అలిస్సా కూర్చొని ఏదో చదువుకుంటోంది. అంతలో వాళ్ల నాన్న పిలిచాడు: "అలిస్సా! అలిస్సా! ఎక్కడున్నావు?" అంటూ. అలిస్సా చటుక్కున లేచి గేటు దగ్గరికి పరుగెత్తింది "వస్తున్నా!" అంటూ.

గేటు ముందు ఆకుపచ్చ కారొకటి ఆగి ఉన్నది. దానిముందు పెద్ద పెద్ద మీసాలవాడు ఒకాయన. అలిస్సా వాళ్ల నాన్న ఆ మీసాలవాడితో‌ ఏదో మాట్లాడుతున్నాడు.

అలిస్సా రాగానే "ఇదిగో, ఇదే అలిస్సా. రోజంతా చదువుతూనే ఉంటుంది!" అన్నాడు నాన్న, నవ్వుతూ. మీసాలవాడు కూడా ఖళపెళా నవ్వాడు.

"అలిస్సా," చెప్పాడు నాన్న- "ఈయన మా ఫ్రెండు. నగరంలో నీకోసం పని చూసి పెట్టాడు. ఊళ్ళో నీకు తగిన పనులు ఉండట్లేదు కదా. అందుకని నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళాలి, ఈయనతో. త్వరగా బట్టలు సర్దుకో మరి" అని. మీసాలవాడు అలిస్సాకేసి చూసి నవ్వాడు. పాన్ తినీ తినీ అతని పళ్ళు ఎర్రగా గార పట్టి ఉన్నాయి. "నీకు ఎంత వయసు?" అడిగాడు అతను.

"పన్నెండేళ్ళు" చెప్పింది అలిస్సా.

మీసాలవాడు మళ్ళీ ఇంకోసారి నవ్వాడు ఖళపెళా. అలిస్సాకి అతనంటే ఎందుకనో ఇష్టం కాలేదు. అతని వెంట వెళ్ళటం అస్సలు నచ్చలేదు. తమ ఊళ్ళోనే బడి ఉంది. ఆ బడికి పోదామని ఉంది అలిస్సాకు. ఆ బడి పరిసరాలంటే ఆ పాపకు చాలా ఇష్టం. చదవటం అంటే తనకు చాలా ఇష్టం ఎలాగూ.

"ఇంక పో మరి. నీ బట్టలూ అవీ సర్దుతోంది చూడు, మీ అమ్మ. నువ్వు వెంటనే బయలుదేరాల్సి ఉంటుంది. పో, తయారవు!" అన్నాడు నాన్న.

మీసాలవాడు జేబులోంచి నోట్ల కట్ట ఒకటి తీసి నాన్నకు ఇచ్చాడు.

నాన్న ముఖం వెలిగిపోయింది ఆ డబ్బుల్ని చూసి. అతను దాన్ని లెక్క పెట్టుకుని, గర్వంగానూ, సంతోషంగానూ నవ్వాడు. ఆ మీసాలవాడు కూడా నవ్వాడు. అలిస్సాకు మటుకు కోపంగాను, భయంగాను అనిపించింది. "నాకు ఇతనితో వెళ్ళాలని లేదు" అని చెబుదామనిపించింది. అయినా నాన్న మాట తను కాదనటానికి లేదు.


అలిస్సా, మీసాలవాడు ఇద్దరూ నగరానికి వచ్చారు. మీసాలవాడు తనని ఎవరింటికో తీసుకెళ్ళి, వాళ్ల కాలింగ్ బెల్ నొక్కాడు. కొద్ది సేపటికి ఆ యింటి యజమాని తలుపు తెరిచి చూసాడు.

మీసాలవాడు అతనికి గుడ్మార్నింగ్ చెప్పాడు. ఇద్దరూ కొద్ది సేపు ఏవో మాట్లాడుకున్నారు. అలిస్సా ఇద్దరినీ చూస్తూ నిలబడింది. ఆ ఇంటి యజమాని సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. అలిస్సాను వాళ్ల ఇంటిలోపలికి తీసుకెళ్ళి, మెట్ల క్రింద త్రిభుజంలాగా ఉన్న గది చూపించాడు: "ఇదిగో- ఇదే, నీ గది!" అని చెప్పాడు.

అలిస్సా ఆ గదిలోకి వెళ్ళి చూసుకున్నది. చిన్నగా, చీకటిగా ఉంది ఆ గది. ఎత్తుగా నిలబడితే పైనున్న మెట్లకు కొట్టుకుంటుంది తల! ఆ పాప బయటికి తొంగి చూసే సరికి మీసాలవాడు వెళ్ళిపోతున్నాడు!

మరునాడు తెల్లవారు జామున యజమాని వచ్చి నిద్రలేపాడు అలిస్సాని. "ఇదిగో, ఈ పాపే, నిన్న నేను చెప్పిన- అలిస్సా. ఈ పాపకు ఎప్పుడూ చదువుతూ ఉండటం అంటే ఇష్టం" అంటూ పరిచయం చేసాడు ఇంటావిడకు. వెంటనే ఇద్దరూ నవ్వారు గట్టిగా.

