"వరుణ్! వరుణ్! ఏం చేస్తున్నావురా, నువ్వు? ఎక్కడున్నావ్?” విసుక్కుంటూ వాడిని వెతికింది అమ్మ.
పడక గదిలో బెడ్ మీద పడుకొని, సెల్ఫోనులో ఏదో గీకుతున్న వరుణ్ ఆమె రాకని కూడా గమనించలేదు.
"నిన్నే! ఏం చేస్తున్నావు? టైమెంతైందో చూసావా? ఇంకో ఇరవై నిముషాల్లో స్కూల్ బస్ వచ్చేస్తుంది. నువ్వు ఇంకా ముఖం కూడా కడుక్కోలేదు!"
"ఫేస్ బుక్ అప్డేట్ చేస్తున్నాను మమ్మీ! అయినా స్కూల్ బస్ మిస్సయితే మాత్రం ఏముంది? డాడీ కారులో తీసుకెళ్లి దింపుతాడు. మా క్లాస్‌మేట్ విమల్ గాడిని వాళ్ల డాడీ రోజు దింపట్లేదా?" అన్నాడు వరుణ్, లేచి చెడ్డీ దులుపుకుంటూ.
వాడు బాత్రూంలోకి దూరే సరికి సుజాత టిఫెన్ రెడీ చేసేసి, ప్లేటులో కూడా పెట్టేసింది. వాడు కాళ్ళు ఊపుకుంటూ వచ్చి టేబుల్ ముందు కూచొని, ఒక చేత్తో సెల్ఫోను గీకుతూ, మరో చేత్తో టిఫెన్ చెయ్యటం మొదలెట్టాడు.
సుజాత నెయ్యి వేస్తుంటే 'ఛ!' అని అరిచాడు అకస్మాత్తుగా.
"ఏమైంది?!" అంది సుజాత భయపడుతూ.
"యీ నెట్ కనెక్షన్ ఏందే?! దీని మార్పించు ఫస్టు! యీ బియస్సెన్నెల్ ఇంతేనే, కేబుల్ కనెక్షన్ అయితే దీనికి టెన్ టైమ్స్ స్పీడుంటుంది!" అన్నాడు వాడు, టెలిఫోనుకేసి కోపంగా చూస్తూ.
"అవును వాడి డబ్బులు కూడా ఎక్కువే మరి!” అంది సుజాత వెటకారంగా.
"జస్ట్ డబలే మమ్మీ! బియస్సెన్నెల్ వాడికి ఊరికే ఐదొందలు కడతావు; వాడికైతే థౌంజండ్ రుపీస్ కట్టాలి. కానీ టెన్ టైమ్స్ స్పీడు ఉంటుందని చెబుతున్నాను కదా, ఇంకేమి?” అన్నాడు అనునయంగా.
బాత్రూంలో వేసి ఉన్న గీజరునూ, బెడ్రూంలో ఇంకా తిరుగుతున్న ఫ్యానునూ ఆపి వస్తూ సుజాత మళ్ళీ పురాణం విప్పింది- "నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావట్లేదు. నీ పని అయిపోగానే గీజర్ ఆపాలి. రూం లోంచి బయటికి వచ్చే ముందే ఫ్యాన్ ఆపాలి”.
"కూల్, మమ్మీ! ఛిల్లవ్వు నువ్వు కొంచెం! ఈ మధ్య వచ్చే ఫ్యాన్‌లు తెలుసా, ఎంత తిరిగితే అంతనే కరెంట్ తీసుకుంటాయి. ఇదివరకు లాగా కాదు- ఫస్ట్ నెంబర్లో పెట్టినా హై స్పీడంత కరెంట్ కాల్చవివి! టెక్నాలజీ, మమ్మీ! మనం ఆపకపోయినా ఏమీ పర్లేదు! ఏమంత ఖర్చుకాదు. జస్ట్ ఒక ఫిఫ్టీ రుపీస్ ఎక్కువ అవుతుందేమో, అంతే!" ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని వివరించినట్లు వివరించాడు వరుణ్.
"అందుకే, ఇదివరకు వంద రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఆరొందలు వస్తోంది. నువ్వు తొందరగా తినేసి గేటుదగ్గరికి పో ముందు!" వాడి చేతుల్లోకి పుస్తకాల సంచిని కూరి, బలవంతంగా బయటికి నెట్టింది సుజాత.
