అక్బర్ పాదుషా వారి దర్బారులో అత్యంత సమర్థుడైన మంత్రిగా బీర్బల్ కు పేరుండేది. కేవలం తెలివిగలవాడే కాక, బీర్బల్ నిజాయితీపరుడు, దయాశీలి, హాస్య చతురుడు కూడాను. ఇవన్నీ బీర్బల్ ను అక్బర్ కు అత్యంత సన్నిహితుడుగా చేశాయి. బీర్బల్ సమయస్ఫూర్తీ, సమస్యల్ని పరిష్కరించటంలో అతనికున్న ప్రతిభా అసాధారణమైనవి. అందువల్ల అక్బర్ పాదుషా అన్ని సమయాల్లోనూ బీర్బల్ ను ప్రక్కన ఉంచుకొని, పాలనా పరమైన అన్ని నిర్ణయాలలోనూ అతన్ని సంప్రతించేవాడు.
సహజంగానే, సభలోని ఉద్యోగులు అనేకమందికి ఇది కంటగింపుగా తయారైంది. బీర్బల్ తప్పిదాలు ఎక్కడ దొరుకుతాయా, ఎలాగ అతని అడ్డు తొలుగుతుందా అని ఎదురుచూసేవాళ్ళు తోటివాళ్ళు చాలా మంది. కానీ ఎంతకాలం గడిచినా బీర్బల్ వాళ్ళెవరి చేతికీ చిక్కలేదు. వేచి వేచి వేసారిపోయిన సహోద్యోగులు కొందరు బీర్బల్ పని పట్టేందుకు ఒక పథకం రచించారు.
అక్బర్ పాదుషాకు గడ్డం చేసే మంగలివాడొకడు చాలా దుష్టబుద్ధి. వాడికి వృత్తి రీత్యా రాజ రహస్యాలుకూడా అనేకం తెలిసిఉండేవి. అంతేకాక వాడికి బీర్బల్ అంటే చాలా కోపం కూడాను.రాజోద్యోగులు వాడికి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చి, బీర్బల్ ను ఏకంగా చంపేసేందుకు కుట్రపన్నారు. పాదుషావారికి గడ్డం చేస్తున్న సమయంలో మంగలి "జహాపనా! మన ఢిల్లీ నగరానికి బెంగాల్ నుండి ఒక అద్భుత వ్యక్తి విచ్చేసి ఉన్నాడు. ఆయన చేసే మహిమలు ఇన్నీ అన్నీ అని వర్ణించలేను." అన్నాడు.
సహజంగానే అక్బర్ కు ఆసక్తి కలిగింది. "ఎలాంటి మహిమలు, అవి?" అని అడిగారాయన కుతూహలంతో.
"జహాపనా! ఆయన మహిమలు అనేకాన్ని చూశాను నేను, స్వయంగా, ఈ కళ్లతో. అయితే ఆయన శక్తుల్లో ఒకటి మాత్రం నన్నెంతో ఆకట్టుకున్నది. ఆయన తన శక్తితో ఎవరినైనా స్వర్గానికి పంపి, తిరిగి వెనక్కి రప్పించగలడు! కొన్నాళ్ళుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను- గౌరవనీయులైన మన మంత్రుల్లో ఎవరినైనా ఒకరిని స్వర్గానికి పంపి, తమరి పూర్వీకుల్ని సందర్శించి రమ్మంటే బాగుండును కదా,అని." అన్నాడు మంగలి తెలివిగా.
మంగలి వెళ్ళిపోయిన తర్వాతకూడా అక్బర్ పాదుషా ఆలోచన కొనసాగింది. మరుసటిరోజున ఆయన దర్బారులో సభికులకు తను విన్న సంగతులు చెప్పి, ఆ బెంగాలీ వ్యక్తిని సగౌరవంగా ఆహ్వానించమన్నాడు. వింతదుస్తులు ధరించిన ఆ వ్యక్తి రాగానే దుష్టులైన రాజోద్యోగులు ముందు నిర్ణయించుకున్న విధంగా ఆయనకు జేజేలు పలికి స్వాగతం చెప్పారు. తామందరం ఆయన శిష్యులమేనని, ఆయన మహిమల్ని స్వయంగా చూశామనీ నమ్మబలికారు. దానితో పాదుషా వారికి ఆయన శక్తుల మీద కొద్దిగా నమ్మకం కలిగింది.
ఆ తరువాత బెంగాలీవాడు పాదుషాకు అభివాదం చేసి, ఆ సరికే తాను అనేకమందిని స్వర్గానికి పంపి తిరిగి వెనక్కి తెప్పించాననీ, కావలిస్తే అలా వెనక్కి వచ్చినవారిని అనేకమందిని తాను చూపించగలననీ, పాదుషావారు తమ మనుషుల్ని ఎవరినైనా స్వర్గానికి పంపదలిస్తే, తాను తనవంతు సహకారం అందించగలననీ చెప్పాడు.
