అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పేరు రామాపురం. ఆ ఊళ్లో ఒక వెర్రి వెంగళప్ప ఉండేవాడు. వానికి ఒక అవ్వ ఉండేది. అవ్వకి అతనంటే ఇష్టం; అతనికి అవ్వ అంటే ఇష్టం.
ఒకసారి అవ్వకి జ్వరమొచ్చింది. చాలా రోజులుగా అట్లాగే ఉంది. అప్పుడు మనవడికి చాలా బాధ అయ్యింది. ఎలాగైనా అవ్వ ఆరోగ్యం బాగు చేపించాలని అనుకుంటాడు. వైద్యానికి చాలా సంపాదించాలని అనుకుంటాడు. అందుకోసం ప్రక్క నగరంకి వెళ్ళాడు.
వెంగళప్ప నగరానికి వెళ్ళి, రెండు రూపాయలు సంపాదించాడు. తిరిగి వచ్చేటప్పుడు, నది దాటించటంకోసం పడవ వాడికి ఒక రూపాయి ఇచ్చాడు. ఇంకొక రూపాయిని చేతిలో పట్టుకొని, ఊరికే ఉండకుండా గాలిలోకి ఎగరెయ్యటం మొదలు పెట్టాడు. అట్లా ఎగరేసుకుంటుంటే అది నదిలో పడిపోయింది. అతనికి చాలా బాధ అయ్యింది.
ఇంటికి వెళ్ళగానే అవ్వ 'ఏమి సంపాదించావురా, మనవడా?' అని అడిగింది.
"నేను ఒక రూపాయి పడవ వానికి ఇచ్చి, ఒక రూపాయి ఎగర వేసుకుంటూ వస్తుంటే అది నదిలో పడిపోయింది" అని చెప్పాడు వెంగళప్ప. "ఒరేయ్! అలాంటిది జేబులో వేసుకుని రావాలి" అని చెప్పింది అవ్వ.
మరుసటి రోజు వెంగళప్ప నగరానికి వెళ్ళి, నెయ్యి దుకాణంలో పని చేశాడు. కూలీగా అతనికి కిలో నెయ్యి ఇచ్చాడు దుకాణదారు. ఇంటికి బయలుదేరిన వెంగళప్పకు అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నెయ్యినంతా తన జేబుల్లో కుక్కుకొని బయలుదేరాడు. అతను ఇంటికి చేరుకునే లోపు నెయ్యి కరిగి పోయింది.
జరిగింది తెలుసుకుని, "అలాంటి దాన్ని గిన్నెలో వేసుకుని రావాలిరా, నాయనా!' అని చెప్పింది అవ్వ.
ఈసారి వెంగళప్ప మేకల్ని మేపే పనికి కుదురుకున్నాడు. కొన్ని రోజులు పని చేసిన మీదట, యజమాని కూలీగా ఒక చిన్న మేక పిల్లను ఇచ్చాడు. మేకపిల్లను ఇంటికి తెద్దామని బయలుదేరిన వెంగళప్పకు అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాన్ని గిన్నెలోకి ఎంత కుక్కినా పట్టలేదు. చివరికి వాడు దాన్ని ఒక గోతంలో వేసుకుని, ఇంటికి మోసుకొచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మేక చనిపోయింది.
అప్పుడు అవ్వ ' అయ్యో! అలాంటి దాన్ని తాడుతో కట్టుకుని రావాలి బాబూ!' అని చెప్పింది.
ఈసారి వాడికి ఒక పెద్ద చేప దొరికింది. అవ్వ మాటల్ని గుర్తుంచుకొని, వాడు దానికి భద్రంగా ఒక తాడు కట్టి, దాన్ని ఇంటి వరకు ఈడ్చుకొచ్చాడు. ఇంటికి వచ్చే సరికి ఎముకలు మాత్రం మిగిలాయి. మాంసం మొత్తం ఎక్కడికి పోయిందో కూడా అంతు చిక్క లేదు!
'ఓరి బాబూ ! ఇలాంటి దాన్ని లాక్కు రారు నాయనా! ఎత్తుకుని రావాలి ' అని చెప్పింది అవ్వ.
మరుసటి రోజు అతనికి ఒక గాడిద దొరికింది. అవ్వ చెప్పిన సంగతిని గుర్తుంచుకొని, వాడు దాన్ని ఎత్తుకోబోయాడు. ఉండబట్టలేక, అది వాడిని టపాటపామని తన్నుతున్నది. దాన్ని గమనిస్తూ ఉన్నది, ప్రక్కనే కోటలో ఉన్న రాణి. ఎంతో కాలంగా నవ్వు అంటూ ఎరగని ఆమె, దాన్ని చూసి పగలబడి నవ్వింది.
అప్పటికే 'నా భార్యను నవ్వించిన వాళ్ళకు పెద్ద బహుమానం ఇస్తాను' అని ప్రకటించి ఉన్నాడు రాజు. ఇప్పుడు రాణి ఇలా పగలబడి నవ్వటాన్ని చూసిన రాజుకు చాలా సంతోషం వేసింది.
"ఎంత అద్భుతం! ఎప్పుడూ నవ్వని నా రాణి నవ్వింది! ఎవ్వరి వల్ల, ఇది సాధ్యమయింది?' అనుకొని, అలా నవ్వించిన వాళ్లెవ్వరో వెతికి, గౌరవంగా పిలుచుకు రమ్మని పంపించాడు భటుల్ని. భటులు వెంగళప్పను రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజు వెంగళప్పను ఘనంగా సత్కరించి, చాలా బంగారం, డబ్బులూ బహుమానంగా ఇచ్చాడు.
అంతేకాక అతనికి ఆస్థాన విదూషకుడి ఉద్యోగం కూడా ఇచ్చాడు. అలా ధనవంతుడైన వెంగళప్ప , అందరినీ నవ్విస్తూ చాలా పేరు తెచ్చుకున్నాడు.