రమేష్ పట్టణంలో వాళ్ళ అమ్మతోపాటు ఉండేవాడు. తను ఎప్పుడూ మురికిగా ఉండటాన్ని ఇష్ట పడేవాడు. తన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునేవాడు కాదు; వాళ్ల అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు!
దాంతో వాడికి చాలా రోగాలు వచ్చేవి. ఎప్పుడూ జలుబు, దగ్గు, జ్వరం ఒకదాని తర్వాత ఒకటి వస్తూండేవి. వాడి చర్మం కూడా బాగా పాడౌతూండేది.
అయినా సరే, వాడు మాత్రం శుభ్రంగా ఉండేవాడు కాదు.
రమేష్‌కు చాలా నచ్చిన ప్రదేశం ఒకటి ఉండేది. అదేంటంటే, మ్యూజియం. ఏ పెద్ద నగరానికి వెళ్ళినా అక్కడి మ్యూజియంకి వెళ్ళటం అంటే చాలా ఇష్టం వాడికి.
వాళ్ళ అమ్మ వాడికి చాలా నగరాల్లో మ్యూజియంలు చూపించింది. అయినా వాడికి 'మళ్ళీ ఇంకో మ్యూజియంకి వెళ్ళాలి- ఇంకో మ్యూజియంకి వెళ్ళాలి' అని ఉండేది ఎప్పుడూ.
రమేష్ వాళ్ల బడిలో విద్యార్థులను మూడు నెలలకు ఒకసారి పిక్నిక్‌కు తీసుకు వెళ్ళేవాళ్ళు. ప్రతిసారీ "మనం మ్యూజియంకి వెళ్దామా?" అంటూనే ఉండేవాడు రమేష్. అయినా పిల్లలకు చాలా మందికి మ్యూజియంకంటే పార్కులే ఎక్కువ తెలుసు. అందుకని అందరూ ఎప్పుడూ పార్కుకే వెళ్దామనేవాళ్ళు.
కానీ ఒకసారి మటుకు రమేష్ మాటని ఒకె చేసారు అంతా! మ్యూజియమ్‌కు వెళ్దామని ఒప్పుకున్నారు! బడి వాళ్ళు కూడా "సరే! ఐతే ఈసారి మ్యూజియంకు వెళ్దాం" అన్నారు.
ఇది తెలిసిన దగ్గర నుండీ మ్యూజియమ్‌కు తీసుకు వెళ్ళే రోజు కోసం ఎదురు చూడసాగాడు రమేష్.
ఆ రోజుకు ఇంకా ఎన్ని రోజులు ఉన్నదో క్యాలండరులో గుర్తులు పెట్టి, రోజులు లెక్క పెట్టడం కూడా మొదలు పెట్టాడు. కానీ, ఏం లాభం?! సరిగ్గా వాళ్ళు మ్యూజియంకి వెళ్ళే ముందు రోజునే వాడికి తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి, విరేచనాలు మొదలైనై!
డాక్టరుగారు రమేష్‌ని పరీక్షించి "నీకు 'అమీబియాసిస్' వచ్చింది. ప్రేగులలో అమీబాలు చేరుకున్నాయి.
పరిశుభ్రంగా లేకపోవటం వల్ల సాధారణంగా ఈ రోగం వస్తుంటుంది.
ఇప్పుడు ఇక కనీసం నాలుగు రోజులైనా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది; చాలా రోజుల పాటు పరిశుభ్రతను పాటించాల్సి వస్తుంది. అట్లా కాకపోతే రోగం మళ్ళీ మళ్ళీ తిరగబడుతుంది కూడా; జాగ్రత్త" అని చెప్పాడు.
ఇంక అప్పుడు రమేష్ 'మ్యూజియం మ్యూజియం' అని ఎంత ఏడ్చినా ఏం లాభం? ఏమీ ప్రయోజనం లేదు!
దాంతో రమేష్‌కి బాగా బుద్ధి వచ్చేసింది. అప్పటి నుండీ చాలా శుభ్రంగా ఉండటం మొదలుపెట్టాడు. తన పరిసరాలను కుడా శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టాడు.
వాడిలోని మార్పుని చూసి వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది. తనే సొంతగా రమేష్‌ను, వాడి బెస్ట్ ఫ్రెండ్స్‌నీ ఒక ఆదివారం నాడు మ్యుజియమ్‌కు కూడా తీసుకు వెళ్ళింది!