జనార్దన్ కి బాగా అతి తెలివి. చిన్న తనం నుండీ అతని అల్లరికి హద్దు ఉండేది కాదు. అయితే అతని అల్లరి వల్ల ఎవరికీ పెద్దగా నష్టం జరగలేదు. స్వతహాగా మంచివాడు కావటంతో, అతని స్నేహితులు అతన్ని చాలా ప్రేమించేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒక్కోసారి కోప్పడేవాళ్లు. టీచర్లు చాలావరకూ అతన్ని భరించి ఊరుకునేవాళ్ళు.

'జనార్దన్ పెద్దవాడయ్యాక, కాలేజీ చదువులు ముగించుకొని, లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు; చక్కని అపార్టుమెంటు ఒకటి కొనుక్కున్నాడు- కానీ‌ ఆ అల్లరి మెదడు మాత్రం అట్లానే ఉంది. వాళ్లకి ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇంట్లో వాళ్ళతో పాటు ఒక పిల్లి మాత్రం ఉండేది.

ఒకసారి జనార్దన్ కి చాలా జ్వరం వచ్చింది. ఆస్పత్రిలో డాక్టర్లు పెదవి విరిచారు. అదేం జ్వరమో తెలీలేదు ఎవ్వరికీ. ఇక ప్రాణం పోతుందనగా జనార్దన్ కి దేవుడు గుర్తొచ్చాడు- "దేవుడా, దేవుడా! నన్ను ఇంకొంతకాలం బ్రతకనివ్వు. నా రోగం తగ్గించావంటే, నా యీ ఆస్తిని మొత్తాన్నీ అమ్మి, ఆ డబ్బును ఏదైనా మంచి పనికోసం ఇచ్చేస్తాను" అని మొక్కుకున్నాడు.

దేవుడు జనార్దన్ మొర విన్నాడో, లేకపోతే డాక్టర్లిచ్చిన మందులే పనిచేశాయో, అతని ఆరోగ్యం‌ మాత్రం మెల్లగా కుదురుకున్నది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు.

బాగై ఇంటికి వచ్చిన జనార్దన్ ను తన మొక్కు పీడించసాగింది. "అయ్యో! తప్పు చేశానే! ఈ‌ఇల్లుని అమ్మేస్తానని మొక్కుకున్నానే! ఇంత పెద్ద ఇల్లుని చేతులారా‌ ఎలా అమ్మేది?! ఆ డబ్బునంతా వేరేవాళ్ళకి ఎలా ఇచ్చేసేది?" అని బాధ మొదలైంది. అలాగని, మొక్కును మరిచిపోయి ప్రశాంతంగా ఉండనూ లేడు! ఇదే ఎడతెరపిలేని ఆలోచన అతన్ని రాతింబవళ్ళూ వెంటాడింది.

అప్పుడు అతని అల్లరి మెదడు మళ్ళీ ఓసారి మేలుకున్నది- అతనికి ఒక గొప్ప ఐడియా ఇచ్చింది! జనార్దన్ వెంటనే దాన్ని అమలు చేశాడు. ఇంటిని ఫలానా తేదీన వేలం వేస్తున్నట్లు బోర్డు పెట్టేశాడు.

అనుకున్న రోజున, ఆయింటిని కొనాలనుకున్నవాళ్లంతా వచ్చారు. జనార్దన్ వేలాన్ని మొదలు పెడుతూ చిన్న ఉపన్యాసమొకటి ఇచ్చాడు- "మిత్రులారా! స్వాగతం! రండి! ఒక ఇంటినీ, ఒక పిల్లినీ వేలానికి పెడుతున్నాను. ఇంటి ఖరీదు ఒక్కరూపాయి మాత్రమే. పిల్లి ఖరీదు మొదటగా లక్ష రూపాయలు మాత్రమే. కొనేవాళ్ళు రెండింటినీ‌ కలిపే కొనాలి. ఇక మొదలు పెట్టండి- ఎవరైనా అంతకంటే ఎక్కువ చెల్లించేవాళ్ళు ఉంటే ముందుకు రండి."

