చిలకలూరిపేటలో ఉండే చిన్నయ్య పొట్టకూటికోసం చిలక జోస్యం చెప్పేవాడు. అతని దగ్గర మాట్లాడే రామచిలుక ఒకటి ఉండేది.
ఆ రామచిలుకని చాలా ముద్దుగా పెంచుకునేవాడతను. దానికి రోజూ రకరకాల పళ్ళు తెచ్చి పెట్టేవాడు.
ఒకసారి ఒక రంగయ్య వచ్చి అతనితో జాతకం చెప్పించుకున్నాడు.
చిన్నయ్య తనదైన పద్ధతిలో జోస్యం చెబుతూ "ఇంకేముంది, నీకు కల్యాణయోగం దగ్గరపడింది. ఇంకో పదిహేను రోజుల్లో నీకు పెళ్ళి అవుతుంది" అనేసాడు.
తీరా పదిహేను రోజులు అయ్యాయి, కానీ పెళ్ళిమాత్రం అవ్వలేదు! ఆ సరికే విసిగి పోయిన రంగయ్య తన కోపాన్నంతా చిలక జోస్యుడి మీద చూపించాడు. అతను, అతని స్నేహితులు చిన్నయ్యను ఎగతాళి చేస్తూ, కొట్టటం మొదలుపెట్టారు.
వాళ్ల గందరగోళం నడుమ రామచిలుక తన పంజరం నుంచి బయటపడి, తన స్నేహితుల దగ్గరకు పోయింది. "వాళ్ళెవరో నా గురువును కొడుతున్నారు. వచ్చి సాయం చేయండి" అని బ్రతిమాలుకున్నది.
చిలకల గుంపు వచ్చి తన్నులు తింటున్న చిన్నయ్య ముందు వాలింది. రామ చిలుక వెళ్ళి గురువుకు అడ్డం పడుతూ "పాపం, ఈయన్ని ఏమీ అనకండి.
ఈయన వల్లే కదా, నాకు ఇంత ఆహారం దొరుకుతున్నది? దయచూడండి" అన్నది.
"అవునవును- అతను ఏదో పొట్టకూటికోసం తిప్పలు పడుతున్నాడు. ఊరికే కొట్టకండి" అని గుంపులో వాళ్ళొకరు అన్నారు.
దాంతో రంగయ్య, మిత్రులు అందరూ తలవంచుకొని ఎవరి దారిన వాళ్ళు పోయారు.
రంగయ్య చిలుక సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆరోజునుండీ దాన్ని పంజరంలో పెట్టటం మానేసాడతను!