వాడు బడినుండి తిరిగొచ్చే సరికి కరెంటు లేదు.
"ఏంటి మమ్మీ, ఎప్పుడు పోయింది కరెంట్?” అడిగాడు.
"మధ్యాహ్నం అనగా పోయింది. ఎక్కడైనా రిపేరు చేస్తూండచ్చు" అన్నది సుజాత నిర్లిప్తంగా.
"అందుకే ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లన్నీ మెత్తమెత్తగా ఐపోయాయి. రోహిణి అత్త ఎంత ఇష్టంగా పంపించిందో కద, వాటిని? అవన్నీ వేస్టే ఇంక!” అన్నాడు వాడు.
"వేస్టెందుకైతాయి? కరెంటువచ్చాక మళ్ళీ గట్టిగా ఔతాయిగా?!" అంది సుజాత ఆత్మరక్షణ మోడ్ లోకి వెళ్ళి.
"నీకు తెలీదు మమ్మీ, చాక్లెట్ కరిగి, మళ్లీ గట్టి పడితే దాని టేస్టు మారిపోతుంది. మంచిగా ఉండదు" చెప్పాడు వాడు. \
"అందుకనే ఇప్పుడు అందరూ ఇన్వర్టర్ మీద నడిచే ఫ్రిజ్జులను కొనుక్కుంటున్నారు" అన్నాడు.
వాడికి కాంప్లాన్ కలిపిన పాలు ఇచ్చింది సుజాత. తాగుతూనే పోయి టివి ఆన్ చేయ బోయాడు వాడు. కరెంటు లేదని ఆలస్యంగా గుర్తిస్తూ- "ఇన్వర్టర్ తెమ్మందామా, డాడీని?!" అన్నాడు. "జస్ట్ ఓ ట్వంటీ థౌజండ్ ఐతే చాలు మమ్మీ, ఇంక కరెంట్ సమస్యే ఉండదు" చెప్పాడు.
"అయినా అది లేకపోతే ఏం నష్టం వొచ్చింది, మన పని మనం చేసుకోవచ్చు!” అంది సుజాత.
"అదే కదా, సమస్య?! ఐపియల్ వచేస్తుంది మమ్మీ! ఇంక నెల రోజుల వరకూ ప్రాబ్లమే!" అన్యాయం అయిపోయినట్లు ముగించాడు వాడు.
"ఇంతకీ మీ పరీక్షలు ఎప్పుడురా? మీ క్లాసు ఫస్టు మార్కులు ఎన్నొస్తాయి; నీకు ఎన్ని మార్కులు వస్తాయి?" ధైర్యంగా అడిగేసింది సుజాత.
"పో మమ్మీ! ఎప్పుడూ 'మార్కులు-మార్కులు' అంటావు. వాటిదేముంది? వస్తే వస్తాయి; లేకపోతే లేదు! అవన్నీ పట్టించుకుంటే ఇంక ఐనట్లే!"
"టీవీ, ఫ్రిజ్, సెల్ఫోన్, ఏసీ, లాప్టాపు, కెమెరా, కరెంటు, ఫేస్బుక్కు- ఇవి ఉంటే చాలు కదా; చదువులు ఏంచేసుకునేకి?!" అంది సుజాత, చికాకుగా లేచి ఇంట్లోకి పోతూ.
మనందరం ఇప్పుడు కరెంటుకు బానిసలం. రకరకాల గాడ్జెట్లకు బానిసలం. అవి లేకపోతే బ్రతుకు దుర్భరం అనిపించే స్థితి. ఈ బానిసత్వంలోంచి విముక్తిని కూడా మనమే, ఎవరికి వాళ్లం సాధించుకోవాల్సి ఉంది. సహజవనరులకోసం మనం నివసించే ఈ భూమిని పీడించకుండా ఉండాలంటే, ముందుగా మనకు మనం తెచ్చుకోవలసిన 'మరో స్వాతంత్ర్యం' ఇది! ఏమంటారు?! బానిసత్వంలోంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్న మీ అందరికీ శుభాభినందనలతో,
కొత్తపల్లి బృందం