సుధ వాళ్ళింట్లో ఒక పంజరం ఉండేది.

పంజరంలో ఒక చిలక.

ఆ చిలక ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఇంటిల్లిపాదికీ సంతోషంగా ఉండేది.

సుధకి ఆ చిలకంటే చాలా ఇష్టం.

ప్రతిరోజూ దానికి జామపళ్లూ, ద్రాక్షలూ, ఆపిల్ పళ్లూ, మొలకలు- ఏ కాలంలో ఏవి దొరికితే అవి తెచ్చిపెడుతుండేది, ఇష్టంగా.

చిలక సుధకి చాలా కథలు చెబుతుండేది.

ఒక రోజున అది స్వాతంత్ర్యం కథ చెప్పింది:

"మన దేశంలో ఇదివరకు చాలా మంది రాజులు ఉండేవాళ్లు. అందరూ ఎప్పుడూ కొట్టుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్లు. దాన్ని ఆసరాగా చేసుకొని, బ్రిటిష్ వ్యాపారులు కొందరు మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించేశారు. తమ ప్రభుత్వాన్ని ఇక్కడికి తెచ్చి పెట్టుకున్నారు. తమను ఎదిరించిన వాళ్లనందరినీ అణచివేశారు. దేశంలో మామూలు జనాలకేమో వాళ్లిచ్చే ఉద్యోగాలూ, డబ్బులూ, వాళ్ళు చూపించిన ఆశలూ, వాళ్ళ ఆధునిక భావాలూ- అన్నీ నచ్చాయి. వాళ్లంతా మౌనంగా అలాగే ఉండిపోయారు. ఇక మెల్లిగా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోని సంపదనంతా తమ దేశానికి తరలించుకుపోవటం మొదలుపెట్టారు...

అన్నిటినీ‌ మించి, తెల్ల వాళ్ళు దోచుకున్నది మన స్వాతంత్ర్యాన్ని. స్వతంత్రం అంటే ఎవరికి వాళ్లు, తమకు నచ్చినట్లు సొంతంగా బ్రతికే హక్కు. ఇతరులెవ్వరికీ కష్టం కలిగించకుండా నీతి నియమాలతో బ్రతికేవాళ్ళకు స్వతంత్రం లేకపోతే ఊపిరాడనట్లు ఉంటుంది..."

అది ఇంకా ఏదో చెబుతుండగానే సుధ దాన్ని అడిగింది-

"నీకూ స్వాతంత్ర్యం లేదు కదా, ఇక్కడ? మరి నీక్కూడా అలా ఊపిరాడనట్లు ఉంటుందా?" అని.

చిలక కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు.

సుధ అన్నది- "నేను నీకు ఇష్టమైనవన్నీ తెచ్చిస్తాను కదా, జామకాయలు, సపోటాలు- అన్నీ?" చాలాసేపు మౌనం తర్వాత చిలక అన్నది- "స్వాతంత్ర్యం వీటన్నిటికంటే బాగుంటుంది" అని. సుధ కొంచెం సేపు ఆలోచించింది...

ఆ తర్వాత మెల్లగా పంజరం తలుపు తెరిచి, "నేను నీకు నచ్చేవి ఎన్నో తెచ్చి ఇచ్చాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు అన్నిటికంటే నచ్చే బహుమతినిస్తున్నాను- నీ స్వాతంత్ర్యం. ఇకమీద నీకు ఈ పంజరపు జీవితం ఉండదు. ఎగిరిపో. నీ‌రెక్కల్లో ఎంత శక్తి ఉందో చూసుకో. సంతోషంగా ఎగురు!" అన్నది. చిలక ఉత్సాహంగా ఎగిరి, ఆకాశంలో అటూ ఇటూ తిరిగింది. మళ్ళీ మళ్ళీ వచ్చి సుధకు "థాంక్సు" చెప్పింది చాలాసార్లు.

ఇప్పుడు కూడా, అది రోజూ వచ్చి సుధను కలుస్తూనే ఉన్నది.

సుధ దానికోసం జామపళ్లూ, ద్రాక్షలూ- అన్నీ తీసిపెడుతూనే ఉంది రోజూ.

అదికూడా సుధకు చాలా కథలు చెబుతున్నది- దానంతట అదే.

ఇప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు.

దాన్ని చూసిన తర్వాత, సుధకు స్వాతంత్ర్యం అంటే ఏమిటో అర్థమైంది. మీకూ అర్థమైంది, కదూ? అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

సంగీత ప్రపంచంలో లలిత సంగీతానిది ఒక ప్రత్యేక స్థానం. సుకుమారంగాను, సున్నితంగాను ఉండే లలిత సంగీతం, భావ లాలిత్యానికి, గాన మాధుర్యానికి పెద్ద పీట వేస్తుంది. విజయవాడ వాస్తవ్యులు శ్రీ వారణాసి వెంకట్రావుగారు రాసి, స్వయంగా స్వరపరచి, 'విద్యార్థి సృజన కుటీర్' బాలలచే పాడించిన నవ (-తొమ్మిది!)గీత మాలికను బడి వారు "వెలుగు రేకలు" పేరిట సి.డి.గా వెలువరించారు. వారి అనుమతితో, ఆ పాటల్ని ఈ నెలనుండీ మీ ముందుకు తెస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ మాసపు పాటలు- "విను వీధులలో ఎగిరే జండా","నింగి సాగే మబ్బుల్లారా"లు వారి సౌజన్యం.

ఈ మాసపు కొత్తపల్లి ముఖచిత్రం "స్వాతంత్ర్యం వచ్చింది!”ని గీసింది, యువ చిత్రకారుడు శివప్రసాద్. ఆయనకు మీ అందరి తరపునా ప్రత్యేక ధన్యవాదాలు.

అభినందనలతో, కొత్తపల్లి బృందం.