బుద్ధుడు భారతదేశ మంతటా పయనిస్తూ ధర్మాన్ని బోధిస్తూన్న రోజులవి. లక్షలాది మంది ఆయన మార్గాన్ని అనుసరించటం మొదలుపెట్టారు. యజ్ఞాల్నీ, క్రతువుల్నీ, జంతుబలినీ వదిలి పెట్టసాగారు. ఎక్కడ చూసినా బుద్ధుని గురించిన చర్చలే వినిపించేవి: సనాతన ధర్మాన్ని వదిలేసే వాళ్ళ గురించిన ముచ్చట్లే వినబడేవి.
శ్రావస్తీ నగరంలో కూడా జనాలు తండోప తండాలుగా బుద్ధుని వైపుకు మరలారు. ఆ నగరంలో భరద్వాజుడు అనే ముసలి బ్రాహ్మణుడి ఇంట్లో అయితే అతని భార్య, కొడుకు, కోడలు- అందరూ బుద్ధుని బాటే పట్టారు! ముసలి భరద్వాజుడు ఒక్కడే ఇంకా తన మతాన్ని పట్టుకొని నిలిచాడు.
సంప్రదాయాల్నీ, సంస్కృతినీ వదిలి, 'పర ధర్మాన్ని' చేబూనిన కుటుంబాన్ని తలచుకొని కుమిలిపోయాడు ముసలాయన. "దీని కంతటికీ కారణం బుద్ధుడే" అనుకునే-సరికి ఆయనకు విపరీతమైన కోపం వచ్చేసింది. "తప్పదు- ఈ బుద్ధుడిని చంపేయకపోతే సమాజం పూర్తిగా నాశనం అయిపోతుంది" అని భరద్వాజుడు రోకలి బండను ఒకదాన్ని చేత బట్టుకొని, బుద్ధుడుండే చోటికి బయలుదేరాడు.
సగం ముసలితనంతోటీ, సగం కోపంతోటీ వణుక్కుంటూ వచ్చిపడుతున్న భరద్వా-జుడిని అడ్డుకోబోయారు, బుద్ధుడి చుట్టూ ఉన్న శిష్యులు. బుద్ధుడు వాళ్ళందరినీ వారించి, ముసలాయన్ని పిలిచి దగ్గర కూర్చో బెట్టుకొని, కాసిని మంచినీళ్ళిచ్చి, "సంగతేంటో చెప్పు తాతా! ఏదో విషయం నిన్ను బాగా పీడిస్తున్నది. ఏంటది?” అన్నాడు.
"నేను నీతో మాట్లాడేందుకు రాలేదు. ఈ రోకలి బండతో ఒక్కటి ఇచ్చానంటే నీ తల వెయ్యి చెక్కలౌతుంది!" అరిచాడు భరద్వాజుడు.
"ఎందుకు తాతా, అంత కోపం? ఏం కష్టం వొచ్చింది?" అన్నాడు బుద్ధుడు. ఆయన ముఖంలో శాంతి చెక్కు చెదరలేదు; ఏమాత్రం అదురు, బెదురు లేవు.
"నువ్వు అందరినీ మాయ చేస్తున్నావు. వాళ్ళకు ఏవేవో నేర్పిస్తున్నావు. సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నావు. ఇవాల్టితో నీ పని ముగించాలనే వచ్చాను" ఇంకాగట్టిగా అరిచాడు భరద్వాజుడు.
బుద్ధుడు చిరునవ్వు నవ్వాడు. "అయ్యో, అట్లాంటిదేమీ లేదు- నీకు తెలుసో, లేదో- నేను అందరికీ కేవలం మూడు సంగతులు నేర్పిస్తున్నాను-
ఒకటి: నీతిగా బ్రతకటం ఎలాగో చెబుతాను; రెండు: ఏకాగ్రతను ఎలా సాధించాలో నేర్పిస్తాను;
మూడు: జ్ఞానం ఎలా వికసిస్తుందో నేర్పిస్తాను;
'శీల- సమాధి - ప్రజ్ఞ' లనే ఈ మూడూ తప్ప నేను మరో సంగతి మాట్లాడనే మాట్లాడను. అయినా వేరేవేవో మాట్లాడేంత సమయం ఎక్కడుంది నాకు?!" అన్నాడు బుద్ధుడు; ధర్మమార్గాన్ని వివరిస్తూ.
