రంగాపురంలో ఉన్న రవికి ఏడేళ్ళు. 'చాలా చురుకైన పిల్లాడు ' అని వాడికి పేరుండేది. అందరూ అట్లా మెచ్చుకునీ మెచ్చుకునీ వాడికి "తను చాలా చురుకైన వాడు- అందరికంటే తెలివైనవాడు" అనిపించటం‌ మొదలెట్టింది.. దానితో బాటు "ఇతరులంతా తెలివితక్కువ వాళ్ళు" అని వాడికి ఒక నమ్మకం ఏర్పడింది కుడాను. ఆపైన వాడు ఇతతరులందరితోటి అమర్యాదగా ప్రవర్తించటం మొదలు పెట్టాడు.

వాళ్ళ అవ్వ అనేక రకాలుగా చెప్పి చూసింది - "ఇది మంచిపని కాదురా రవీ! ఇలా అందరినీ చిన్న చేసి చూడటం ఏమీ బాగా లేదు నాయనా" అని అవ్వ చెబితే, "నువ్వెవ్వరు? నాకు చెబుతున్నావా? అంత తెలివి ఉందా నీకు?!" అని దబాయించాడు తప్పిస్తే, వాడు తన వైఖరిని వెంట్రుకవాసంతయినా మార్చుకోలేదు.

ఒకసారి రవి బడినుండి ఇంటికి వస్తూంటే రోడ్డు మీది దుకాణంలో ఒక వింత జరిగింది. పొడుగాటి జుట్టుతో, చొక్కా లేకుండా ఉన్న బక్క పలచటి ముసలాయన ఒకడు రవిని ఆపి "టైం ఎంతయింది నాయనా?" అని అడిగాడు.

రవికి చాలా కోపం వచ్చింది. "నా దగ్గర వాచ్ ఎలాగూ లేదు. మరి వీడు నన్నెందుకు అడుగుతున్నాడు?" అని పోట్లాటకు దిగాడు: "నీకేమైనా‌తెలివి ఉన్నదా, అసలు? టైము అడగాలంటే వాచీ పెట్టుకున్న వాళ్లను అడుగు" అంటూ.

"తప్పైపోయింది నాయనా. 'నువ్వు బడి నుండి ఇంటికి పోతున్నావు కదా, నీకు టైము తెలిసి ఉంటుందేమో' అని అడిగాను అంతే. మీ బడి వదిలే టైము నీకే తెలీదని, నాకేం తెలుసు?" అన్నాడా ముసలాయన నవ్వుతూ.

"ఆలోచన లేకపోతే వేరే వాళ్లని చూసి నేర్చుకోవాలి. తెలివి కొనుక్కుంటే రాదు. పెంచుకోవాలి ప్రయత్నించి" అన్నాడు రవి, ఏ మాత్రం తగ్గకుండా.

దుకాణంలో శెట్టి "పోనివ్వండి స్వామీ, అతి తెలివి పిల్లాడు- వాడితో మీకెందుకు?" అన్నాడు ముసలాయనతో.

ముసలాయన నవ్వటం ఆపాడు- "లేదు శెట్టిగారూ, ఈ రవి చాలా తెలివైన పిల్లవాడు. అలాంటి పిల్లలు ఇట్లా అయిపోతే రేప్పొద్దున వాళ్లకీ మంచిది కాదు, మనకూ మంచిది కాదు. అందుకే చెప్తున్నాను- రవీ, జాగ్రత్తగా విను. ఇతరుల గురించి నువ్వు ఎలా అనుకుంటావో నువ్వూ అలాగే అవుతావు. రోజూ పది గంటల నుండి పదకొండు గంటల వరకూ నీకు పరీక్షా సమయం. రోజంతా ఇతరుల గురించి నువ్వు ఏమనుకుంటున్నావో పది తర్వాత ఒక గంటపాటు నువ్వే అట్లా అయిపోతావు. ఇట్లా ఒక నెలరోజులు గడువు. ఆ తర్వాత మళ్లీ కలుస్తాను" అన్నాడు కఠినంగా.

"నేనెట్లా ఉంటాననేది నా యిష్టం- నీదేం లేదు" అంటూ ముందుకు నడిచాడు రవి.

