అందమైన గులాబీపూవుకు కూడా చుట్టూ గుచ్చుకునే ముళ్ళుంటాయి. అందంగా కనిపించే మన ఈ ప్రపంచానికీ అంతే- దీనికి ఇంకో వైపున పేదరికం, సంఘర్షణలు ఉన్నాయి. వాటిని తప్పించి చూస్తే మళ్ళీ అందమైన ప్రపంచం కనిపిస్తుంది.
అనగనగా ఒక చిన్న ఊరుండేది. దాని పేరు బంగారుపాల్యం. పైకి చూస్తే ఆ ఊళ్లో అందరూ బాగున్నట్లే కనిపిస్తుంది. కానీ దగ్గరగా చూస్తేనే, కొన్ని కుటుంబాల వ్యథలు కనబడేది.
ఓ కుటుంబంలో దంపతులు రంగమ్మ, రంగయ్య; వాళ్లకు ఇద్దరు పిల్లలు ప్రియ, రమేష్ ఉండేవాళ్ళు. దంపతులిద్దరూ కూరగాయలు పండించేవాళ్ళు. రంగయ్య వాటిని పట్నం తీసుకెళ్ళి అమ్ముకొచ్చేవాడు.
రంగమ్మ ఒకవైపున పొలం పనులు, ఇంటి పనులు చేస్తూనే, మరోవైపున రకరకాల పచ్చళ్లు తయారుచేసేది. భర్త వాటిని తీసుకెళ్ళి అమ్మేవాడు. అట్లా నాలుగు చేతులూ కష్టపడితే, వాళ్ళ కుటుంబం పడుతూ లేస్తూ నడిచేది.
రమేష్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. "మీవాడు చాలా బాగా చదువుతాడు. నీట్ పరీక్ష రాయించండి. డాక్టరు అవుతాడు" అని కాలేజీవాళ్ళు రంగయ్యకు చెబుతున్నారు. కానీ పరీక్షకు అవసరమయ్యేన్ని డబ్బులు కూడా లేవు రంగయ్య దగ్గర- ఇక మెడిసిన్ చదివించేన్ని డబ్బులు ఎక్కడినుండి వస్తాయి? అయినా పిల్లవాడి ముచ్చట తీర్చాలని, డబ్బులు అప్పు తెచ్చి పరీక్షలు రాయించాడు రమేష్ చేత. రమేష్ కు మంచి ర్యాంకే వచ్చింది!
కొడుకును మెడికల్ కాలేజీలో చేర్చాలంటే నాలుగు లక్షల రూపాయలు కావాలి. "బ్యాంకు నుండి అప్పు ఇస్తారు- మళ్ళీ మీ వాడు కట్టుకుంటాడు. ఎంతో కష్టపడితే తప్ప మెడిసిన్‌లో సీటు రాదు. ఊరికే పిల్లవాడి బ్రతుకు ఎందుకు నాశనం చేస్తావు? అప్పు తీసేసుకో!" అని తెలిసినవాళ్ళు ప్రోత్సహించారు.
"అప్పు తీసుకున్నా కూడా ఇంకా చాలా డబ్బులే అవసరమౌతాయి చేతి మీదినుండి. మనకు అంత ఎక్కడుంది?" పెదవి విరిచింది రంగమ్మ.
"ప్రియని చదువు మాన్పిద్దాములే. కొంచెం ఆ పాప సంపాదనా ఉంటుంది, మిగిలే ఆ కాసిని డబ్బులతో వీడి ఖర్చులూ తీరతాయి. వాడు పెద్దయ్యాక, ఎవరో దీనికి తగిన మొద్దుని తెచ్చి పెళ్ళి చెయ్యకపోడు- ఆ మాత్రం బాధ్యత ఉన్నవాడేలే" అన్నాడు రంగయ్య. రంగమ్మ కూడా సరేనన్నది.
దాంతో రమేష్ మెడికల్ కాలేజీలో చేరాడు; కానీ పాపం, ప్రియ చదువులు అటకెక్కాయి.
ఇప్పుడు ఇంక ప్రియ బడికి వెళ్ళటం లేదు కదా! అందుకని తను ఇంట్లో అమ్మ సహాయం చేసేది; తమ పొలంలో పని చేసేది; వేరేవాళ్ల పొలాల్లో కూడా కూలికి పోయేది. ఒక్కోసారి ఏ పనీ దొరకనప్పుడు, తన వయసు పిల్లలతో ఆడుకునేందుకు పోయేది. ఒక ఆదివారం నాడు అట్లా ఊళ్ళో పిల్లలందరూ ఊరి అవతల ఉన్న వాగు దగ్గరికి వెళ్ళారు.
