చాలాకాలం క్రిందట ఒకసారి, అకస్మాత్తుగా వానలు కరువైయ్యాయి. వర్షఋతువు గడచినా వాన చినుకు లేదు. భూమి ఎండిపోయింది; పంటలు ఎండిపోయాయి. తరువాతి సంవత్సరమూ, ఆ పై సంవత్సరమూ కూడా పరిస్థితులు ఏమాత్రం మెరుగవ్వలేదు. కరువు కోరలు చాచి సంచరించటం మొదలుపెట్టింది.
ఆకలి దప్పులతో అలమటిస్తున్న ప్రజలు 'భవిష్యత్తులో ఇంకా ఏం రానున్నదో' అని భయపడ్డారు. అల్లా తమపై ఎందుకిలా ఆగ్రహిస్తున్నాడో తెలుసుకునేందుకు గాను వారంతా ఒక మహాత్ముడిని ఆశ్రయించారు. ఆ మహాత్ముడు కూడా స్వయంగా కరువు పరిస్థితిని చూసినవాడు కావటంతో, సంతప్త హృదయంతో ఆయన అనేకదినాలపాటు ఉపవాసం ఉండి, ఎంతో భక్తి పూర్వకంగా అల్లాను ప్రార్ధిస్తూ గడిపాడు.
ఫలితంగా, ఒకరోజు ఉదయం నమాజు ముగిసే సమయానికి, అక్కడ హాజరైన జనులందరికీ అల్లా పవిత్ర నిర్దేశం సూటిగా వినవచ్చింది: "పవిత్రులైన మీ అందరి మధ్య ఒక దుర్మార్గుడు ఉన్నాడు. స్వార్థంకొద్దీ అతను అనేక చెడుపనులు చేశాడు. అతడొక్కడి కారణంగా మీరందరూ ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నారు. అతను బహిరంగంగా అందరిముందూ తన తప్పుల్ని ఒప్పుకోవాలి. అప్పటివరకూ ఈ శాపం తొలగిపోదు." అని.
ప్రజలందరిలోనూ నిశ్శబ్దం అలుముకున్నది. 'అల్లాకు కోపం తెప్పించిన ఆ దుర్మార్గుడెవరా' అని అందరూ ఆలోచనలో పడ్డారు. కానీ 'తామే ఆ దుర్మార్గులం'అని మాత్రం ఎవ్వరూ ముందుకురాలేదు.
అయితే అల్లా క్రోధానికి కారణమైన ఆ దుర్మార్గుడికి మాత్రం తన ఆట కట్టిందన్న సంగతి అర్థం అయ్యింది. తన తప్పుల్ని తాను ఇక బయటపెట్టక తప్పదు! అందువల్ల వాడు ఇంటికి పోయి, ఒక గదిలో చాప పరచుకొని కూర్చొని, కళ్ళలో నీళ్ళు ధారలు కట్టగా ప్రార్ధించటం మొదలుపెట్టాడు: " అల్లా, దయచూడు. బహిరంగంగా క్షమాపణ కోరటం ఒక్కదాన్నీ మినహాయించు. అంత పరీక్షకు తట్టుకునే శక్తి నాకు లేదు. నేను పాపంచేసి సంపాదించిన ఒక్కొక్క పైసనూ నిజాయితీగా ఎవరిది వాళ్లకు తిరిగి ఇచ్చేస్తాను. ప్రజలను దోచి కూడబెట్టిన సొమ్ములో ఒక్క పైసను కూడా నేను ఉంచుకోను. నేను అలా పంచేటప్పుడు అందరూ నా పాపాన్ని గుర్తిస్తే గుర్తిస్తారు గాక, కానీ నాపాపాలను నాకుగా అందరిముందూ బహిర్గతం చేయమని మాత్రం శాసించకు, ప్రభూ! దయచూడు!" అని.
కొద్ది రోజుల్లో వానలు తిరిగి మొదలయ్యాయి. త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొన్నది. అయితే, 'అల్లా ఆదేశించిన విధంగా ఏ దుర్మార్గుడూ తన తప్పుల్ని ఒప్పుకోకుండానే, మరి, వానలు ఎలా మొదలయ్యాయి?' అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో అందరిలోకీ ఎక్కువ ఆశ్చర్యానికి లోనైన మహాత్ముడు అల్లా నిర్దేశాన్ని కోరుతూ మళ్ళీ ప్రార్థనలో మునిగాడు.
చివరికి, కొన్ని దినాలకు అల్లా స్పష్టీకరణ వెలువడింది: " అవును. నీ సందేహం నాకు అర్థమైంది. నేరస్తుడు నాముందు నిలచి, తన తప్పుల్ని సంపూర్ణంగా అంగీకరించాడు. వాటిని బహిరంగంగా ఒప్పుకునేంత మానసిక స్థైర్యం అతనికి లేదు. కానీ తాను దోచిన సంపదనంతా ఎవరిది వాళ్లకు తిరిగి ఇచ్చేయాలని అతనికి నిజమైన సంకల్పం కలిగింది. అతని గాఢమైన ప్రార్థన నా హృదయాన్ని కూడా కరిగించింది. నిజమైన ప్రార్థన ఎంతటి దుర్మార్గుడినుండి వచ్చినాసరే, దాన్ని నేను పట్టించుకోకుండా ఉండలేను. అందువల్ల నేను కరుణించి వానల్ని పంపాను. ఆ నేరస్తుడెవరో మీరందరూ సులభంగానే కనుగొనగలరు. అయితే మీరంతాకూడా అతన్ని క్షమించి, అతని తప్పుల్ని మరచిపోండి. క్రోధాన్ని మనసులో ఉంచుకొని, ప్రతీకారం కోరుకునేకంటే, కరుణతో క్షమించటం మంచిది" అని.