బుద్ధుడి ప్రశాంతతని చూసి భరద్వాజుడి కోపం కొంచెం చల్లబడింది. "నువ్వు చెప్పిన మూడూ ఎవరికైనా, ఏనాటికైనా సాధించాల్సినవేగా, ఇక నువ్వు కొత్తగా చెబుతున్నది ఏముంది?” అన్నాడతను, విడిచిపెట్టకుండా.
"అదే తాతా! నేను చెప్పేది కూడా అదే! ఈ మూడూ ఎట్లా చేయాలో ఆ పద్ధతి ఏదో నాకు తెల్సింది కనుక, అడిగినవాళ్ళందరికీ నేర్పిస్తున్నాను. నువ్వు అడిగితే నీకు కూడా నేర్పిస్తాను- దానిదేముంది?" అన్నాడు బుద్ధుడు, చిరునవ్వుతో.
"ఒరే మనవడా! నిజంగానే నీకేదో విద్య వచ్చురా! లేకపోతే అంత కోపంగావచ్చిన వాడిని నన్ను ఇంతలా ఎట్లా మాయచేస్తావు?" అన్నాడు భరద్వాజుడు ఆశ్చర్యపోతూ.
"ఇందులో మాయ ఏమీలేదు తాతా! నువ్వు ఎవరికైనా ఏదైనా ఒక బహుమతి తీసుకెళ్ళావనుకో; అది వాళ్ళు స్వీకరించలేదనుకో; అప్పుడింక ఆ బహుమతికి ఏమౌతుంది?" అడిగాడు బుద్ధుడు.
"ఏమౌతుంది? అది నా దగ్గరే ఉంటుంది!" అన్నాడు భరద్వాజుడు.
"అదే తాతా, నేను అనేది కూడా. నువ్వు నాకోసం ఇంత కోపాన్ని మోసుకొచ్చావు. నేను ఆ కోపాన్ని స్వీకరించలేదు! మరి ఇప్పుడు ఆ కోపం ఏమౌతుంది?" నవ్వాడు బుద్ధుడు.
భరద్వాజుడు ఆలోచనలో పడ్డాడు. "తను నీతిగానే బ్రతుకుతున్నాడు. చాలా శాస్త్రాలు చదివాడు. కానీ తనకి ఏకాగ్రత నిలవటం లేదు. ప్రజ్ఞ జాగృతం కాలేదు. ఇతన్ని చూస్తే నిజంగానే గొప్పవాడిలాగా ఉన్నాడు. ముఖ్యంగా కోపాన్ని తీసుకోకపోవటం- అది చాలా గొప్ప విద్య. ఇతనేదో నిజంగానే అన్నీ తెలిసిన వాడిలాగా ఉన్నాడు.. మెల్లగా అడిగితే నాకు కూడా నేర్పిస్తాడేమో.." అని.
బుద్ధుడు అతని మనసును పసిగట్టాడు.
"తాతా కూర్చో. నిటారుగా కూర్చో. శరీరాన్ని వదులుగా, నిశ్చలంగా ఉండనీ. వచ్చే-పోయే శ్వాసను ఎక్కడా బిగబట్టకు! గమనించు!” అంటూ తన పాఠం మొదలుపెట్టాడు.
తల పగలగొడదామని వచ్చిన భరద్వాజుడు ఊరికే చల్లబడటం మాత్రమే కాదు; ఇతరులనుండి కోపాన్ని తీసుకోకుండా ఉండే విద్యను చాలా బాగా సాధన చేశాడు. త్వరలోనే వేలాదిమందికి విశుద్ధ మార్గాన్ని బోధించే అర్హతుడు అయ్యాడు.
మంచి మనుషులు అలా ఉంటారు. వాళ్ల దారిలో అడుగులు వేసే వాళ్లందరూ కూడా మంచి వాళ్ళైపోతారు.
మంచితనానికి తనదైన శక్తి ఏదో ఉంది- నిజంగా!