ఒక్కరొక్కరుగా అందరూ స్నానానికి దిగారు. ప్రియ మాత్రం అందరినీ చూస్తూ గట్టు మీదనే ఉండిపోయింది.
వాగులోకి దిగిన పిల్లలు నీళ్ళలో ఆటలు మొదలుపెట్టారు. కొందరు ఈత పందాలు వేసుకున్నారు. వాళ్లలో గీత అనే అమ్మాయికి ఉత్సాహం ఎక్కువైంది. ఆ పాప ఊరి పెద్ద రంగారావుగారి కూతురు. "మీలో ఎవరైనా ఇక్కడ వాగును దాటుకొని, అవతలి ఒడ్డు మీదుగా వంద అడుగులు నడిచి, ఇంకా అవతల ఉన్న జలపాతంలో చిక్కుకోకుండా ఇవతలికి రాగలరా?!" అని పందెం వేసింది.
జలపాతం అంటే అక్కడ అందరికీ భయం. "మావల్ల కాదు" అంటే "మా వల్ల కాదు" అన్నారు అందరూ.
కానీ గీతకు అభిమానం అడ్డొచ్చింది- "నేను వెళ్ళి రాగలను!" అనేసింది.
అందరూ ఒద్దంటే ఒద్దన్నారు. వాళ్ళు ఒద్దన్న కొద్దీ గీతకు పట్టుదల హెచ్చింది. "లేదు- మీరంతా పిరికివాళ్ళు! నేను పోయి వస్తాను; మీరంతా ఇక్కడే కూర్చొని గాజులు తొడుక్కోండి" అంటూ అవతలి ఒడ్డుకు ఈదిపోయింది.
ఒడ్డున కూర్చున్న ప్రియలో ఆందోళన ఎక్కువైంది; కానీ డబ్బున్న వారి పాప నిర్ణయం; ఈ పేద పాప ఏం కాదనగలదు?! అందరూ వాగులోంచి బయటికి వచ్చి చూడటం మొదలు పెట్టారు. గీత మళ్ళీ వాగులోకి దూకింది. తీరా వాగు మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా నీళ్ళ వేగం ఎక్కువైంది. ఎదురు ఈదేందుకు తన శక్తి చాలలేదు. కొట్టుకుపోతూ నిస్సహాయంగా అరవటం మొదలు పెట్టింది.
ఒడ్డున ఉన్న పిల్లలంతా గగ్గోలుగా అరిచారు. కానీ ఎవ్వరూ తెగించి నీళ్లలోకి దిగేందుకు గానీ, గీతను కాపాడేందుకుగానీ సాహసించలేదు.
ఇంకా కొద్ది సేపట్లో జలపాతంలో పడిపోతుందనగా అకస్మాత్తుగా గీతను ఎవరో పట్టుకొని ఇవతలికి లాగారు. ఆ సరికి గీత నీళ్ళు మ్రింగి మునకలు వేస్తున్నది. గీతను పట్టుకొని, వాళ్లెవరో బలంగా ఈదుతూ ఒడ్డు చేరారు! చూస్తే అలా కాపాడినవాళ్ళు వేరెవరో కాదు- ప్రియనే! ఒడ్డున కూర్చున్న ప్రియ నీళ్ళలోకి ఎప్పుడు దిగింది, ఎప్పుడు గీతను చేరింది, ఎలా కాపాడింది ఎవ్వరికీ అర్థం కాలేదు!
ఆ రోజున ఊళ్ళోవాళ్లంతా ప్రియకు బ్రహ్మ రథం పట్టారు.
"నువ్వు లేకపోతే ఈ రోజున మా పాప మాకు దక్కేది కాదు! నీకు ఏమిచ్చినా ఈ రుణం తీరదు. చెప్పు- నీకు అన్నింటిలోకీ ఏది ఇష్టం?" అడిగాడు ఊరి పెద్ద.
"నాకు చదువుకోవటం అంటే ఇష్టం. బడికి వెళ్లటం అంటే ఇష్టం" అంది ప్రియ.
"చాలా మంచిది! నువ్వు ఎంతవరకూ చదివితే అంతవరకూ నేను చదివిస్తాను! నీ చదువులు ఇక పూర్తిగా నాదే, బాధ్యత!" అన్నాడు ఊరిపెద్ద.
అట్లా ప్రియ చదువులు మళ్ళీ మొదలయ్యాయి.
కొన్నేళ్ళకు, ప్రియ కాలేజికి వచ్చేసరికి- రమేష్ డాక్టరయి తిరిగి వచ్చాడు!
ఇక అటుపైన వాళ్ల కుటుంబం స్థిరత్వపు బాటలో పయనించటం మొదలు పెట్టింది!
రంగమ్మ, రంగయ్యల కష్టాలు తీరాయి! మంచి రోజులు వచ్చాయి!