రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకడు హనుమంతుడు. పర్వతాలెత్తగల బలమూ, దేనికీ భయపడని మానసిక స్థైర్యమూ ఉండే హనుమంతుడంటే పిల్లలకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. హనుమంతుని హాస్య చతురత, పిల్ల చేష్ఠలే ఈ అభిమానానికి ఊతం.
హనుమంతుని గుళ్లలో విగ్రహానికి పండు నారింజ రంగులో సింధూరం పులిమి ఉంటుంది- గమనించారా? దాని వెనక ఓ కథ ఉంది.
హనుమంతుడికి రామభక్తి చాలా ఎక్కువ. ఆయన రాముడికీ, సీతకూ సన్నిహితంగా అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ సమయంలో హనుమంతుడు రాముడికి ఏవేవి ఇష్టమో కనుక్కుని, ఆయన ఇష్టానికి అనుగుణంగా మెసలుకునేవాడు.
ఒకసారి హనుమంతుడు సీతతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆమె బొట్టు పెట్టుకుంటున్నది. చూస్తున్న హనుమంతుడికి అకస్మాత్తుగా ఓ సందేహం కలిగింది. "తల్లీ! నువ్వు తిలకం ఎందుకు పెట్టుకుంటావు ఎప్పుడూ?" అని అడిగాడు సీతను. సీతకు ఏం చెప్పాలో తోచలేదు. ఆమె చిరునవ్వు నవ్వి, "రాముడికోసం, నాయనా! నేను ఇట్లా నొసటన సింధూరం పెట్టుకుంటే రాముడికి ఇష్టం" అన్నది.
హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. "రాముడికి ప్రీతిపూర్వకంగా ఉండటం నాకూ ఇష్టమే కదా! సీతమ్మ నుదుటిమీద పెట్టుకునే ఇంత చిన్న సింధూరపు చుక్క రాముడికి అంత ప్రీతినిస్తోందే, మరి నేను పూర్తిగా ఒంటినిండా సింధూరం పూసుకుంటే ఎంత సంతోషపడతాడో మరి!" అనుకున్నాడు.
అందుకని వెంటనే వెళ్ళి నూనెలో సింధూరం కలుపుకొని, ఆ తొట్టిలో మునిగితేలాడు. బయటికి వచ్చాక చూస్తే- ఏమి దృశ్యం! చూసినవాళ్ళు అందరూ నవ్వులే నవ్వులు! వాళ్ల నవ్వుల్ని చూసి హనుమంతుడికి ఇంకా సంతోషం కలిగింది.
రాముడికి ఈ సంగతి తెలిసి, ఆయన స్వయంగా వచ్చాడు హనుమంతుడిని చూసేందుకు. తన శిష్యుడు రామ భక్తిలో ఎంతగా మునిగాడో చూసిన ఆయన హనుమంతుడిని సంతోషంగా కౌగలించుకున్నాడు. రాముడికి తన రంగు నచ్చిందని హనుమంతుడు ఇంకా ఉప్పొంగిపోయి, ఇక ప్రతిరోజూ ఒంటినిండా సింధూరం పూసుకోవటం మొదలుపెట్టాడు!
హనుమకు శ్రీరాముడి ఆదరాన్ని సంపాదించి పెట్టిన సింధూరం, నాటినుండీ హనుమంతుడి విగ్రహానికి తప్పనిసరి అలంకారం అయ్యింది!