అనగా అనగా ఒక ఊరు . ఆ ఊరి పేరు ఒంటికొండ. ఆ ఊళ్ళో ఒక బడి ఉంది. ఒక రోజున ఆ బడిలో పాటల కార్యక్రమం జరుగుతున్నది. ఆ పాటల్ని వినేందుకు చాలా మంది వచ్చి ఉన్నారు. పాటలు పాడటానికి పిల్లలంతా పోటీ పడుతున్నారు. అయితే, ఆ బడిలో చదివే భీమరాజు 'అమ్మ' గురించి పాడిన పాట విని, అందరూ పరవశించిపోయారు. ఎప్పటిలాగే ఈసారి కూడా భీమరాజుకే మొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతిని పట్టుకొని భీమరాజు సంతోషంగా ఇంటికి పరుగెత్తాడు.

భీమరాజు వాళ్ళది చాలా పేద కుటుంబం. అతను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటినుండీ వాళ్ళ అమ్మ కూలిపని చేసుకుంటూ అతన్నీ, వాళ్ల అన్ననీ పెంచి పెద్ద చేసింది. అన్నకు పెళ్ళైంది; చిన్న ఉద్యోగం దొరికింది- గానీ అతని సంపాదన అతని కుటుంబానికే సరిపోతుంది. భీమరాజు చదువు పూర్తయేంత వరకూ వాళ్ళమ్మకు చాకిరీ తప్పదు.

సంతోషంగా ఇల్లు చేరుకున్న భీమరాజు వాళ్ళమ్మకు తన బహుమతిని చూపించి- 'నువ్వు నేర్పిన పాటకేనమ్మా, ఈ బహుమతి వచ్చింది!' అని చెబితే, వాళ్ళమ్మ గర్వంతో పొంగిపోయింది. 'సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసి, రా! ఇవాళ్ల నీ పుట్టిన రోజు కదా, కొత్త అంగీ కుడుతున్నాను. నీ స్నానం అవ్వగానే ముందు కొంచెం పాయసం తిందువు ' అన్నది. అయితే, ఆమెకు చాలా కాలంగా కాన్సర్ వ్యాధి ఉన్నది. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయింది!

ఇప్పుడు ఇక భీమరాజును చూసుకునే బాధ్యత వాళ్ల అన్నమీద పడింది. అన్న మంచివాడే, కానీ ఒదిన గంగమ్మకు మాత్రం భీమరాజంటే ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎప్పుడూ అతన్ని సాధిస్తూ ఉండేది. భీమరాజు మాత్రం నోరు మెదపకుండా ఇంటి పనులన్నీ‌చకచకా చేసేసి బడికి వెళ్ళి శ్రద్ధగా చదువుకొనేవాడు. బడినుండి ఇంటికి వచ్చాక కూడా అతనికోసం ఇంటినిండా పనులు సిద్ధంగా ఉండేవి. అన్ని పనులూ చేసేసి, అందరూ భోజనాలు కానిచ్చి పడుకున్నాక, భీమరాజు తన హోం-వర్కు చేసుకునేవాడు. ఎంత చేసినా వదిన చేతిలో అతనికి తిట్లు తినక తప్పేది కాదు.

చూస్తూండగానే సంవత్సరం గడిచి-పోయింది. బడిలో పాటల పోటీలు జరుగుతున్నై, మళ్ళీ. ఆ పోటీని చూసేందుకు భీమరాజు అన్నావదినలు కూడా వచ్చారు. 'ఈసారి భీమరాజు ఏం పాట పాడతాడా ' అని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 'అన్నా వదినల ఆప్యాయత' అని తీయగా పాడాడు భీమరాజు. పాట ఎంత చక్కగా పాడాడంటే, న్యాయనిర్ణేతలుకూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

ఒకాయన వాడిని దగ్గరకు తీసుకొని, ప్రేమగా 'బాబూ, నీకు ఈ పాటను ఎవరు నేర్పారు? ఇంత చక్కగా పాడేందుకు నీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు?' అని అడిగాడు. 'మా ఒదినమ్మ' అని చెప్పాడు భీమరాజు. న్యాయనిర్ణేతలు భీమరాజు ఒదినమ్మను వేదిక మీదికి పిలిచి, అభినందించి, ప్రత్యేకంగా సత్కరించారు. 'ఇంత చక్కని గాయకుడిని తయారుచేసిన మీరు ధన్యులు' అని వచ్చినవాళ్ళంతా ప్రశంసిస్తుంటే ఒదినమ్మ సిగ్గుతో‌ముడుచుకు పోయింది.

అటు తర్వాత గంగమ్మ మారిపోయింది. భీమరాజును చక్కగా చూసుకున్నది!