రామాపురం అనే ఊళ్లో రామయ్య, చంద్రమ్మ అనే దంపతులు నివసించేవారు. వాళ్లకు `సుశీల' అనే కూతురు, సుధీరుడు, సుమేధుడు అనే ఇద్దరు బలశాలులైన కొడుకులు ఉండేవాళ్లు. సుశీల చాలా అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి అందాన్ని చూసిన రాక్షసుడు ఒకడు ఒకనాడు ఆమెను ఎత్తుకెళ్ళిపోయాడు. తమ కూతుర్ని రాక్షసుడు ఎత్తుకపోవడంతో తల్లిదండ్రులిద్దరూ ఎంతో బాధపడ్డారు.
తమ అక్కను ఎత్తుకుపోయిన రాక్షసుణ్ని చంపి, వాడి చెరనుండి అక్కను విడిపించుకొస్తామని బయల్దేరారు సుధీరుడు, సుమేధుడు. వాళ్లు అట్లా రాక్షసుణ్ని వెదుక్కుంటూ పోతున్న సమయంలో చిన్నవాడైన సుమేధునికి ఒకచోట నల్లగా, గుండ్రంగా మెరుస్తూన్న రాళ్లు కొన్ని కనిపించాయి. వాటిని చూడగానే అతనికి వాటిని తీసి దాచుకోవాలనిపించింది. వెంటనే అతను తన అన్న సుధీరుణ్ని అడిగాడు "అన్నా, ఈ రాళ్లను తీసుకువెళదాం" అని.
"సరే" తీసుకోమన్నాడు సుధీరుడు. వాటిని అన్నింటినీ ఏరి తన దగ్గర దాచుకున్నాడు సుమేధుడు, చాలా జాగ్రత్తగా.
ఆ తర్వాత రెండు పెద్ద చాటలు దారిలో పడి కనిపించాయి సుమేధునికి. వాటినికూడా తీసుకోవాలనిపించింది అతనికి . సుధీరుణ్ని అడిగాడు మళ్ళీ `తీసుకుంటానని.
"సరే తీసుకో"మన్నాడు సుధీరుడు.
రెండు చాటలనూ తీసుకొని దాచుకున్నాడు సుమేధుడు. ఆ తరువాత అతనికి దారిలో ఒంటరిగా పోతున్న గాడిద ఒకటి కనిపించింది. దాన్నికూడ తనతోపాటు తీసుకుపోవాలనుకున్నాడు అతను. సుధీరుణ్ని అడగ్గా "సరే పట్టుకుందాం" అన్నాడు. ఆ గాడిదను పట్టుకుని, తాము అంతకుముందు తీసుకున్న రాళ్లని, చాటల్ని దానిమీద పెట్టి, దాన్ని నడిపించుకుంటూ ముందుకు పోసాగారు అన్నదమ్ములిద్దరూ.
అప్పటికే వారు చాలా దూరం ప్రయాణించారు. కానీ రాక్షసుడి జాడ తెలీలేదు. అయినప్పటికీ ఓరిమిగల సుధీరుడు, తమ్మునితో కలిసి ప్రయాణాన్ని కొనసాగించాడు నిర్విరామంగా. వారలాపోతున్న సమయంలో సుమేధుడి చూపు దారి ప్రక్కన పడిఉన్న ఓ పొడుగాటి తాటిచెట్టు మీద పడింది. దాన్ని కూడా తమతో తీసుకు పోదామన్నాడతను అన్నతో.
సుధీరుడికి అది అంతగా నచ్చలేదు. "తమ్ముడూ, మనం వచ్చిన పని మరచి, దారిలో కనపడ్డవన్నీ తీసుకొంటూ పోతే మనకేమీ లాభం లేదురా. మనం మనము వెళుతున్న పనిమీదనే మనసుపెడితే బాగుంటుంది" అన్నాడు. కానీ సుమేధుడు వినలేదు. తాటిచెట్టునుకూడా తీసుకొనే వస్తానన్నాడు. చేసేదిలేక "సరే తీసుకో"మన్నాడు సుధీరుడు.
ఇద్దరూ కలిసి తాటిచెట్టును ఎత్తి, గాడిదమీద పెట్టుకుని ముందుకుపోయారు. ఆ రోజు సాయంత్రానికి వాళ్లొక చెరువు దగ్గరకు చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే బసచేద్దామనుకున్నారు. అంతలోనే, ఆశ్చర్యం! వాళ్ళక్క సుశీల అక్కడికి నడుచుకుంటూ వచ్చింది, నీళ్ళకోసమని! అక్కను చూడగానే అన్నాదమ్ముళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు. కానీ సుశీలమాత్రం చాలా భయపడింది. రాక్షసుడు తనను బంధించి, రోజూ తనతో ఎలా పనిచేయిస్తున్నది చెప్పింది తమ్ముళ్లతో. "మీరిక్కడికొచ్చిన విషయం తెలిస్తే వాడు మిమ్మల్నిద్దరినీ చంపేస్తాడు. వెంటనే వెళ్ళిపొండి" అని చెప్పింది.