అకస్మాత్తుగా ఆ ఇంటావిడ అలిస్సా ముఖంలో‌ ముఖం‌ పెట్టి అరిచింది: "నువ్విక్కడ చదువుకోబోవట్లేదు! అర్థ-మైందా? నువ్వు ఇక్కడంతా కసువు ఊడుస్తావు, గిన్నెలు తోముతావు, బట్టలు ఉతుకుతావు! కూర్చోబెట్టి చదివించేందుకు కాదు, నిన్ను పిలిపించుకున్నది! ఊరికే ఉంచుకొని తిండి పెట్టేందుకు ఇది ధర్మసత్రం కాదు! నువ్వు ఈ ఇల్లు మొత్తాన్నీ శుభ్రంగా ఉంచాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి!" అని.

ఆ రోజు నుండీ ప్రతిరోజూ ఆమె అలిస్సామీద అరుస్తూనే ఉంది. రోజుకు పదిహేను గంటలు పనిచేసేది అలిస్సా. పదిహేను గంటల్లో పది గంటలు తిట్లు తింటూనే ఉండేది. తనకి ఏమాత్రం సంతోషం లేదిక్కడ. పని ఐపోయి తన 'గది'లోకి వచ్చాక, రోజూ ఒకటే ఏడ్చేది.

ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున యజమాని చెప్పాడు: "బట్టలు సర్దుకో. నువ్వు మాకు ఇంక అవసరం లేదు. యజమానమ్మకు నువ్వు నచ్చటంలేదు" అని.

ఆ రోజున యజమాని అలిస్సాను నగరంలో‌ ఉన్న ఓ బట్టల దుకాణానికి తీసుకెళ్ళాడు. దుకాణపు వోనరు- చాలా దుబ్బగా ఉంది- అలిస్సాని నొక్కి నొక్కి చూసాక, తన బీరువాలోంచి నోట్ల కట్ట ఒకటి తీసి ఇచ్చింది యజమానికి. యజమాని ఇక అలిస్సా కేసి చూడను కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు.


అలిస్సాతో పాటు పనిచేసే పిల్లలు ఆ దుకాణంలో ఇంకో ఐదుగురు ఉండేవాళ్ళు. వాళ్లంతా దుకాణాన్ని ఆనుకునే ఉన్న ఓ చిన్న, చీకటి గదిలో నివసించేవాళ్ళు; అక్కడే బట్టలు కుట్టేవాళ్లు. తెల్లవారి దుకాణం తెరిచినప్పటినుండి, రాత్రి తలుపులు మూసేసే వరకూ తెరిపి లేకుండా పని చేసేవాళ్ళు అందరూ. మధ్యాహ్నం భోజనం తర్వాత వాళ్లకు ఒక పది నిముషాలు ఖాళీ దొరికేది. అంతే. రాత్రి అయ్యాక ఆ గదిలోనే నేలమీద పడుకొని ఎవరికివాళ్ళు నిద్రపోయేవాళ్ళు.

లావుపాటి ఆవిడ ప్రతి నెలా వాళ్లకు కొంత డబ్బు ఇచ్చేది. మిగిలిన పిల్లలు ఆ డబ్బుతో బట్టలు, సబ్బులు కొనుక్కునేవాళ్ళు. అలిస్సా మాత్రం ప్రతినెలా ఒక పుస్తకం కొనుక్కునేది. మధ్యాహ్న భోజనం తర్వాత ఖాళీలో ఆమె తన పుస్తకం చదువుకునేది. ఒకసారి యజమానురాలు అది చూసి చాలా ఆశ్చర్యపోయింది. తన దగ్గర పని చేసే పిల్లలెవ్వరికీ చదువు రాదు! "నీకు చదవటం వచ్చా? అంకెలు లెక్కపెట్టటం?" అని అడిగింది.

"వచ్చు" అని చెప్పింది అలిస్సా.

"అయితే రా, మరి. నువ్వు ఇకనుండి మన దుకాణంలో పని చేస్తావు" అని దుకాణంలోకి పిల్చుకుపోయిందామె, అలిస్సాని.


అలిస్సాకి దుకాణంలో పని చేయటం నచ్చింది. దుకాణం పెద్దగా ఉంటుంది. గాలీ వెలుతురూ బాగా వస్తాయి. డబ్బున్న ఆడవాళ్ళు చాలామంది దుకాణానికి వస్తూంటారు. ఖరీదైన బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళకు కోరిన బట్టలు చూపించటం అలిస్సా పని. వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా నవ్వటం, వాళ్ళతో చక్కగా మాట్లాడి మరింత ఖరీదైన బట్టలు కొనిపించటం అలిస్సాకు సులభంగానే వచ్చాయి.

