అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖంగా ఉండేది. కానీ రాజు గారికి మాత్రం కోతి అంటే చాలా ఇష్టం. కోతికి కూడా రాజుగారంటే చాలా ప్రేమ.
ఆ కోతిని ఎవ్వరూ ఎప్పుడూ కట్టేసేవాళ్ళు కాదు. రాజుగారి గదిలోకి కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వచ్చే స్వేచ్ఛ ఉండేది దానికి.
ఒకరోజు రాజుగారు నిద్రపోతున్నారు. ప్రక్కనే కూర్చొని, ఆయన్నే చూస్తూన్నది కోతి.
అంతలో రాజుగారి భుజం మీద ఈగ వాలింది. కోతి ఈగను తోలింది. కానీ ఈగ పోలేదు. మళ్ళీ మళ్ళీ రాజుగారి మీద వాలుతూనే ఉంది.
చెయ్యి మీద వాలింది. మళ్ళీ వచ్చి నుదుటి మీద వాలింది. కోతి తోలగానే ఎగిరి పాదం మీద వాలింది. కొంచెం ఎగిరి వచ్చి ఈసారి రాజుగారి ముక్కు మీద వాలింది.
'రాజుగారికి నిద్రాభంగం అవుతుందే' అని కోతికి కష్టం వేసింది. అంతలో దానికి ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే వెళ్ళి గోడకు వ్రేలాడుతున్న పెద్ద కత్తిని ఒకదాన్ని తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర కూర్చున్నది.
ఈసారి ఈగ రాజుగారి మీద వాలిన మరుక్షణమే ఆ ఈగ మీద దాడి చేసింది.
ఈగ తప్పించుకున్నది; కానీ రాజుగారికి మాత్రం బాగా గాయాలు అయ్యాయి!
రాజుగారికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. తెలివిలేని వాళ్లకి అధికారం ఇస్తే కష్టాలు తప్పవని అర్థం అయ్యింది.