చిలిపి ప్రశ్నలు - తిక్క జవాబులు

  1. తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
    జవాబు:‌ భూమ్మీద!

  2. చలి కాలంలో ఐస్క్రీం తింటే ఏమౌతుంది?‌
    జవాబు: కప్పు ఖాళీ అవుతుంది!

  3. రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
    జవాబు:‌ చేతులతో!

  4. గుడికి వెళ్ళినప్పుడు, బొట్టు దేనికి పెట్టుకుంటారు?
    జవాబు: నుదుటికి!

  5. బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
    జవాబు: పట్టినంత మంది!

  6. ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు? జవాబు: ఒలుచుకుని!

  7. కొబ్బరికాయని పగలుకొట్టకుండా ఎలా తినగలం? జవాబు: రాత్రి కొట్టి తినవచ్చు!

  8. హుస్సేన్ సాగర్ లో‌ బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు? జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు!

  9. నిద్రలో మంచం మీదనుంచి కిందపడితే ఏమౌతుంది? జవాబు: మెలకువ వస్తుంది!

  10. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లు ఎందుకు పెడతారు? జవాబు: డ్రైవర్ని నిద్ర లేపడానికి!

సేకరణ: బి. అశోక్, చెన్నేకొత్తపల్లి.

జోకులు

తెలివి నా సొత్తు!
సుబ్బారావు: బావా! రాత్రి పూట నీ మొబైల్‌ ఛార్జింగ్‌కి పెట్టి పడుకోవద్దు.
వెంగళ్రావు: ఎందుకు రా..?
సుబ్బారావు: సెల్‌ ఫోన్‌ బ్యాటరీ బ్లాస్ట్‌ అవ్వచ్చు.. జాగ్రత్త!
వెంగళ్రావు: ఓరి వెర్రిముఖమా! అందుకేరా, నేను బ్యాటరీ తీసేసి ఛార్జింగ్‌ పెట్టుకునేది!

కొత్త ఐడియా!
రైల్వే వాళ్ళు ఒకసారి పొరపాటున వెంగళప్పను ఇంటర్వ్యూకి పిలిచారు.
బోర్డ్ మెంబరు: రైలు ప్రమాదాలు ఆపటానికి నువ్వు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటావు?
వెంగళప్ప: మొట్టమొదట, అన్ని రైలు పట్టాలకూ స్పీడు బ్రేకర్లు పెట్టిస్తా సర్!!

పొడుపు కథలు:
1. జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మా !
2. ఒకటే తొట్టి,రెండు పిల్లలు?
3. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు?
4. నల్లకుక్కకు నాలుగు చెవులు?
5. చింపురు చింపురు గుడ్డలు, ముత్యాలాంటి బిడ్డలు!
6. తన్ను తానే మింగి, మాయమౌతుంది !
7. చూస్తే చూసింది గానీ కళ్ళు లేవు! నవ్వితే నవ్వింది గాని పళ్లు, నోరు లేవు! తంతే తన్నింది గాని కాళ్ళు లేవు!
8. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది!
9. తోలుతోచేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు!

పొడుపు కథలకు జవాబులు: 1. నీడ
2. వేరుశనగ
3. ఉల్లిగడ్డ
4. లవంగం
5. మొక్కజొన్న కంకి
6. మైనపు వత్తి
7. అద్దం
8. నీడ
9. మద్దెల

పద్యాలు

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక, తానొవ్వక,
తప్పించుక తిరుగువాడె ధన్యుడు సుమతీ!

భావం: ఓ మంచిమనస్సు గలవాడా! విను! ఎప్పటికి ఏది అవసరమో, అప్పుడు అంతవరకే మాట్లాడి, ఇతరుల మనసులు నొప్పించకుండా, తనూ బాధపడకుండా, తప్పించుకు తిరిగేవాడే ధన్యుడు!

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహనమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్
వడి గల ఎద్దుక గట్టుక
మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ!

కోకిలమ్మ చేసికొన్న పుణ్యంబేమి?
కాకి చేసికొన్న కర్మమేమి?
మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు
లలిత సుగుణజాల! తెలుగు బాల!

నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు
దీనులందు దేవదేవుడుండు
మానవార్చనంబె మాధవార్చనమురా
లలిత సుగుణ జాల! తెలుగుబాల!

సుభాషితాలు

  1. విద్య యొక్క లక్ష్యం పరీక్ష కాదు, పరివర్తన!
  2. మంచి పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం వంటిది!
  3. విద్యాలయాలు దేవాలయాలకంటే గొప్పవి!
  4. చినిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో!
  5. భుజబలం కన్నా బుద్ధి బలం మిన్న!
  6. అసూయ లేనివాడు అందరికన్నా ఉత్తముడు!
  7. సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు!
  8. నీతి లేని వాడు జాతికి కీడు!
  9. బలమే జీవితం.. బలహీనతే మరణం!
    సేకరణ: కురుబ హరీష్, 6వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోగిర, అనంతపురం జిల్లా