
ఆ అడవిలోనే 'కరటకం, దమనకం' అనే నక్కలు రెండు ఉండేవి. దమనకంతో ముచ్చట్లాడుతూ ఉన్న కరకటం ఎద్దు రంకె విని అదిరిపడింది. దాని గుండెలు తట తటా కొట్టుకున్నాయి. కొంచెం సేపటికి గాని అది కోలుకోలేకపోయింది.
అప్పుడు అది శబ్దం వెలువడ్డ దిక్కువైపుకు కడకంటి చూపులు సారించి, నీలిగి, చెవి నిక్కించి విని, దమనకంతో ఇట్లా అన్నది- "ఇంకేమీ శబ్దం రావట్లేదు- నువ్వూ విన్నావు కదా? ఇది ఏంటి?! ఇంతకాలంగా ఈ అడవిలో ఉన్నాము. ఇంత భయంకరమైన అరుపును ఏనాడు గానీ వినలేదు" అని.
దమనకం సమాధానంగా తల ఊపుతూ "ఔనౌను. ఇది వరకు ఎన్నడూ విన్న శబ్దంకాదు ఇది- మహా ఆశ్చర్యకరమైన అరుపు. అదిగో చూడు- మన రాజు పింగళకుడు యమునా నదికి పోబోతూన్న వాడు- చేతలు ఉడిగి నిలబడి పోయాడు- ఈ ధ్వని విని కాబోలు!" అని చిరునవ్వు నవ్వి, "అంతవాడే ఇట్లా అయ్యాడు. ఇక మనం ఎంతవాళ్లం?" అన్నది.
అప్పుడు కరకటం 'ఇంత భయంకరంగా అరిచే జంతువు మామూలుది అయి ఉండదు. అలాంటి జంతువు ఈ అడవిలోకి ఎక్కడినుండి వచ్చి చేరింది? మనం దాని అరుపునైతే విన్నాం- కానీ అది ఎలా ఉంటుందో చూడలేదు. నిన్నరాత్రో, ఈ రోజు ప్రొద్దున్నో అది ఇక్కడివచ్చి చేరుకొని ఉండవచ్చు. ఇప్పుడిక మనకు ఎట్లాంటి కష్టాలు రానున్నాయో, ఎవరికి ఎరుక?" అన్నది.
అప్పుడు దమనకం "ఈ అడవి ఏమైనా మన మాన్యమా? 'ఇంకొక చోటికి పోకూడదు ' అని మనకు ఏమైనా నియమమా? ఇక వేరే అడవంటూ ఏదీ లేదా? పుట్టిన ఊరును విడచిపోవటం ఎవరికైనా గాని కష్టమే- అట్లాగని చావటానికి అంగీకరిస్తారా?- అయినా ఇంత ఆలోచన ఎందుకు? మనకిప్పుడు వలస పోవలసినంత కష్టం ఏమి వచ్చింది? ఇంత వరకూ ఆ జంతువు నల్లనిదో, తెల్లనిదో తెలీదు మనకు. ముందు అది చిన్నపాటి జంతువో, మహాద్భుతమైన భయంకర మృగమో తెలుసుకుందాం. ఆ పైన ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు. 'పిట్ట కొంచెం - కూత ఘనం' అన్నట్లు, చిన్న జంతువుకు సైతం పెద్ద గొంతు ఉండవచ్చు! 'నిజానికి ఈ జంతువు ఏమంత క్రూరమైనది కాదు' అనేందుకు సూచనలు కొన్ని నాకు ఈసరికే లభిస్తున్నాయి- నువ్వూ చూడు- అటువైపున పక్షులు కలవరపడిన లక్షణాలేమీ కనబడటం లేదు కదా? బాగా విను. అవి ఏ మాత్రం భయపడినా కలకలం వినబడకుండా ఉంటుందా?” అన్నది.