కానీ తమ్ముళ్లిద్దరూ "ఆ రాక్షసుడిని చంపి నిన్ను ఇంటికి తీసుకొనే వెళతాం" అన్నారు. వద్దని సుశీల ఎంతగా చెప్పినా వినకుండా, వాళ్ళు తమతోపాటు తెచ్చుకున్నవాటినన్నీ తీసుకుని రాక్షసుడు ఉండే చోటికి వెళ్ళారు. రాక్షసుడి ఇల్లు చెట్ల మధ్య ఉన్నది. దానికి కనీసం గోడలు కూడా లేవు!
అప్పటికి సాయంత్రం అవుతున్నది. "ఇంకొంచెం సేపట్లో రాక్షసుడు ఇంటికి వస్తాడు. మీరిద్దరూ అటకమీద దాక్కోండి" అని వాళ్లకొక అటకను చూపించింది సుశీల. అన్నదమ్ములిద్దరూ అటకెక్కిన కాసేపటికి రాక్షసుడు ఇంటికొచ్చాడు.
వచ్చీ రాగానే వాడు `నరవాసన, నరవాసన' అనటం మొదలుపెట్టాడు. "నేను మనిషినే కదా. మరి ఇక్కడ నరవాసన రాకుండా ఎలా ఉంటుంది?" అన్నది సుశీల వాడితో. ఇక ఆపైన ఆమె వాడికి అన్నం వడ్డించింది.
వాడలా అన్నం తినడం మొదలుపెట్టాడో లేదో, అటకమీదున్న సుమేధుడు "మూత్రం వస్తోందన్నా!" అన్నాడు, సుధీరునితో.
"కాసేపాగరా!" అన్నాడు సుధీరుడు గుసగుసగా.
"ఆపుకోలేనన్నా" అన్నాడు సుమేధుడు.
చేసేదిలేక "కొంచెం కొంచెంగా పొయ్య"మన్నాడు సుధీరుడు. ఒకసారి మూత్రం పొయ్యడం మొదలుపెట్టిన సుమేధుడు ఇక ఆపుకోలేక తన కడుపు పూర్తిగా ఖాళీచేసేశాడు. ఆ మూత్రమంతా ధారగా కింద అన్నం తింటున్న రాక్షసుడి కంచంలో పడటం మొదలుపెట్టింది.
రాక్షసుడు "ఏమిటది?!" అని అరిచాడు కోపంగా. "పైన నెయ్యి కుండ పెట్టాను. దానికి చిల్లి పడ్డట్లున్నది" అన్నది సుశీల.
"నెయ్యా! నెయ్యయితే మంచిదేలే!" అని దాన్నంతా కలుపుకొని తినడం మొదలుపెట్టాడు వాడు.
అంతలోనే సుమేధునికి వరసగా తుమ్ములు మొదలయ్యాయి. వాటిని విన్న రాక్షసుడికి, పైన ఎవరో ఉన్నారని అర్థమైపోయింది. "ఎవరురా, పైనున్నది?!" అని అరిచాడు వాడు కోపంగా.
సుధీరుడు కొంచెం ఆలోచించి, "మేం నీకన్నా పెద్ద రాక్షసులం" అని ఇంకా బిగ్గరగా అరిచాడు.
ఆ మాటలు వినగానే రాక్షసునికి భయం వేసింది. కానీ, లేని ధైర్యాన్ని తెచ్చుకొని , "ఏదీ, నీ కళ్లెలా ఉంటాయో చూపించ"మన్నాడు వాడు.
వెంటనే సుమేధుడు తను ఏరి తెచ్చుకున్న మెరిసే నల్లని గుండ్రాళ్లను చూపించాడు. వాటిని చూసిన రాక్షసుడు మరింత భయపడుతూ, "నీ చెవులు చూపించు" అన్నాడు.
వెంటనే సుమేధుడు తన దగ్గరున్న రెండు చేటలను చూపించాడు. అంత వెడల్పున్న చెవుల్ని చూసి రాక్షసుడు నిర్ఘాంతపోయాడు.
అయినా జంకక, వాడు "నీ ఎత్తు చూపించు" అన్నాడు. అప్పుడు సుమేధుడు తను తెచ్చిన తాటి చెట్టును చూపించాడు. అంత పొడవు రాక్షసుడిని ఊహించుకొని రాక్షసుడు ఇంకా బెదిరిపోయాడు.
అయినా మొండిగా వాడు "ఏదీ, నీ అరుపెలా ఉంటుందో వినిపించు, చూద్దాం!" అన్నాడు.
అప్పుడు సుమేధుడు తమతోబాటు అటక ఎక్కించిన గాడిదను కొట్టాడు గట్టిగా. మరుక్షణంలో అది బిగ్గరగా ఓండ్రపెట్టింది. ఇక రాక్షసుడు పూర్తిగా బెదిరిపోయాడు. "అమ్మో! వీడెవడో నాకంటే పెద్ద రాక్షసుడే" అనుకొని సుశీలను వదిలిపెట్టి, వెనక్కి తిరిగి చూడకుండా పరుగుతీశాడు.
అన్నదమ్ములిద్దరూ సుశీలను వెంటబెట్టుకొని అక్కడినుండి బయటపడ్డారు. రాక్షసుడు దాచిన సంపదల్ని అన్నింటినీ గాడిదపైన వేసుకొని, సంతోషంగా ఇల్లు చేరుకున్నారు!