పొడుగ్గా, నాజూకుగా ఉండే ఆవిడ ఒకావిడ తరచు వస్తుండేది వాళ్ల దుకాణానికి. ఒకటి రెండుసార్లు చూసేసరికి, ఆమెకు ఎలాంటి బట్టలు నచ్చుతాయో అలిస్సాకు అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత ఆమె ఎప్పుడు దుకాణానికి వచ్చినా ఆమెకు నచ్చే బట్టల్ని నేరుగా తీసుకొచ్చి చూపించటం మొదలు పెట్టింది. అట్లా ఆవిడ అలిస్సాని గుర్తించటం జరిగింది.

ఒకరోజున ఆ పొడుగావిడ వెళ్తూ వెళ్తూ తన పర్సును దుకాణంలోనే మర్చిపోయింది. బట్టలు సర్దుతూన్న అలిస్సా దాన్ని చూడగానే గుర్తు పట్టి, "మేడం! మీ పర్సు!" అని అరుస్తూ రోడ్డు మీదికి పరుగెత్తింది.

"ఇదిగో మేడం! దుకాణంలో మీ పర్సును మర్చిపోయారు!" అని దాన్ని ఆమెకు అందించింది.

"ఓ! నిజమే. ధాంక్యూ!" అని ఆమె పర్సును అందుకొని, ఆ పర్సులోంచి కొన్ని డబ్బులు తీసి అలిస్సాకు ఇవ్వబోయింది.
అయితే ఆ సరికే అలిస్సా దుకాణం చేరుకున్నది. దుకాణంలోకి అడుగు పెట్టగానే యజమానురాలు ఆమెను నిలబెట్టి అరిచింది: "ఇంకెప్పుడూ దుకాణం విడిచిపెట్టి బయటికి అడుగు పెట్టకు, చెబుతున్నాను! నేను నీకోసం చాలా డబ్బులు వెచ్చిస్తున్నాను- ఇంతింత జీతం ఇస్తున్నాను. ఇంత ఖర్చు పెట్టేది నువ్వు పనిచేస్తావని. అంతేగాని ఊరికే రోడ్లమీద పరుగెత్తుతావని కాదు!"

అలిస్సాకు చాలా కోపం వచ్చింది.

"నువ్వు నాకు చాలా డబ్బులు ఇస్తున్నావా?! ఎక్కడిచ్చావు?! నన్నిక్కడ బానిసలాగా ఉంచుకున్నావు!" అని అరిచింది. "కృతజ్ఞత లేని పిల్లా! నేను నీకు ఏమేం చేసానో అన్నీ మర్చిపోయావా? నేను నీకు పడుకునే చోటు చూపించాను, తినేందుకు తిండి పెట్టాను, చేతికి డబ్బులు ఇచ్చాను. ఇంకా ఏం కావాలి నీకు? ఆశకి అంతు ఉండద్దా?" అరిచింది యజమానురాలు.

"అవును! కావాలి! నాకు పూర్తి జీతం డబ్బులు కావాలి! నేను బడికి పోవాలి!" ఏడుస్తూనే అరిచింది అలిస్సా.

అంతలోనే "ఆగండి!" అన్నదో గొంతు. చూస్తే అది ఆ పొడుగాటి మేడం.

"అలిస్సా కృతజ్ఞత లేని పిల్ల కాదు" దుకాణపు యజమానురాలికి చెప్పింది ఆ మేడం. "ఈమె చాలా నిజాయితీ గల పిల్ల" అని.

వెంటనే అలిస్సా వైపుకు తిరిగి "నీకు ఇక్కడ పని చేస్తుంటే సంతోషంగా లేదా?" అన్నది.

"నేను బడికి పోతాను. చదువుకుంటాను" అనేసింది అలిస్సా, ఏడుస్తూ.

ఆవిడ ముందుకొచ్చి అలిస్సా భుజం మీద చేయివేసి, దుకాణపు యజమానితో చెప్పింది గట్టిగా- "క్షమించండి. ఇకమీద అలిస్సా మీ దుకాణంలో పని చెయ్యదు. మా ఇంట్లో ఉంటుంది, నాతో పాటు. మా ఇంట్లో ఉంటూ, రోజూ బడికి పోయి చక్కగా చదువుకుంటుంది" అని.

"అది జరగాలంటే మీరు నాకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది!" అరిచింది దుకాణపు యజమాని.

"లేదు. ఏమీ ఇచ్చేది లేదు. అలిస్సా బానిస కాదు. తనకీ కొన్ని హక్కులు ఉన్నాయి" ప్రశాంతంగా చెప్పింది మేడం. "నీ వస్తువులన్నీ‌ తీసుకో, అలిస్సా. మనం‌ మన ఇంటికి వెళ్దాం. ఇక వీళ్లెవరూ నిన్నేమీ చెయ్యలేరు. రేపే నువ్వు బడిలో చేరతావు" అన్నది అలిస్సాతో.


అలిస్సా బడిలో చేరింది. చాలా పట్టుదలతోటి చదివింది. కాలేజీకి, అటుపైన విశ్వవిద్యాలయానికీ వెళ్ళింది. సామాజిక కార్యకర్త అయి, తను కూడా అనేకమంది పిల్లల జీవితాల్లోకి వెలుగు తెచ్చింది.