ఆ మాటలు విని కరకటం ఇట్లా అన్నది- "అవును. నువ్వు చెప్పేది నిజమే. కానీ 'ఈ జంతువు ఏది?' అనే సంగతి మాత్రం ఇంకా తెలీటం లేదు"- అని, కొంతసేపు ఊరుకొని, చిరునవ్వు నవ్వి 'ఆ., ఇప్పటికి గుర్తుకు వచ్చింది! మరేమీ కాదు- విను! కొన్నాళ్లకు ముందు ఒక వర్తకుడు దారిన పోతూ, తన బండిని ఈడ్వలేక క్రింద పడిపోయిన బక్క ఎద్దును ఒకదాన్ని, తన ప్రయాణపు తొందరలో ఈ అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అది యీ పాటికి గడ్డిపరకలు తిని, కొంత తేరుకొని, కొంచెం కండపట్టి, అక్కడక్కడా తిరుగుతూ ఉండగా చూశాను నేను. ఇప్పుడు మనం విన్నది దాని రంకె. సందేహం లేదు. ఊరికే ఇంతవరకూ ఏవేవో ఆలోచించి, పనికి మాలిన పిరికితనం తెచ్చుకున్నాం. మన రాజు మన కంటే శూరుడు!" అన్నది.
అప్పుడు దమనకం "మనం పింగళక మహారాజుకు మంత్రి కుమారులం. అందువల్ల మనం ఇప్పుడు ఊరికే ఉండకూడదు. పింగళకుడి దగ్గరికి పోయి, ఆయన భయాన్ని మాన్పాలి. ఈ వంకతో అయినా మనం ఆయన దగ్గర ఉద్యోగం సంపాదించుకొని, ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. రాజు అనుగ్రహం పొందిన వాళ్లకు సర్వసంపదలూ కలుగుతాయి. మనం ఆయనను గతంలో తిరస్కరించాం. ఇప్పుడు మనకు ఆయన అనుగ్రహం సంపాదించటమే ముఖ్యం- మిగిలిన మూర్ఖపు సంగతులు మనకేల?" అన్నది.
ఆ మాటలు విని కరకటం "దమనకా, విను. ఇతనితో స్నేహం నాకు సరిపోదు. ఇది వరకు ఇతని వద్ద పనిచేసి పడ్డ పాట్లు చాలు. ఇతను 'ఎత్తు వారి చేతి బిడ్డడు' -ఎవరెట్లా చెప్తే అలా చేస్తాడు- తప్ప, ఒక దారిన పోయేవాడు కాదు. ఇట్లాంటి వాడి దగ్గర కొలువు చాలా కష్టం. అయినా అది ప్రక్కనపెట్టు- 'జానెడు కడుపు నింపుకోవటం కోసం ఇతరులకు శరీరాన్ని అమ్ముకోవటం' అన్నది చాలా నీచం. ఇతరుల ఆధీనంలో నడిచేవాడు చచ్చినవాడితో సమానం. అయినప్పటికీ సేవకుడు స్వీయ కార్యాల చేత యజమాని మెప్పుకోలు సంపాదిస్తే, ఆ సేవ వల్ల కల్గిన దు:ఖం కొంత వరకు ఉపశమిస్తుంది. అలా కాక యజమాని అతనిని పట్టించుకొనకపోతే, దాని కంటే దు:ఖం వేరే లేదు. యజమానే గనక ఆ సేవకుడిని పరాభవిస్తే, ఇక చెప్పవలసినది ఏమున్నది? సేవా వృత్తి వల్ల లభించే పాయసం కంటే, స్వతంత్రంగా పనిచేసుకుంటూ సంపాదించుకొనే గంజి మేలు.
అందువల్ల , దొరికిన లాభంతో తృప్తి పడి సుఖంగా ఉందాం. అతని భయాన్ని పోగొట్టవలసిన అవసరం మనకు ఇప్పుడు ఏమున్నది? తనకు మాలిన పనిని నెత్తికెత్తుకున్న వాడు మేకును పెరికిన కోతిలాగా తప్పక ఆపదల పాలవుతాడు. ఆ కథ చెబుతాను, విను-
మగధ దేశంలో 'అరిదుర్గం' అనే పట్టణం ఒకటి ఉండేది. అందులో 'శుభదత్తుడు ' అనే వైశ్యుడు ఒకడు, మహా ధన సంపన్నుడు- ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. అందువల్ల అతను తన సంపదను మొత్తాన్నీ ఉద్యానవనాలకోసం, చెరువులకోసం, ప్రజలకు ఉపయోగపడే ఇతర కార్యకలాపాలకోసం, ఖర్చుపెట్టేవాడు. ఆ పట్టణంలోనే గొప్ప దేవాలయం ఒకటి శిథిలమై ఉండగా చూసి, శుభదత్తుడు మంచి వడ్రంగులను పిలిపించి, వాళ్ళకు తగిన జీతాలిచ్చి, ఆ గుడిని మళ్ళీ నిర్మించమన్నాడు.
