రాముకు చెప్పులంటే చాలా ఇష్టం. ఎవరి చెప్పుల్ని చూసినా తనకూ అలాంటి చెప్పులుంటే బాగుండుననుకునేవాడు. ఒకసారి అతను అనంతపురం వెళ్లాడు. అక్కడ దుకాణాల ముంగిట, వరసలు వరసలుగా మెరుస్తున్న చెప్పులు అతన్ని కదలనివ్వలేదు. చూసీ చూసీ చివరికి అతనో జత చెప్పులు కొనుక్కున్నాడు. ఎర్రటి చెప్పు క్రింద నల్లటి తోలు! పైన అందంగా అమర్చిన బంగారు రంగు చంకీ! చెప్పులు భలే ఉన్నై! అవి వేసుకొని తిరిగితే గాలిలో ఎగిరినట్లే ఉంది!
చాలా ఉత్సాహంగా ఆ చెప్పుల్ని వేసుకొని ఇంటికొచ్చాడు అతను. ఇంటికైతే వచ్చాడుగానీ వాటిని వదలబుద్ధి కాలేదు. వాటిని వేసుకొని ఇంట్లో అంతా తిరిగాడు; మళ్లీ మళ్ళీ వాటినే చూసుకొని మురిశాడు. అయినా తనివి తీరలేదు. వాటిని వేసుకొనే అన్నం తిన్నాడు; వాటిని వేసుకొనే నిద్రపోయాడు, నిద్రలేచాక మళ్లీ వాటిని చూసుకొని మురిశాడు - ఏం చేసినా తృప్తి కాలేదు! ఇక అవి అతని శరీరంలో భాగం అయిపోయాయి. క్షణం వదలకుండా వేసుకొని తిరుగుతున్నాడు రాము.
మామూలుగా `చెప్పులకేం తెలీద'నుకుంటాం గానీ, నిజానికి వాటికీ చాలానే తెలుసు. అవీ అలసిపోతాయి. రాము ఇలా వాటిని వదలకుండా వారం రోజులు వేసుకునే సరికి వాటికి ఎలా తప్పించుకుందామా' అని అలోచన మొదలైంది. కానీ రాము వాటిని వదిలితే గద! చివరికి ఒకసారి రాము గుడికి వెళ్ళి, అయిష్టంగానే చెప్పుల్ని బయట వదిలి, లోనికి పోగానే - చెప్పులు రెండూ
సమయమిదే'నని చల్లగా జారుకున్నాయి.
అట్లా పారిపోయిన చెప్పులకు ఏం చేయాలో తెలీలేదు. అందుకని అవి ఓ అడవిలోకి వెళ్లి ఒక పొద మాటున నక్కి కూర్చుని, ఓం నమ: శివాయ' అని జపం మొదలుపెట్టాయి. వాటి మొరను ఆ శివుడు విన్నాడో లేదో గాని, ఆ దారిన పోయే కట్టెల రంగయ్య మాత్రం చక్కగా విన్నాడు. విని, అతను వచ్చి ఆ చెప్పుల్ని వేసుకొని రాజాలాగా నడవటం మొదలుపెట్టాడు! చెప్పుల పని
పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు'యింది. రంగన్న బరువు ఎక్కువ. అదీగాక అతను అడవి దారుల్లో ఇష్టంవచ్చినట్లు తిరిగేరకం. ఆ చెప్పులు వేసుకొని బరువైన రంగన్న ముళ్ల దారుల్లో పోతుంటే ఒక్కోముల్లూ వాటిని గుచ్చి, శూలంలాగాఅ బాధపెడుతున్నది.
రెండు రోజుల్లో వాటి పనైపోయింది! "ఈ అడవి బ్రతుకు బాగాలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి రంగన్న నుండి" అనుకున్నై అవి. త్వరలోనే వాటికి ఆ అవకాశం వచ్చింది. రంగన్న ఒక రోజున వాటిని విడిచి చెట్టెక్కి, కొమ్మలు నరికాడు. ఆపైన క్రిందికి దిగి కట్టెలు కొట్టుకొన్నాడు ; తర్వాత మోపునెత్తుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడు - చెప్పులు మరచి! చెప్పులకు మహదానందమైంది. ఇక అవి రెండూ పారిపోయి, అడవి చివర్లో ఓ గడ్డివాము కనబడితే, దానిలోకి పోయి దాక్కున్నాయి.
ఆవుల్ని మేపే ఆదెయ్య అటువైపు వచ్చేసరికి చెప్పులు గాఢ నిద్రలో ఉన్నాయి. కానీ ఆదెయ్య పశువులకోసమని గడ్డి పీకేసరికి అవీ బయటపడ్డాయి. ఇక చెప్పులకు ఆదెయ్య సేవ తప్పలేదు. ఆదెయ్య పశువుల పేడనెత్తినా, మూత్రాన్ని ఎత్తిపోసినా ఈ చెప్పులు వినియోగంలోకి వచ్చాయి. ఎరువు దిబ్బల వెంబడీ, వరిచేళ్ల గట్ల వెంబడీ, జారే జారే బురదలోనూ నడిచీ నడిచీ చెప్పులు నల్లబారాయి. ఇప్పుడు వాటికి బంగారు చంకీలు లేవు. ఎర్రటి పైతోలు లేదు. బంకమన్ను, గడ్డిపోచలు అంటుకొని అవి ఇప్పుడు లావెక్కాయి, బరువుతేలాయి. "ఇది ఇక అయ్యేది లేదు. తప్పించుకోవలసిందే" అనుకున్నై అవి. "రాము మమ్మల్ని ఎంత ముద్దుగా చూసుకునేవాడు! అట్లాంటి వాడిని వదిలి వచ్చేశాం, చూడు" అని వాటిలో పశ్చాత్తాపం మొదలైంది. ఒక రోజున ఆదెయ్య వాటిని వేసుకొని ఊళ్లోకి పోతే, అయిష్టంగానే మోశాయవి. వాటి కోరిక తీరాలనో, ఏమో- ఆదెయ్య వాటిని ఓ ఇంటి ముందు వదిలి, లోనికి వెళ్ళాడు. చూస్తే ఆ ఇల్లు ఎవరిదో కాదు - రాముదే!
చెప్పులకు మహదానందమైంది. అవి ఆదెయ్యకు దొరకకుండా తప్పుకొని వేరే మూలన దాక్కున్నాయి. బయటికి వచ్చిన ఆదెయ్య కొంచెం వెతుక్కుని, `సర్లే, పోతే పోయాయి" అనుకొని వెళ్లిపోయాడు. వెంటనే చెప్పులు బయటికి వచ్చి గడప పక్కనే కూర్చున్నాయి - 'రాము తమని ఎప్పుడు చూస్తాడో, ఎప్పుడు మళ్ళీ ముద్దు చేస్తాడో' అని ఎదురుచూస్తూ.
రాము ఆ పక్కగా చాలాసార్లు వెళ్ళాడు. కానీ వాటివైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు. ఒకరోజున- `ఎవరో వీటిని ఇక్కడ వదిలేసిపోయారు. పాత మురికి చెప్పులు! ఎవరికి పనికొస్తాయి?" అని రాము వాళ్ల అమ్మ ఆ చెప్పుల్ని తీసి బయట ఓ పక్కకు విసిరేసింది!