వింధ్య పర్వతాల దగ్గరి అడవుల్లో రాముడు, భీముడు అనే ఇద్దరు దొంగలుండేవాళ్లు. వాళ్ళు రోజూ అక్కడ దారి కాచి, అటువైపుగా పోయే వాళ్ల డబ్బులు, నగలు దోచుకునేవాళ్ళు.
అట్లా దొంగిలించిన సొత్తునంతా ఒక పెద్ద మర్రిచెట్టు తొర్రలో దాచేవాళ్ళు. కొన్ని రోజులకి ఆ మర్రిచెట్టు తొర్ర మొత్తం వీళ్లు దాచిన సొమ్ముతో నిండిపోయింది.
ఆ రోజున రాముడు, భీముడు వచ్చి తమ సొత్తునంతా చూసుకొని మురిసిపోయి, "ఈ తొర్ర నిండిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి?" అని మాట్లాడుకున్నారు. బాగా తిని ఉన్నారేమో, మరి అట్లా మాట్లాడు-కుంటూనే, ఆ మర్రిచెట్టు నీడలో చిన్నగా కునికారు..
ఇంతలో "ఇదిగో దొంగలూ! మీరు ఈ సొమ్మునంతా దోపిడీలు, దొంగతనాలు చేసి సంపాదించారు కదా, ఇప్పుడు మరి తొర్ర నిండిపోయింది; దీన్నంతా ఏం చేస్తారు?" అని ఎవరో అడిగారు వాళ్లని.
రాముడు.భీముడు ఉలిక్కిపడుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
"చాలా నాళ్ళ నుండీ చూస్తూన్నాను; ఇంత మందిని ఇబ్బంది పెట్టి, మీరు ఏం సుఖపడతామనుకుంటున్నారు?" అని మళ్ళీ వినిపించాయి మాటలు.
రాముడు భీముడు చకాలున లేచి చెట్టు-చుట్టూ తిరిగి చూసారు. ఎవ్వరూ లేరు! పైన కొమ్మల్లో వెతికారు- ఒక్క పిట్ట కూడా లేదు!
"నేను.. చెట్టుని మాట్లాడుతున్నాను. ఈ తొర్ర నాదే. ఇంతకీ చెప్పండి- ఇంకొకరి శ్రమశక్తినే కదా, మీరు దోచుకుంటున్నది? ఇది న్యాయమా? మీరు అసలు ఇట్లా దొంగతనాలు ఎందుకు చేస్తున్నారో చెప్పండి. కారణం చెప్పకపోతే, మీ గురించి అందరికీ చేప్పేస్తా. రాజభటులు మిమ్మల్ని వదలరు మరి.. చూసుకోండి" బెదిరించింది చెట్టు.
రాముడు, భీముడు నిశ్చేష్టులైపోయారు. ఇన్నేళ్ళలో వాళ్లని ఎవ్వరూ ఇట్లా ప్రశ్నించలేదు మరి.
"వేరే పనిచేస్తే ఇంత సంపాదించలేం కదా?! అందుకే మేము ఈ దారి ఎంచుకున్నాం!" అన్నాడు రాముడు. భీముడు కూడా తల ఊపాడు.
"అంటే మీ ఇద్దరి సుఖం కోసం అంతమంది కష్టార్జితాన్ని స్వాహా చేస్తారన్న మాట. సరే, మీరు ఇంతకాలంగా దొంగిలించిన సొమ్ము లెక్క చూపండి. మీరు జీవితాంతం కూర్చుని తిన్నా అది ఇంకా మిగిలిపోతుంది. అయినా దొంగసొమ్ముని పెట్టుకున్నందుకు గాను మీరు అడుగడుగునా భయపడుతూ బ్రతుకుతారు. ఎందుకొచ్చిన దొంగతనాలు? సంపాదించుకున్న దానిలోంచి ఎవరికైనా దానం చేయడం నేర్చుకోవాలి గానీ?!" అంది చెట్టు.
"వేరేవాళ్ల కోసం మేం ఎందుకు కష్టపడాలి? దాని వల్ల మాకేంటి, లాభం? వాళ్ళు మాకేం చేసారు?" మొండిగా అడిగారు రాముడు, భీముడు.
చెట్టు నవ్వింది. "మీరు మాకు ఏమిచ్చారని, మేం మీకు నీడను, కాయల్ని, పండ్లను, కట్టెల్ని ఇస్తున్నాం? మీరేమిస్తున్నారు మాకు? చేసే పనులన్నిటికీ ప్రతిఫలం కావాలట- మీకు అసలు తెలివి ఉందా, లేదా?" అడిగింది చెట్టు కోపంగా. రాముడు, భీముడు తల వంచుకున్నారు. "నువ్వు చెప్పింది నిజమే" అని ఒప్పుకున్నారు. "మేం కూడా నీలాగా ప్రతిఫలాన్ని ఆశించకుండా బ్రతకగల్గితే బాగుండు. ఇతరులకు కనీసం అపకారం చేయకుండా బ్రతికితే బాగుండు" అన్నారు.
"బాగుండు అంటే చాలదు. ప్రయత్నించాలి. ఈరోజు నుండే దొంగతనాలు మానెయ్యాలి" అన్నది చెట్టు గట్టిగా.
అంతలో రాముడికి, భీముడికి ఇద్దరికీ ఒకేసారి మెలకువ వచ్చింది. "ఇది కల!" అనుకున్నారు వాళ్ళు మొదట. కానీ ఇద్దరికీ ఒకే కల, ఒకేసారి ఎట్లా వస్తుంది?
ఏమైతే నేమి, ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ దొంగతనాలు మానేశారు. అప్పటివరకూ తాము దొంగిలించిన సొమ్మును తీసుకెళ్ళి రాజుగారికి అప్పగించేసారు. కష్టపడి సంపాదించుకున్నదానితో సంతోషంగా, నిర్భయంగా బ్రతకటం మొదలుపెట్టారు.