అనగనగా అడవిలో ఒక సింహం ఉండేది. ఒకసారి అది వేటకు పోయింది. కొంచెం కష్టపడగానే దానికి ఓ కుందేలు దొరికింది.

కుందేలు ధైర్యంగా "నేను చాలా చిన్న దాన్ని, సింహరాజా! నీ ఆకలికి నేను ఏం సరిపోతాను చెప్పు? నన్ను పట్టించుకోకు. వదిలేసి ముందుకు పోతే నీకు నాకంటే పెద్ద జంతువు అలవోకగా దొరకదా?" అన్నది.

"అవును కదా" అని సింహం కుందేలుని వదిలేసి ముందుకు నడిచింది. ప్రాణాలు దక్కిన కుందేలు "దేవుడా! కాపాడావు!" అనుకుంటూ చటుక్కున పరుగుపెట్టింది.

అంతలో సింహానికి ఒక జింక కనిపించింది. సింహాన్ని చూడగానే అది పరుగు లంకించు-కున్నది. పరుగెత్తి, పరుగెత్తి అతి కష్టం మీద దాన్ని పట్టుకుంది సింహం.

వెంటనే జింక కూడా "నీ ఆకలికి నేను ఒక లెక్కా, పత్రమా సింహరాజా?! తమ పంటి కిందికి కూడా రానే?! నాతో ఆగిపోకుండా, సూటిగా ముందుకు పోతే, నీకు నాకంటే పెద్ద జంతువు దొరకదా?" అనేసింది.

"నిజమే" అనిపించిన సింహం జింకని ఏమీ చెయ్యకుండా వదిలేసింది.

ఈసారి దానికి దుప్పి ఒకటి కనిపించింది. సింహాన్ని చూడగానే దుప్పి పరుగు లంకించు-కున్నది. దానికోసం అడవి అంతా తిరగాల్సి వచ్చింది సింహానికి. చివరికి ఎంతో కష్టపడి దాన్ని పట్టుకోగానే, అది "అయ్యో సింహరాజా! నా శరీరం నీ ఆకలిని ఎంత తీరుస్తుంది, చెప్పు?! ఇదంతా నీకు ఒక్క పూటకు మాత్రమే కద, నన్ను వదిలి ముందుకు పోతే నీకు ఇంకా పెద్ద జంతువు దొరుకుతుంది- తప్పకుండా!" అన్నది.

"నిజమే కదా, ఇంత సన్న జంతువు నాకేం సరిపోతుంది?!" అనుకున్న సింహం, దుప్పిని వదిలి పెట్టి ఇంకా ముందుకు వెళ్ళింది.

ఈసారి దానికి ఒక పెద్ద దున్నపోతు కనిపించింది. సింహం ఒక్క దూకున దాన్ని పట్టుకోబోయింది గానీ, అది తప్పించుకొని అడ్డగోలుగా పరిగెత్తింది. సింహం దాని వెంట పడింది. అది ఇంకా ఇంకా వేగంగా పరుగెత్తింది. ఆ సరికి అలిసిపోయిన సింహమే కుప్పకూలింది. దాని ఒళ్ళు హూనం అయిపోయింది; గుండె పని చేయనన్నది!

ఇంక ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో దానికి రెండే ప్రశ్నలు మిగిలాయి: "నా ఆకలి ఎంత? నా పరుగు ఎక్కడికి?