చాలాకాలం క్రితం ఒక కోటలోని మైదానంలో కొన్ని చెట్లు పెరుగుతూండినాయి. ఆ చెట్ల సమూహంలో ఒక పెద్ద వేపచెట్టుకు అనేక ఒంపులతో కూడుకొన్న కొమ్మలు వచ్చాయి. కానీ దాని ఇరుగుపొరుగున ఉన్న చెట్లన్నీ చాలా సక్కగా(నిటారుగా) పెరిగాయి. దాంతో అవన్నీ కలిసి సొట్టలు సొట్టలుగా ఉన్న వేపచెట్టును ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. ఎగతాళిగా సూటిపోటి మాటలతో బాధపెట్టసాగాయి. పాపం వేపచెట్టు తన ఇరుగు-పొరుగువారి స్వభావాన్ని తలుచుకుని విచారించేదే తప్ప, తన శరీర నిర్మాణాన్ని గురించి మాత్రం పెద్దగా ఆలోచించేదికాదు. మిగిలిన చెట్లేవైనా ఆ విషయాన్ని గురించి అడిగితే "అంతా మన మంచికే" అని జవాబిచ్చేది.
ఆ తర్వాత కొంత కాలానికి అక్కడున్న ఆ చెట్లన్నీ పెద్దగా పెరిగి ఇంకా లావుగా,ఎత్తుగా,బలంగా తయారయ్యాయి. దాంతోపాటే వేపచెట్టుకు వెక్కిరింతలూ ఎక్కువయ్యాయి. తక్కిన చెట్లన్నింటికీ గర్వం కూడా బాగా పెరిగిపోయింది.
ఒకనాడు ఆ మైదానంలోకి వచ్చిన మహారాజుగారు అక్కడి చెట్లను చూశారు. వాటిని చూడగానే మహారాజుగారికి వాటికలపతో చక్కటి సామాన్లు కొన్నింటిని చేయిద్దామనిపించింది. వెంటనే ఆయన అక్కడి మనుషులను పిలిపించి తన కోరికను చెప్పారు. ఇంకేముంది, రాజావారు చెప్పిన వెంటనే పని మొదలెట్టారు సేవకులు. మైదానంలో నిటారుగా పెరిగిఉన్న చెట్లన్నీ గొడ్డలిపెట్లకు నేలకొరిగిపోయాయి.
సామాన్ల తయారీకి అంతగా పనికిరాదనిపించిన వేప చెట్టు ఒకటి మాత్రం మిగిలిపోయిందక్కడ, చివరికి- తన ఒంపుసొంపులతో!!!