జనాలకు ఆశ్చర్యం‌ వేసింది. ఇంటి ఖరీదు ఎందుకు, అంత తక్కువ? పిల్లి ఖరీదు ఎందుకు, అంత ఎక్కువ, అని. అయినా వాళ్లలో‌కొందరు ముందుకు వచ్చి సరదాగా వేలం పాడారు. పిల్లి లక్షా పది వేలకు, ఇల్లు ఒక రూపాయికి అమ్ముడయ్యాయి. ఇంటిని కొన్నవాళ్ళు మరునాడే జనార్దన్ కు డబ్బు ఇచ్చేశారు. జనార్దన్ తన ఇంటిని ఖాళీ‌చేయగానే వాళ్ళు ఆ ఇంట్లోకి చేరుకున్నారు; 'పిల్లి తమకెందుకు' అని దాన్ని తరిమేశారు!

జనార్దన్ ఒక రూపాయిని పట్టుకొని గుడికి వెళ్ళి, దేవుడికి నమస్కారం పెట్టి, "దేవుడా! ఇంటిని అమ్మి, వచ్చిన డబ్బంతా నీకే ఇస్తానన్నాను- ఇదిగో, ఒక రూపాయి వచ్చింది. ఇది నీదే!" అని భక్తిగా ఆ ఒక్క రూపాయినీ‌ హుండీలో‌వేసి వచ్చాడు. గుళ్ళో దేవుడు సంతోషంగా నవ్వినట్లు అనిపించింది. ఇప్పుడు అతని మనసు తేలికైంది- మ్రొక్కు తీరినందుకు హాయిగా ఉంది.

ఇక ఆపైన జనార్దన్ తన దగ్గర మిగిలిన లక్షా పదివేల రూపాయలు పెట్టి మరొక ఇల్లు కొనుక్కున్నాడు. లక్ష్మి ఇంటిని చక్కగా సర్ది పెట్టింది. ఇద్దరూ సంతోషంగా క్రొత్త ఇంట్లో‌ క్రొత్త జీవితం మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఒక రోజు భయంకరమైన భూకంపం‌ఒకటి వచ్చింది. అదృష్టంకొద్దీ ఆ రోజు లక్ష్మి ఇంట్లో లేదు. అనేకమంది ఇళ్లతో‌పాటు జనార్దన్ క్రొత్త ఇల్లూ కూలింది. జనార్దన్ ఆ గృహ శకలాలలో కూరుకుపోయాడు. బాగా గాయాలయ్యాయి; పైన బరువు పడటం వల్ల, అతను కదలలేకపోయాడు. రెండు రోజులపాటు అతను అలా ఆ శకలాలలో పడి ఉన్నా, కాపాడేందుకు ఎవ్వరూ ఆవైపుకు రాలేదు! చివరికి అతను నీరసించి పోయి, ప్రాణాలమీద ఆశ వదులుకున్న సమయంలో ఒక విచిత్రం జరిగింది-

"మ్యావ్!" అని అరుపు వినబడిందతనికి! పిల్లి!! అది వచ్చి, అరుస్తూ, జనార్దన్ చేతుల్ని నాకటం మొదలు పెట్టింది. చివరికి అదే మిగిలిన వాళ్లకు జనార్దన్ ఆచూకీ‌ చూపించింది! అందరూ కలిసి అతన్ని బయటికి లాగారు.

"దేవుడా! 'నాది' అనుకున్న ఇల్లు వచ్చి నా మీద పడితే, 'నాది కాదు' అని వదిలేసిన పిల్లి వచ్చి నన్ను కాపాడింది. నీ సృష్టిలో హెచ్చు తగ్గులు ఏవీ‌ లేవు. 'నాది-పరాయిది' అంటూ వాటిని కల్పించుకొనేది మా యీ మనసే" అనుకున్నాడు జనార్దన్, పిల్లిని నిమురుతూ, కళ్లనిండా నీళ్ళతో.