కృష్ణపట్నంలో ఉదయ్, శరత్ అనే స్నేహితులుండేవారు. అన్ని విషయాలలో‌నూ వాళ్ళ భావాలు కలిసేవి; కానీ ఒక్క దేవుడి విషయంలో మాత్రం ఇద్దరి నమ్మకాలూ వేరుగా ఉండేవి.

ఉదయ్‌కి భక్తి ఎక్కువ. శరత్‌కేమో నమ్మకం తక్కువ. ఇద్దరూ చాలాసార్లు దేవుడి గురించి వాదులాడుకున్నారు. ఇద్దరూ ఓటమిని అంగీకరించేవాళ్ళు కారు.

బాగా వాదించుకున్నాక, ఆఖరికి శరత్‌ "ఇదంతా అయ్యేది కాదు- లేని దేవుడిని నువ్వు చూపించనూ లేవు; నేను చూడనూ లేను- ఊరుకో!" అనేవాడు. "సరేలేరా! నువ్వే ఎప్పటికైనా తెలుసుకుంటావులే!" అనేవాడు ఉదయ్.

ఒకసారి విపరీతమైన గాలివాన వచ్చింది. ఊరు మొత్తం జలమయమైంది. లెక్కలేనన్ని ఇళ్ళు, చెట్లూ కూలిపోయినై. అంతలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు: ఊరికి పక్కనే‌ ఉన్న నది పొంగనున్నది- వరదలు వచ్చే ప్రమాదం ఉంది! ఊరి ప్రజలంతా అప్రమత్తులై తేరుకునేలోపల విధి వికటించింది: నది పొంగింది; వరదనీరు ఊళ్లోకి రానే వచ్చింది!

ఊళ్ళో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. అందరితో‌పాటు ఉదయ్, శరత్‌ కూడా. ఇంతలో వెనుకనుండి కొందరు "త్వరగా పరిగెట్టండి, నీళ్ళు వేగంగా వస్తున్నాయి, ఎవరిని వాళ్ళు కాపాడుకోండి" అని అరుస్తూ వాళ్ళని దాటుకొని ముందుకు పరుగు పెట్టారు. వాళ్ళ వెనకనే ఉదయ్, శరత్‌కూడా పరుగుపెట్టారు.

ఇంతలో ఉదయ్ నడుస్తున్నవాడల్లా ఆగి తూర్పువైపుకు తిరిగి నమస్కరిస్తూ, "దేవుడా, మమ్మల్ని కాపాడు స్వామీ!" అని మొరపెట్టుకున్నాడు. అంత ఆయాసంలోనూ శరత్ నవ్వుతూ "ఇదిగో, మనం కొద్ది సేపట్లో ఆ కొండ ప్రదేశాన్ని చేరుకుంటాం. ఎందుకంత కంగారు?‌ ఇప్పుడేమైందని ఇక్కడ ఆగి ప్రార్థనలు మొదలెట్టావు? పద, ముందు పరుగు పెట్టిన వాళ్ళని చేరుకోవాలి మనం కూడా. లేకపోతే ప్రమాదం!” అన్నాడు.

ఉదయ్ ఏదో అనబోతుండగానే అతను "ఇప్పుడు మనం వాదించుకునే‌ సమయం లేదు. త్వరగా‌ పద..." అంటూ అతన్ని ముందుకు నెట్టాడు. అంతలోనే‌ వాళ్ళ వెనకనుండి నీటి ప్రవాహం ఒకటి వేగంగా వచ్చింది. ఉదయ్, శరత్ ఇద్దరూ ఆ నీళ్ళలో పడి తల మునకలయ్యారు. ఉక్కిరిబిక్కిరి అవుతూ‌ కొట్టుకు పోసాగారు. అంతలోనే ఆశ్చర్యంగా వాళ్ల కాళ్ళు ఏవో రాళ్లలో ఇరుక్కున్నాయి. ఇద్దరూ మరో ఆలోచన లేకుండా ఆ రాళ్లను పట్టుకుని పైకి ఎగబ్రాకి, ఆ రాళ్ళ గుట్ట మీద కూర్చున్నారు.

