1947, ఆగస్టు 15. ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అటు కలకత్తాలో హిందూ ముస్లిం ఆల్లర్లు జరుగుతున్నాయి.

'ఇదేమి స్వాతంత్ర్యం?! నాకు ఇట్లాంటి స్వాతంత్ర్యపు వేడుకలు అక్కర్లేదు' అనుకున్నాడు గాంధీజీ. పోయి కలకత్తాలో బస చేశాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకే దుండగుల గుంపు ఒకటి గాంధీ మీదికి దాడి చేసింది. గాంధీ‌ ఉన్న ఇంటి తలుపులు, కిటికీలు, ఇంట్లోని కుర్చీలు, సోఫాలు- అన్నీ ధ్వంసం చేసింది. గాంధీ మీదికి ఇటుకలు విసిరింది. అంత ప్రాణాపాయ స్థితిలో కూడాను, గుంపులోని వాళ్లందరితోటీ మాట్లాడాడు గాంధీజీ. చివరికి అందరినీ శాంతపరచి వెనక్కి పంపించాడు!

"కలకత్తాలో ముస్లిములందరూ తూర్పు పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోవాలి!" అని హిందువుల డిమాండు. "మేం ఇక్కడే ఉంటాం-మీకు నచ్చకపోతే మీరే వెళ్ళిపోండి!" అని ముస్లిములు. ఇద్దరిలోనూ విద్వేషాగ్నులే.

బెంగాల్ ప్రజల్లో ఆ విధంగా ఎగసి పడుతున్న వైషమ్యాల మంటలు గాంధీజీకి చాలా బాధ కలిగిస్తున్నాయి. "ఇందుకేనా, మనం అందరం కలిసి బ్రిటిష్ వారితో పోరాడింది? ఇట్లా కొట్టుకునేందుకేనా? కలిసి ప్రశాంతంగా ఉండలేమా? తప్పులెన్నుకుంటూ అరాచకత్వానికి తెర తీసేందుకేనా, మనం స్వరాజ్య సమరం నెరపింది?" అని నిరాశా భరిత ఆలోచనలు.

"బెంగాల్లో ఇల్లిల్లూ తిరిగి చెప్పాలని ఉంది: 'ఈ వైషమ్యాలను వదిలేయండి. మళ్ళీ ఒకసారి కలిసి జీవించండి!' అని. కానీ ఇప్పుడది నావల్ల కావట్లేదు. ముసలివాడిని అయ్యాను. మనకు స్వతహాగా శక్తి లేనప్పుడు, శక్తి ప్రదాత అయిన భగవంతుడిని ప్రార్థించాలి. ఉపవాసం ద్వారా ఆ భగవంతుడిని సేవిస్తాను. విషమ పరిస్థితి తొలిగేంతవరకూ నేను నీళ్లు, సోడా, నిమ్మరసం‌ తప్ప మరేమీ స్వీకరించను" అంటూ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు గాంధీజీ.

ఆ సమయానికి రాజాజీ బెంగాల్‌కు గవర్నర్‌గా ఉన్నారు. "గొడవలు ఎట్లాగైనా సద్దు మణుగుతాయి. గాంధీజీ నిరాహార దీక్ష చేయడం అనవసరం" అని ఆయన అభిప్రాయం. ఎలాగైనా‌సరే గాంధీతో నిరాహార దీక్ష మాన్పించాలని పట్టుదలగా వచ్చాడాయన.

తను నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడో చెప్పుకొచ్చాడు గాంధీ; అది ఎందుకు అవసరంలేదో చెప్పుకొచ్చాడు రాజాజీ. ఒకరి మాట ఒకరు వినే అవకాశం ఇద్దరికీ లేదు.

చివరికి రాజాజీకి చికాకు వేసింది. "నిరాహార దీక్ష అంటున్నావ్; ఇంక మళ్లీ ఆ నిమ్మరసం మాత్రం ఎందుకు?!" అనేసాడు.

గాంధీ ప్రశాంతంగా తన సెక్రెటరీ నిర్మల్ బాబు వైపు చూసాడు. "నా‌ ప్రకటనని సరి చూసానన్నావు; మరి అప్పుడు నీకు ఈ విషయమే తట్టలేదా?! ఈ రాజాజీగారికి నేను చాలా‌ కాలంగా పరిచయం కాబట్టి, ఆయన గుర్తుపట్టగలిగారు, నా శరీరం ఇంకా ఎంత గట్టిగా ఉందో! అసలు ఆ నిమ్మరసం మటుకు నాకెందుకు? అది కూడా అక్కర్లేదు. నేనిప్పుడు కేవలం సోడా, నీళ్ళు మాత్రమే త్రాగుతూ నిరాహార దీక్ష చేస్తాను!" అంటూ తను స్వీకరించే పదార్థాల లిస్టులోంచి నిమ్మరసాన్ని కూడా కొట్టివేసాడాయన!

"అరే!‌ పుణ్యానికి పోతే పాపం ఎదురైందే! ఏం చేస్తాం?!" అనుకొని ఊరికే పోయాడు రాజాజీ.

మరో వారానికి బెంగాల్ లో గొడవలు కాస్తంత సద్దు మణిగాయి.

గాంధీ మొండితనం, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, తను నమ్మిన సత్య మార్గం నుండి చలించని స్థైర్యం, స్వీయ ప్రవర్తనలో నిజాయితీ, సామాన్యుల పట్ల ప్రేమ, ఇవన్నీ ఆయన్ని ప్రజలకు దగ్గర చేసాయి.

సమస్యల్లా సామాజికమైన సమస్యలకు పరిష్కారాలను ఆయన తన వ్యక్తిత్వం ద్వారా కనుగొనేందుకు ప్రయత్నించటం. ఆ క్రమంలో గాంధీజీ అనేకసార్లు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నాడు. "హిందువులు, ముస్లిములు, ఇతర మతాల వాళ్ళు అందరూ కలిసే ఉండాలి, పరస్పర నిందలు వద్దు" అనే ఆయన కడదాకా నమ్మాడు. చివరికి 1948వ సంవత్సరం జనవరి 30న, "నువ్వు మన దేశానికి హిందూ రాజ్యాంగం రాకుండా అడ్డుకుంటున్నావు. ముస్లిములను వెనక వేసుకొస్తున్నావు" అంటూ మతవాది గాడ్సే ఆయన్ని తుపాకీతో కాల్చేసాడు.

మత సహనానికి ప్రతీక గాంధీజీ. మనకు ఎన్ని అసౌకర్యాలు ఎదురైనా సరే, వాటినన్నింటినీ పరిష్కరించుకుంటూ, అందరం శాంతి సామరస్యాలతో కలిసి జీవించటం; భిన్నత్వంలో‌ ఏకత్వాన్ని నిలుపుకోవటమే ఆయన స్మృతికి మనం‌ ఇచ్చే అసలైన నివాళి.

నూతన సంవత్సరంలో మనం అందరం సుఖశాంతులతో, పరస్పర ప్రేమాభిమానాలతో వర్ధిల్లుతామని ఆశిస్తూ,

కొత్తపల్లి బృందం