మరునాడు పదిగంటలకు- రవి బడిలో ఉన్నాడు. టీచర్ పాఠం చెబుతున్నారు. అకస్మాత్తుగా ఏమైందో ఏమో, రవికి పాఠం అర్థం అవ్వటం మానేసింది. ‌టీచర్ ఏదో ప్రశ్న వేస్తే దానికి రవి ఇంకేదో ఏదో గొణిగాడు జవాబుగా. "తెలివి కొనుక్కుంటే రాదు. కొనుక్కుంటే రాదు" అనిపించసాగింది వాడికి, ఎడతెగకుండా. ఆ ఆలోచనలో వాడికి తనేం చేస్తున్నాడో కూడా తెలియలేదు. పదకొండు గంటలకు రవి ఈ లోకంలోకి వచ్చేసరికి, తోటివాళ్లు అందరూ వాడికేసే చూస్తున్నారు నవ్వు ముఖాలతోటి!

రవికి చాలా కోపం వచ్చింది వాళ్లందరి మీదా. "మీకేమీ పనులు లేవా? పనులు లేకపోతే పనులు వెతుక్కోండి. ఇక్కడేమైనా కోతులు ఆడుతున్నాయా? అని వాడు అరిస్తే అందరూ వెటకారంగా నవ్వుతూ పోయారు.

మర్నాడు 10గంటలకు రవికి ఏమీ పనిలేనట్లు బద్దకంగా అనిపించింది. టీచర్ పాఠం చెబుతూనే ఉన్నారు- కానీ రవికి మాత్రం ఏమీ అర్థం కావట్లేదు. తెలివి వచ్చిన తర్వాత, 11గంటలకు, చూస్తే వాడు హెడ్మాస్టరుగారి ముందు నిలబడి ఉన్నాడు. "చూడు రవీ, ఇట్లా కుదరదు" అంటున్నాడాయన! రవికి తల తీసేసిట్లైంది. వాడు మర్యాదగా "సరే సర్" అని బయట పడ్డాడు!

ఇట్లా ఒక వారం గడిచేసరికి రవికి దు:ఖం ఆగలేదు. చివరికి, ఏం జరుగుతున్నదో వాళ్ల అవ్వకు చెప్పుకోక తప్పలేదు వాడికి. వాళ్ల అవ్వ వాడిని బుజ్జగించి, "రవీ! చూడు, ఆ ముసలాయన ఎవరో ఋషి అయి ఉంటాడు. అయినా మనకి ఏమీ నష్టం కలగకుండా ఉండేందుకు ఒక ఉపాయం తట్టింది నాకు. మిగిలిన ఈ మూడు వారాలపాటూ నువ్వు ఎవ్వరినీ చిన్నచూపు చూడకు- ఆలోచనల్లోనైనా సరే, 'అందరూ నీ కంటే గొప్పవాళ్లూ, నీకంటే పెద్దవాళ్లూ, గౌరనీయులు' అనుకుంటూ గడుపు. అప్పుడు, 10-11గంటల మధ్య నీకు ఏ కష్టమూ రాదు- సరికదా, నువ్వే ఆ సమయంలో అందరికంటే గొప్పవాడివీ, మంచి వాడివీ అవుతావు. ప్రయత్నించి చూడు" అన్నది.

రవి అతి కష్టం మీద ఆ ఆలోచనని అమలు పరచాడు. ఒక్కోసారి వాడు ఒళ్ళు మరచిన రోజున మళ్ళీ పాత పద్ధతి తలెత్తేది. కానీ వెంటనే వాడు బుద్ధి తెచ్చుకుని తనని తాను సరిదిద్దుకోవటం మొదలుపెట్టాడు. తప్పదు గద!

ఇట్లా రెండు వారాలు గడిచేసరికి , వాడికి ఈ పద్ధతి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాడు అందరితోటీ మర్యాదగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, అందరిని గురించీ మంచిగా అనుకుంటున్నాడు కూడా! చూస్తూండగానే నెల గడిచింది. ఋషి వచ్చి చూసేసరికి, రవి ఆయనకు నమస్కరించి చాలా గౌరవంగా మాట్లాడాడు. బడిలో పిల్లల్లూ, టీచర్లూ, చివరికి రవి వాళ్ళవ్వ కూడా రవిలో మార్పును గురించి సంతోషంగా చెప్పారు. ఆ పైన రవికి పదిగంటల సమస్య ఇక ఎన్నటికి తలెత్తలేదు. వాడు అందరినీ గౌరవిస్తూ, అందరిచేతా 'తెలివైన మంచి పిల్లవాడు ' అని ప్రశంసలందాడు.