వాళ్లు చూస్తూండగానే నీళ్ళ మట్టం ఇంకా ఇంకా పెరుగుతూ పోయింది. వాళ్ళు ఆ రాళ్ల గుట్ట మీదే ఇంకా ఇంకా పైకి జరుగుతూ పోయారు. చుట్టూ కనుచూపు మేరలో అంతా చెరువులాగా నీళ్లతో నిండిపోయింది! వాళ్ల ముందు పరుగు పెట్టిన జనాల జాడలేదు. ఇద్దరూ అట్లా ఒక రోజంతా కూర్చున్నాక, నీటి మట్టం కొద్దికొద్దిగా తగ్గిపోసాగింది.

"హమ్మయ్య!‌ బ్రతికిపోయాం! అంతా దేవుడి దయ!" అన్నాడు ఉదయ్.

"అదేం లేదు. ఒరేయ్! మన ఊళ్లో నువ్వొక్కడివే కాదు కదా, భక్తుడివి? మరి ఇంతమంది భక్తులుంటే, మరి మీ దేవుడు వాళ్ళందరినీ ఎందుకు రక్షించలేదంటావు?! అంతమంది భక్తుల్ని కాపాడని మీ దేవుడు, ఆయన్ని నమ్మని నన్ను ఎందుకు కాపాడినట్లు?!" అన్నాడు శరత్.

"వాళ్లంతా ఆగి ప్రార్థన చెయ్యలేదు. చేసి ఉంటే ఇంతకు ముందు లేని ఈ రాళ్ల గుట్ట ఏదో వాళ్లకీ దొరికి ఉండేది!" అన్నాడు ఉదయ్.

"అయితే అప్పుడు మనకి ఇక్కడ చోటు సరిపోయేది కాదు!” అన్నాడు శరత్, పంతంగా.

నీళ్ళు తగ్గిన కొద్దీ వాళ్ళు కూర్చున్న రాళ్ళు పొడుగు పొడుగు స్తంభాలలాగా, ఒక దాని మీద ఒకటి ఎగుడుదిగుడుగా పడి ఉన్నట్లు కనిపించసాగాయి. అప్పుడు గానీ శరత్ గమనించలేదు- ఆ రాళ్లన్నీ ఏదో దేవాలయ శిధిలాలు- అవి ఇక్కడికి ఎలా వచ్చాయి?!

అంతలోనే దాన్ని చూసిన ఉదయ్ ఆశ్చర్యంతో "‌ఒరేయ్‌! చూశావా, ఆ దేవుడే‌ భూమిలో ఉండి మనల్ని కాపాడాడు. లేకపోతే‌ మనం కూడా ఈ పాటికి జల సమాధి అయి ఉండేవాళ్లం!" అన్నాడు.

శరత్ మాట్లాడలేదు. అతనికి అర్థం అయింది: “దేవుడు అనే భావన కలిగి ఉన్నవాళ్లు మంచినీ, చెడునూ అన్నిటినీ ఆ భావనకే ఆపాదిస్తారు. వారి విశ్వాసంలోనే ఉన్నాడు దేవుడు. దాన్ని ప్రశ్నించటం వల్ల ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమీ లేదు. నిజంగా విశ్వసించేవాళ్లు తమ విశ్వాసం ఆధారంగా మానసిక స్థిరత్వాన్ని సాధించుకుంటారు. అట్లా వాళ్ల విశ్వాసంలోని దేవుడే వాళ్లకు మేలు చేస్తాడు! మంచికో, చెడుకో- విశ్వాసమే వాళ్లకు ఉన్న సంపద!” అని.

వానా, వరదా అంతా తగ్గిపోయాక, వరదలో బయటపడిన పురాతన శివాలయాన్ని పునరుద్ధరించి పూజలూ, పునస్కారాలూ చేయనారంభించారు ఊరివాళ్ళు. శరత్ ఇప్పటికీ దేవుడిని నమ్మడు- అయితే అతనిప్పుడు ఎవ్వరితోటీ 'దేవుడు లేడు' అని వాదించట్లేదు!