురూ మళ్ళీ ఒక సారి బిగ్గరగా ఏడ్చారు.
అట్లా కొన్నాళ్ళు పోయాక రాముడికి ఒక అవ్వ కనిపించింది. అవ్వ ఇంటిమీద చవుడు మట్టి వేసి ఉన్నది. ఆ మట్టిలో కొంచెం గడ్డి పెరిగి ఉన్నది. అవ్వ ఇంటికి ఒక నిచ్చెన వేసింది. ఆవుని ఒక దాన్ని ములుగర్రతో తోలుతూ, దాన్ని నిచ్చెన పైకి ఎక్కించేందుకు తంటాలు పడుతున్నది ఆ అవ్వ.
"ఏమైందవ్వా, ఎందుకు, ఆ ఆవును అంత కష్టపెడుతున్నావ్?" అన్నాడు రాముడు.
"కళ్ళు కనిపించట్లేదా! మిద్దె మీద అంత గడ్డి ఉంటేనూ!?" అన్నది అవ్వ.
"పైకి ఎక్కితే ఏం లాభం?! క్రింద పడిపోదా?! పిట్ట గోడ కూడా లేదు కదా!" అని నవ్వాడు రాముడు.
"అందుకేగా, నేను ఇట్లా దాని మెడకు ఒక తాడును కట్టింది; ఆ తాడును పొగ గొట్టంలోనుంచి కిందికి తెచ్చి, నా నడుముకు కట్టుకున్నది?! అన్నది అవ్వ గర్వంగా.
రాము ఎంత వారిస్తున్నా వినకుండా అవ్వ ఆవును మేడ మీదికి ఎక్కించింది. అయితే పైకి చేరగానే ఆవు కాస్తా ఎగిరి గంతేసి, రెండో వైపు నుండి ధబేలున కింద పడిపోయింది! దాని ముకుతాడు రెండో కొసకు కట్టబడి ఉన్న నడుముతో సహా అవ్వ, రయ్యిమంటూ పొగ గొట్టంలోకి రాకెట్‌లా దూసుకొని పోయింది!
పొగ గొట్టంలో ఇరుక్కొని మొత్తుకుంటున్న అవ్వను విడిపించేందుకు ఊళ్లో వాళ్లు సగం మంది వచ్చాక, రాముడు ఊపిరి పీల్చుకొని, "ఆహా! మా వాళ్ళను మించిన తిక్క వాళ్ళు ఉండరేమో అనుకున్నాను. నిజంగానే ఉంది ఒకామె!" అని మురిసిపోతూ మరో ఊరికి బయలు దేరాడు.
అట్లా పోయి పోయి, ఆ రోజు చీకటి పడేసరికి ఒక సత్రం చేరుకున్నాడు రాముడు. ఆ సరికే సత్రంలో బస చేసి ఉన్న యువకుడు ఒకడు అతన్ని మర్యాదగా పలకరించాడు. ఇద్దరూ భోజనం చేసి పడుకున్నారు.
తెల్లవారి లేచేసరికి వింత దృశ్యం ఒకటి కనపడింది రాముడికి: తాము పడుకున్న రెండు మంచాలకూ కట్టి, వేలాడుతూ ఉన్నది- ఒక ప్యాంట్! ఆ కుర్రవాడు చెడ్డీలోనే పరిగెత్తుకుంటూ వచ్చి, పైకి ఎగిరి- ప్యాంటు మీదికి దూకుతున్నాడు. అట్లా దూకటం దూకటంలోనే కాళ్ళను నేరుగా ప్యాంటులోకి దూర్చాలని వాడి ప్రయత్నం! అయితే ఎన్ని సార్లు పరిగెత్తికొచ్చి దూకినా, కాళ్ళు మాత్రం ప్యాంట్‌లోకి దూరడం లేదు. అయినా వాడు పట్టు వదలట్లేదు; మళ్ళీ మళ్లీ దూకుతున్నాడు. కొద్ది సేపటికి అతను దూకటం ఆపి చెమట తుడుచుకుంటుం-డగా, "సంగతేంటి?!" అని అడిగాడు రాముడు.
"అయ్యో! ఏం చెప్పాలి మిత్రమా?! ప్రతి రోజూ నాకు ఈ శ్రమ ఏమాత్ర్రం తప్పట్లేదు. ఈ ప్యాంటుల్ని ఎవడు కనుకున్నాడో గాని, వీటిలోకి కాళ్ళు దూర్చేందుకు రోజూ నాకు ఒక గంట సమయం పడుతున్నది" అని చెప్పి, "నీకెంత సమయం పడుతుంది?" అని అడిగాడు కుర్రాడు.
రాముడు బిగ్గరగా నవ్వి ప్యాంటును ఎలా వేసుకోవాలో చూపించాడతనికి. అది చూసి ఆ కుర్రవాడు విపరీతంగా ఆశ్చర్య పోవటమే కాక, "ఆహా! మీరు మేధావులు! మీ అంత తెలివైన వాళ్ళని నేను ఇప్పటివరకూ చూడలేదు" అంటూ ఆజన్మ శిష్యుడు అయిపోయాడు.
"ఆహా! ఎవరూ ఉండరనుకుంటే, నాకు రెండో మూర్ఖుడు కూడా దొరికాడు!" అనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు రాముడు.
ఈ సారి అతనికి ఓ ఊరి పొలిమేరల్లో, చెరువు దగ్గర గుమికూడి ఉన్న మనుషులు కన్పించారు. అందరి ముఖాలలోనూ ఆందోళన! అది చూసి రాముడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, "ఏమైంది? ఎవరైనా చెరువులో పడ్డారా?" అని అడిగాడు.
"అవును- నిన్న రాత్రనగా పడ్డాడు! ఇంకా పైకి తేలలేదు" చెప్పారు వాళ్ళు.
వాళ్ల ఆందోళనలో భాగం పంచుకొన్న రాముడు కొద్ది సేపటి వరకూ అక్కడే ఆగిపోయి, కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడాడు. అప్పుడు గానీ అర్థం కాలేదు అతనికి: వాళ్ళు గాలిస్తున్నది. చంద్రుడి కోసం! "చంద్రుడు నిన్న రాత్రనగా ఈ చెరువులో జారిపడిపోయాడు. ఎంత ప్రయత్నించినా పైకి లాగలేకపోతున్నాము" అన్నారు వాళ్ళు.
"ఒరే! చెరువులోకి దూరింది చంద్రుడి ప్రతిబింబం మాత్రమే రా! అసలు చంద్రుడు ఆకాశంలో భద్రంగానే ఉన్నాడు" అని చెప్ప చూసాడు రాముడు.
అయితే వాళ్ళు ఎవరూ అతని మాటలు వినక పోవటమే కాక; కత్తులు కటార్లతో అతని మీదికే దాడికి వచ్చారు!
"బ్రతుకు జీవుడా" అని వెనక్కి పారిపోయిన రాముడికి "వీళ్ళందరికంటే వెంగమాంబే చాలా నయం!" అనిపించింది. ఈ మూర్ఖుల్ని చూసాక అతని కళ్ళు తెరుచుకున్నాయి. అటుపైన అతనికి, వెంగమాంబకు వైభవంగా పెళ్లి జరిగింది.