ఒక ఊళ్లో రైస్‌మిల్లు ఒకటి ఉండేది.
ఆ ప్రాంతాల్లోనే ఒక పిచ్చుకల జంట ఉండేది. రైస్‌మిల్లు బయటివైపున చూరులో గూడు చేసుకున్నాయవి. తినేందుకు అక్కడ వాటికి లెక్కలేనన్ని బియ్యపు గింజలు, పురుగులూ దొరికేవి. అయినా అదేంటో గానీ అంత సంపద ఉన్నా, ఆ ఊళ్ళో మరొక పిచ్చుకల జంట అంటూ లేదు!
ఒకసారి ఆడ పిచ్చుక రెండంటే రెండే గుడ్లని పెట్టింది. వాటిని చాలా జాగ్రత్తగా పొదిగింది.
కొన్ని రోజుల తరువాత వాటిలోంచి రెండు చిట్టి చిట్టి పిచ్చుక పిల్లలు బయటకు వచ్చాయి. పెద్ద పిచ్చుకలు రెండూ పిల్లలకు సరిపోయేంత లేత పురుగులను పట్టుకొచ్చి తినిపించాయి.
కొంచెం కొంచెంగా అవి పెద్దయ్యాయి. గూడులోంచి బయటికి వచ్చి, దగ్గర్లోని కొమ్మమీద కూర్చునే దశకు వచ్చాయి. ఒక రోజున పెద్ద పిచ్చుకలు రెండూ ఆహారం కోసం వెళ్ళినప్పుడు, చిన్న పిచ్చుకలు రెండూ కొమ్మ మీదికి వెళ్ళి మాట్లాడుకుంటున్నాయి:
ఒక పిచ్చుక పిల్ల అన్నది: మనకు ఆడుకునేందుకు వేరే స్నేహితులు ఎవ్వరూ దొరకడం లేదు
రెండో పిచ్చుక పిల్ల: అవునే! నేను ఇంతకాలమూ గమనించనే లేదు! మనం తప్పిస్తే ఈ ఊళ్ళో వేరే పిచ్చుక పిల్లలే లేవు!
మొదటి పిచ్చుక పిల్ల: ఎందుకు? మనలాంటి పిచ్చుకలకు ఏమైంది? ఇంత చక్కని ఊళ్ళో పిచ్చుకలే లేకుండా ఎట్లా అయ్యింది?
రెండో పిచ్చుక పిల్ల: ఏమో, తెలీదు- నిన్న వాళ్ళెవరో చెప్పుకుంటుంటే విన్నాను- మన జాతి పక్షులు అంతరించి పోతున్నాయట. ఎందుకనో మరి, అర్థం కాలేదు.
మొదటి పిచ్చుక పిల్ల: ఇందులో అర్థం కానిదేమున్నది? కాలుష్యం వల్ల! కాలుష్యం వల్లనే మన జాతి అంతరించి పోయింది.
రెండో పిల్ల: కాలుష్యం అంటే ఏంటి? ఇక్కడ రైస్‌మిల్లులో చెత్త, చెదారం ఏమీ ఉండవు. పెద్దగా పొగకూడా లేదు! ఊళ్ళో వాహనాలు కూడా ఏమన్ని లేవు కదా, మరి ఇంక ఈ కాలుష్యం ఎక్కడినుండి వస్తున్నది?
మొదటి పిల్ల: నేనూ మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది. నేను మాట్లాడకుండా ఊరికే ఉన్నాననుకో. అప్పుడు కూడా నీకు ఏమైనా శబ్దం వినిపిస్తుందా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు?
రెండో పిల్ల: అవును. ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి కదా, "కుయ్.. కుయ్య్....కీచ్..కీచ్" అని గాలిలోంచే వస్తుంటాయి శబ్దాలు!
మొదటి పిల్ల: అదే, కాలుష్యం. ఇదివరకు ఈ శబ్దాలు ఉండేవి కావట. మనుషులు "సెల్‌ఫోనులు" అని ఏవో కనుక్కున్నారట. వాటికోసం పెద్ద పెద్ద టవర్లు కట్టారట.
ఆ టవర్లలోంచి ఇదిగో, ఇట్లాంటి శబ్దాలు వస్తాయి. అవి మనుషులకు వినపడవట; కానీ మనకు వినిపిస్తాయి! కొద్ది రోజులకి ఆ శబ్దాలకు తట్టుకోలేక మనవాళ్లంతా అవి వినపడని చోట్లకు పారిపోయారట. మన బంధువులంతా ఆ రకంగా అడవుల్లోకి చేరుకున్నారు. అందుకనే ఇక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు మనకు!
రెండో పిల్ల: అయ్యో! మరి ఈ సంగతి తెలీదా, మనుషులకు?
మొదటి పిల్ల: పాపం, వాళ్లకీ బాగా తెలీదు. వాళ్లకి వినపడవు కదా, ఈ శబ్దాలు! అందుకని అవి మనకీ వినిపించవనుకుంటారు. ఎవరైనా వాళ్లకి ఈ సంగతి చెబితే బాగుండు!
రెండో పిల్ల: భూమి మీద మనలాంటి పక్షులు కూడా బ్రతకాలంటే, వాళ్లు వాళ్ల పద్ధతులను కొంచెం మార్చుకోవాలి కదా!