ఆ వడ్రంగులు గుడిని కడుతుండగా, ఒకనాడు వాళ్ళకు పెద్ద చేవ దూలం కావలసి వచ్చింది. వండ్రంగుల పెద్ద, ఒక పెద్ద మ్రానును తెప్పించి, దానిని రంపంతో కోయిస్తూ, అది సులభంగా చీలేందుకుగాను దానిలోకి అక్కడక్కడ కొయ్య మేకులు దిగగొట్టాడు. అంతలో మధ్యాహ్నం అవ్వటంతో, అతను- కూలివాళ్ళు- అందరూ పనిని ఆపి, భోజనంకోసం వెళ్ళిపోయారు.
అప్పుడు ఆ చుట్టుప్రక్కల చెట్లమీద తిరుగాడుతున్న కోతులు దేవాలయం దగ్గరికి వచ్చి- గోడలు ఎక్కుతూ, వాటిని ఆనుకొని ఉన్న చెట్ల మీదకి కుప్పించి దూకుతూ, వ్రేలాడే కొమ్మల్ని కాళ్లతో పట్టుకొని తలకిందులుగా వ్రేలాడుతూ, పెద్ద కొమ్మలను రెండు చేతులతో బట్టి ఊపుతూ, దేవాలయ గోపురం పైన ఉండే వివిధ అంతస్తుల పైన కూర్చొని- వికారంగా ప్రక్కలు, వీపులు గోక్కొంటూ, నిక్కుతూ, కనుబొమ్మలెత్తి గుర్రుమని బెదిరిస్తూ, పండ్లు ఇకిలిస్తూ, వెక్కిరిస్తూ, ఒకదానినొకటి తొడలమీద కూర్చోబెట్టుకొని, శరీరం మీద ఉన్న పేనులను ఏరి నోట్లో వేసుకుంటూ, కిల కిలమని అరుస్తూ, ఒకదానితో ఒకటి పోరాడుతూ, పండ్లను తింటూ, తేనెను త్రాగుతూ, అలా తమదైన చపలత్వంతో అటూ ఇటూ తిరుగాడసాగాయి.
వాటిలో ఒక ముసలి కోతికి కాలం మూడింది. అది వేరే ఏమీ పని లేనట్లు చేవదూలం దగ్గరకు పోయి, దానిమీదకి ఎక్కి కూర్చున్నది. దాని చీలికలో తన తోకను జార విడిచింది. ఆ పైన అది ఆ చీలికలో బిగియగొట్టిన కొయ్య మేకును ఒక దానిని రెండు చేతులతోటీ పట్టి, బలంగా ఊపి- ఊపి- చివరికి పూర్తిగా ఊడబెరికింది.

కొయ్యమేకు వీడిన మరుక్షణం అంతవరకు నెరి విచ్చిన ఆ చేవమ్రాను తిరిగి యథా స్థితికి చేరుకున్నది. చేలికలో వ్రేలాడుతున్న కోతి తోకతో పాటు క్రింది భాగాలన్నీ మ్రానులో ఇరుక్కుపోయాయి. చివరికి ఆ కోతి బాధతో ఏడుస్తూ చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి, 'తనకు మాలిన పనికి పోరాదు'.
-మనం ఇప్పుడు పింగళకుడి అనుచరులం కాదు. అతని కొలువులో క్రొత్త ఉద్యోగులు అనేకమంది ఉన్నారు. 'తమ యజమానికి ఏది మేలు, ఏది కీడు' అనే ఆలోచన, వారికి ఉండాలి- తప్ప, మనకు ఆ అధికారం లేదు. ఇతరుల పనులను నెత్తిన వేసుకున్నవాడు 'ఓండ్ర పెట్టి చచ్చిన గాడిద' లాగా నశిస్తాడు. ఆ కధ చెబుతాను- శ్రద్ధగా విను-
"వారణాసి నగరంలో ధావక మల్లుడు అనే చాకలివాడు ఒకడు ఉడేవాడు. ఒక రోజున అతను చాలా బట్టలు ఉతికీ ఉతికీ అలసిపోయాడు. ఆ అలసట వల్ల అతనికి ఆనాటి రాత్రి మంచిగా నిద్ర పట్టింది. అతను ఆవిధంగా ఒళ్ళు మరచి, గుర్రుకొట్టి నిద్రిస్తున్న సమయంలో అతని ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు.