ఆ సరికి పాదుషావారికి ఈ వింతపట్ల ఆసక్తి బాగా అధికమైంది. "ఈయన సాయంతో స్వర్గం వెళ్ళి, మా పూర్వీకులను సందర్శించి తిరిగి వచ్చేందుకు ఇక్కడున్నవారిలో ఎవరు సిద్ధపడగలరు?" అని అడిగారాయన, సభికులను. వారిలో ఒకడు లేచి, "హుజూర్, తమరి ఆజ్ఞ అయితే ఆ కార్యభారాన్ని నేను మోయగలను." అన్నాడు. వెంటనే మరొకడు లేచి, "జహాపనా! ఇది చిన్నపని కాదు. ఎంతోగొప్పదీ, అసాధారణమూ అయిన పని ఇది. ఈ పనికై మనం అత్యంత ప్రతిభాశాలులను ఎంపికచేసుకోవాలి తప్ప సామాన్యులు ఇందుకు పనికిరారు. ఈ పనికి బీర్బల్ ని నియోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం" అన్నాడు. ఆ వెంటనే దుష్టులందరూ, ముందస్తు ప్రణాలిక ప్రకారం, దాన్ని ఆమోదిస్తున్నట్లు హర్షధ్వానాలు చేశారు.
అప్పటివరకూ బీర్బల్ ఏమీ మాట్లాడకుండా అందరినీ గమనిస్తూ కూర్చున్నాడు. ఇందులో ఏదో తిరకాసు ఉన్నదని అతను తొలుతనే అనుకున్నాడు. అయితే అటూ ఇటూ తిరిగి, చివరికి పని తనమీదే పడటంతో అతని సందేహాలు పటా పంచలయ్యాయి. "ఇందులో ఏదో కుతంత్రం ఉన్నది" అని అతనికి నిశ్చయమైపోయింది. అందువల్ల, అక్బర్ తనవైపు తిరిగి "మీరు ప్రయాణానికి సిద్ధమేనా, బీర్బల్?" అని అడగ్గానే, బీర్బల్ కాదనలేకపోయాడు. "మా కుటుంబ సభ్యులందరినీ అడిగి, ఏసంగతీ మూడు రోజుల్లో చెప్తాను జహాపనా!" అని తప్పుకున్నాడు అప్పటికి.
ఆరోజు ఇంటికి వెళ్లగానే బీర్బల్ విశ్వాసపాత్రులైన తన మనుషులద్వారా సమాచారం సేకరించాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు, సహోద్యోగుల మోసమూ, మంగలి కుతంత్రమూ, బెంగాలీ మోసగాడి విధానాలూ అన్నీ తెలిసిపోయాయి అతనికి. "ముల్లును ముల్లుతోనే తీయాలి" అని, బీర్బల్ ఆ పధకానికి విరుగుడుగా మరో పధకాన్ని అమలు చేయాలని నిశ్చయించుకున్నాడు. స్వర్గారోహణకోసం తన సన్నద్ధతను తెలియజేసి, నెలరోజుల తర్వాత ముహూర్తం పెట్టించుకున్నాడు. ఆలోగా తన ఏర్పాట్లన్నీ పూర్తిచేసుకున్నాడు రహస్యంగా.
ముహూర్తం సమీపించింది. రాజ్యంలోని ప్రజలంతా స్వర్గారోహణం చూసేందుకు ఒక మైదానం చేరుకున్నారు. బెంగాలీమోసగాడు బీర్బల్ ని ఆ మైదానం మధ్యలో ముందుగా తయారుచేయించి ఉంచిన యజ్ఞకుండంలో కూర్చోబెట్టాడు. అన్నివైపులనుండీ కట్టెలుపెట్టి మూసివేశాడు. వాటిపై చాలా కుండల నెయ్యిపోయించాడు. ఏవేవో మంత్రాలు చదువుతూ, చివరికి ఆ చితికి నిప్పు అంటించాడు.
మామూలుగా అయితే బీర్బల్ మాడి మసైపోయేవాడే. కానీ ఈ విధానం అంతా ముందుగానే తెలుసుగనక, బీర్బల్ చాలారోజుల క్రితమే తన మనుషులను పురమాయించి, అదే యజ్ఞవాటిక క్రిందుగా తన ఇంటి వరకూ ఓ రహస్య సొరంగాన్ని త్రవ్వించి పెట్టుకున్నాడు! బెంగాలీవాడు ఒకసారి తనని కట్టెలతో కప్పెయ్యగానే అతను లేచి, సొరంగపు తలుపు తీసుకొని, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆపైన అతను ఒక రెండు నెలలపాటు ఎవరికీ కనబడకుండా ఇంట్లోనే ఉండిపోయాడు.
