అడవిలో ఎలుగుబంటి ఒకటి ఉండేది. ఒకసారి అది తేనె కోసం వెతుకుతూ ఉంటే, చెట్టుపైన ఓ పెద్ద తేనెపట్టు కనిపించింది.

ఆ తేనెపట్టులోంచి తేనె కారుతోంది! కొంచెం కొంచెంగా, చెట్టు క్రిందికంటా కారుతోంది. ఎలుగుబంటి ఇంక ఊరుకుంటుందా? వెళ్ళి దానిని నాకటం మొదలు పెట్టింది.
అది చూసాయి తేనెటీగలు! ’అమ్మో! ఈ ఎలుగుబంటి తేనెను నాకి ఊరుకోదు. మళ్ళీ చెట్టెక్కుతుంది. మన తేనెపట్టును పట్టుకొని, దాన్ని పిండి తినేసేటట్లుంది!’ అనుకొని, దాని మీదికి దూకి కుట్టసాగాయి. అది గమనించిన ఎలుగుబంటి చేతికందిన రాళ్ళను, ఆకుల్ని, చెత్తను, చెట్టుకొమ్మల్ని వాటి మీదకు విసిరేస్తూ గంతులు వేసింది. తేనెటీగలేమో వాటినుండి తప్పించుకొని దూరంగా ఎగురుతూ, మళ్ళీ తిరిగి వచ్చి దాన్ని కుడుతూ పోయాయి.


కొద్ది సేపటికి ఎలుగుబంటేమో తేనెటీగల్నుంచి తప్పించుకొని పారిపోయింది. కానీ ’బుల్లి’ అనే తేనెటీగకు ఎలుగుబంటి వేసిన రాయి తగిలింది పాపం. దాని రెక్క కాస్తా విరిగి వేలాడసాగింది. అది నేలమీద పడిపోయింది. తేనెటీగలన్నీ దాన్ని చూసాయి కానీ, ఏమీ చెయ్యలేక ఊరుకున్నాయి.

అయితే కొద్ది సేపటికి తిరిగి వచ్చింది ఎలుగుబంటి! అది వచ్చీ రాగానే అటూ ఇటూ చూసి, బుల్లిని తీసుకెళ్ళి తన గుహలో ఒకచోట పెట్టింది. దానికి రోజూ ఆహారం పెట్టింది. ఏవో ఆకుల్ని తెచ్చి పిండేది దాని రెక్కమీద. అట్లా కొన్ని రోజులు గడిచే సరికి బుల్లి రెక్క అతుక్కున్నది! అది ఎగరగలిగే స్థితికి రాగానే ఎలుగుబంటి దాన్ని విడిచిపెట్టింది.

బుల్లి తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఎలుగుబంటి మంచితనం గురించి చెప్పింది.

అప్పుడు 'మనం ఎలుగుబంటిని కుట్టిపెట్టినా గానీ, మనసులో ఉంచుకోకుండా మన బుల్లిని కాపాడింది- ఈ ఎలుగు బంటి ఏదో పాపం మంచిదే!’ అనుకున్నాయి తేనెటీగలు. అవన్నీ ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాయి. తాము సేకరించిన తేనెను ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి. చూస్తూండగానే ఎలుగుబంటి, తేనెటీగలు మంచి స్నేహితులైపోయాయి!