(ఫొటో : 'ది హిందూ' 07-07-2010,”A child at work!”బడి లంచ్ సమయంలో గొర్రెలు కాస్తున్న ఓ పాప )
ఒక పిల్ల బడికి పోదు- మేకలను కాస్తుంది.
కట్టె పుల్లలను ఏరుకుని ఇంటికి తెస్తుంది.
అన్నం వండటంలో అమ్మకు సాయపడుతుంది.
****
ఒక పిల్ల పుస్తకాల బరువును మోస్తూ బడికి వెళ్తుంది-
సాయంత్రానికి అలసి సొలసి ఇంటికి వస్తుంది.
బడిలో ఇచ్చిన హోం వర్కుని , ఆమె అమ్మానాన్నలతో చేయిస్తుంది.
****
భారం పుస్తకాలదైనా, కట్టెపుల్లలదైనా-
ఇద్దరు పిల్లలూ మోస్తున్నారు.
****
కానీ కట్టె పుల్లలతో పొయ్యి మండుతుంది;
అప్పుడు కడుపు నిండుతుంది!
అంతేకాదు, కట్టెపుల్లలు తెచ్చే పిల్లకి ఈ విషయం తెలుసు!
కట్టెపుల్లల ఉపయోగాన్ని ఆమె గుర్తిస్తుంది.
మరి పుస్తకాలలోని విషయాలు ఎప్పుడు,
ఎలా ఉపయోగపడతాయో తెలీకుండానే,
బడికి వెళ్ళే పిల్ల వాటిని బట్టీ పడుతుంది.
****
పుల్లల్ని ఏరటం, మేకల్ని మేపటం,
అమ్మతో కలిసి అన్నం వండటం:
నిజానికి ఇవన్నీ ఇంటి పనులు-
కానీ వీటిని 'హోం-వర్కు' అనరు.
బడిలో ఇచ్చిన అభ్యాసాలు
ఇంటిపని కాకపోయినా,
వాటిని 'హోం-వర్కు' అంటారు.
****
చదువులు నిజంగా ఇంటిపనితో ముడిపడి-
పుల్లలు ఏరే పిల్లలు కూడా-
ఇలాంటి పుస్తకాలు చదివే రోజు ఎప్పుడు వస్తుందో!