అప్పుడు ఇంటి వాకిట్లోనే ఉన్నది గాడిద- యజమాని దాని కాలికి త్రాడు కట్టి ఇంటి వాకిటిలోనే ఉంచాడు. వాళ్ల ఇంటి కావలి కుక్క కూడా గాడిద ప్రక్కనే కూర్చొని ఉన్నది. దొంగను చూసి కూడా కుక్క మొరగలేదు. అప్పుడు ఆ గాడిద- కుక్కల మధ్య సంభాషణ ఇలా సాగింది- qaodmasdkwaspemas13ajkqlsmdqpakldnzsdfls qaodmasdkwaspemas12ajkqlsmdqpakldnzsdfls గాడిద : దొంగ లోనికి చొరబడ్డాడు, చూశావా? qaodmasdkwaspemas11ajkqlsmdqpakldnzsdfls కుక్క: చూశాను, చూశాను! qaodmasdkwaspemas10ajkqlsmdqpakldnzsdfls గాడిద: మరి, ఎందుకు మొరగట్లేదు? qaodmasdkwaspemas9ajkqlsmdqpakldnzsdfls కుక్క: నేనేం చేస్తే నీకేమి? నా పనితో నీకెందుకు? qaodmasdkwaspemas8ajkqlsmdqpakldnzsdfls గాడద: యజమాని ఇల్లు గుండెం అవుతుంటే ఊరికే చూస్తూ కూర్చోన్నావా, తప్పు కాదూ? కుక్క: "నీకేం తెలుసు? ఇన్నేళ్ళుగా రాత్రింబవళ్లూ ఒక్క నిమిషం కూడా వృథా పోనీక, చాలా శ్రద్ధతో, తలవాకిలి వదలక- ఈ ఇంటిని కాచు కొని ఉన్నాను నేను. అయినా నా వల్ల కలుగుతున్న మేలును, నా ఉపయోగాన్ని గుర్తించక, యజమాని నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. తినేందుకు నాకు పుడిసెడు అన్నం దొరకటంలేదు. సేవకుడి కష్టం ఎరుగని యజమానిని సేవించడం కంటే ఊరకుండటం మేలు". qaodmasdkwaspemas7ajkqlsmdqpakldnzsdfls
కుక్క మాటలు విని గాడిదకు చాలా కోపం వచ్చింది. అది అన్నది "ఓరీ! దురాత్మా! విను! ఏదైన కష్టం వచ్చినప్పుడు యజమాని తప్పుల్ని లెక్కబెట్టి సహాయం చెయ్యకుండా ఊరుకోవటం సేవకుడికి భావ్యం కాదు. అంతేకాదు- యజమాని మేలును గుర్తించకుండా తన పనుల్ని తాను చేసుకుంటూ ఉండిపోయే సేవకుడిని 'కృతఘ్నుడు' అంటారు. నీకు పాపం ఆంటే ఇష్టం అనిపిస్తున్నది. ఆపద కలిగినప్పుడు యజమానికై చేయవలసిన పనిని నువ్వు ప్రక్కన పెడుతున్నావు. అయినా ఏదో ఒరుగుతుందనుకోకు- నువ్వు చేసే పని నాకు రాదా? చూడు, మన యజమానిని ఇప్పుడు నేను మేల్కొలుపుతాను!" అని చెప్పి, గట్టిగా ఓండ్రపెట్టింది. qaodmasdkwaspemas15ajkqlsmdqpakldnzsdfls qaodmasdkwaspemas14ajkqlsmdqpakldnzsdfls ఆ శబ్దానికి చాకలివాడు మేలుకొన్నాడు. తన నిద్రను పాడు చేసిందని గాడిదపైన మహా కోపంతో లేచాడు. ఒక పెద్ద కట్టెను పట్టుకొని, పరుగెత్తుకొని వచ్చి, దానితో గాడిదను బాదాడు. ఆ దెబ్బ ఆయువుపట్టులో తగలటం వల్ల, గాడిద అక్కడికక్కడే చచ్చిపోయింది.
కాబట్టి, ఇతరుల పనిని మనం నెత్తికి ఎత్తుకోకూడదు- అక్కడక్కడా తిరిగి, పశువుల కళేబరాలను వెతకటం మన పని. ఆ పనిని మానేసి, పనికిరాని ఈ ఆలోచనలు ఎందుకు? వేరే జంతువులు తినగా మిగిలిన మాంసం కావలసినంత ఉన్నది- రా, తిందాం! అన్నది. qaodmasdkwaspemas16ajkqlsmdqpakldnzsdfls
(మిగిలిన కథ వచ్చే మాసం)