ఆలోగా బీర్బల్ సహోద్యోగులందరూ పండగ చేసుకున్నారు అనేకసార్లు. తమకు బీర్బల్ బారినుండి శాశ్వతంగా విముక్తి కలిగించినందుకుగాను వాళ్లంతా మంగలికీ, బెంగాలీవాడికీ అనేక బహుమానాలిచ్చారు. ఇకపై హాయిగా ఉండచ్చనుకున్నారందరూ. బీర్బల్ అడ్డుతొలగిపోయిందని అలా చాలా సంబరంగా ఉన్న వాళ్ళందరికీ ఒకనాడు అకస్మాత్తుగా జ్వరం వచ్చినట్లైంది! కారణం, బీర్బల్ స్వర్గంనుండి తిరిగివచ్చాడట! నగరంలో పౌరులందరూ అతనికి బ్రహ్మరధం పడుతున్నారట! అక్బర్ పాదుషాకు ఎంత సంతోషం కలిగిందంటే, ఆయన స్వయంగా బయటికి వెళ్ళి బీర్బల్ ను తోడుకొని వచ్చారు! బీర్బల్ చూసేందుకు బాగానే కనిపించాడు. సంతోషంగా కూడా ఉన్నాడు. కేవలం అతని గడ్డం కొంచెం మాసి ఉన్నది అంతే.
అక్బర్ పాదుషా బీర్బల్ ను సాదరంగా కూర్చోబెట్టి స్వర్గలోకపు విశేషాలూ, తన అనుభవాలూ, తమ పూర్వీకుల వివరాలూ సభికులందరూ వినేలా చెప్పమన్నారు. "ఓహ్! స్వర్గలోకం చాలా బాగుంది!" అన్నాడు బీర్బల్ మైమరచిపోతూ. "అక్కడ అందరూ ఉల్లాసంగా ఉన్నారు. కొంతసేపు వెతికిన మీదట నాకు తమ తండ్రి హుమాయున్ ప్రభువూ, తమ తాత బాబర్ పాదుషా వారూ కనబడ్డారు. వారి సాయంతోనేను తమరి బాబాయిలు, మామయ్యలు కొందరిని గుర్తించగల్గాను. వాళ్లంతా చాలా కులాసాగా, సంతోషంగా ఉన్నారు. అందరూ మీకు తమ శుభాకాంక్షలూ, ఆశీస్సులూ తెలియజేయమన్నారు. మీకోసం వాళ్ళు అనేక బహుమతులు పంపబోయారు; అయితే సుదూర ప్రయాణం కావటం వల్ల, నేను వాటినన్నింటినీ మర్యాదగానే తిరస్కరించవలసి వచ్చింది!" అన్నాడు బీర్బల్ ఉత్సాహంగా.
"వారికేమన్నా తీరని అవసరాలున్నాయా? భూలోకంనుండి మనం వారికి పంపగల్గినవి అన్నట్లు మీకేమైనా తోచాయా?" అడిగారు పాదుషావారు.
"లేకేమి? నిక్షేపంగా ఉన్నాయి. వాళ్లందరూ నన్ను ప్రత్యేకంగా కోరారు- భూలోకం నుండి ఒక మంచి మంగలిని తప్పకుండా పంపమని! వాళ్లందరికీ కొంచెం గడ్డాలు, మీసాలు పెరిగి ఉన్నై. మరీ తీవ్రమైన అసౌకర్యం అంటూ ఎవరికీ లేదుగానీ, 'వీలైతే మన ఆస్థాన మంగలిని కొన్నాళ్లపాటు పంపితే మేలు' అని తమకు మనవి చేయమన్నారు. స్వర్గంలో మంగల్ళు పెద్దగా ఉన్నట్లు లేరు. ఈ రెండు నెలల్లో నాగడ్డంకూడా బాగానే మాసింది" అన్నాడు బీర్బల్.
పాదుషావారికి పరమానందం అయ్యింది. వెంటనే రమ్మని మంగలికి కబురుచేశారు. బీర్బల్ ఎలా తిరిగివచ్చాడో తెలీక కొట్టుమిట్టాడుతున్న మంగలికి ఇప్పుడు నేరుగా స్వర్గారోహణానికే ఆదేశాలు ఇవ్వబడ్డాయి! ఆ కార్యక్రమాన్ని బీర్బల్ స్వయంగా దగ్గరుండి జరిపించాలని నిర్ణయించారు పాదుషావారు. ద్రోహి మంగలికి పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. అతన్ని ప్రేరేపించిన రాజోద్యోగులెవ్వరూ కిక్కురుమనకుండా అయ్యింది. అందరూ తేలుకుట్టిన దొంగలమాదిరి, నోటమాటరాక కూర్చుండిపోయారు.
మరునాటికల్లా ప్రాణభయంతో మంగలి బీర్బల్ శరణుజొచ్చాడు. వెంటనే బీర్బల్ వాడిని అక్బర్ పాదుషావారి దగ్గరకు తీసుకుపోయాడు. దానితో రాజోద్యోగుల కుతంత్రం మొత్తం బయటపడింది. దుర్మార్గులైన రాజోద్యోగులందరూకూడా లెంపలు వేసుకొని క్షమాపణ కోరారు. బీర్బల్ కోరికమేరకు, పాదుషావారు అందరినీ క్షమించి వదిలిపెట్టారు. అయితే 'ఇకపై ఏనాడూ ఇలాంటి దుస్సాహసం చేయమ'ని రాజోద్యోగులు అందరూ ప్రమాణాలు చేయవలసి వచ్చింది!