సీత- గీత ఇద్దరూ పామర్రు పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నారు. ఇద్దరూ నిజంగా చాలా తెలివైనవాళ్ళే; ఇద్దరికి ఇద్దరే పోటీ.

ఐతే గీతకు మటుకు, సీత అంటే కాస్త అసూయ. కారణం సీత తనకంటే 'మంచి ఛాయ'లో, అందంగా ఉండటం; ఆమె వెంట్రుకలు ఇంత పొడవుగా, వంకీలు వంకీలుగా ఉండటం; ఆమె అందరితోటీ కలుపుగోలుగా మాట్లాడటం- "తనకు ఇవేవే లేవు; ఇవన్నీ సీతకు ఉన్న అదనపు అర్హతలు!" అని గీతకు కొంచెం కుళ్ళు.

గీత కాస్త ధనవంతుల బిడ్డ. అందుకే అందరితో అంత కలవదు. అయినా అందరూ తనవెంటే ఉండాలని ఆశిస్తుంది. సీత అట్లా కాదు- తనది మధ్యతరగతి కుటుంబం. అందుకేనేమో, మరి అందరితోటీ చక్కగా కలుస్తుంది. ఎవరికి ఏ సాయం కావాలన్నా అడగకుండానే చేసేస్తుంటుంది. పిల్లలు అందరూ ‘సీతా! సీతా!’ అంటూ ఆమె వెంటే ఉంటారు.

ఒకసారి వాళ్ల క్లాస్‌ పిల్లాడు భాస్కర్ ఆటల్లో క్రింద పడ్డాడు. వాడి చేయి వాచి పోయింది- దాంతో‌ వాడు పది రోజుల పాటు నోట్సు వ్రాసుకోలేకపోయాడు.

అయితే వాడు అడక్కుండానే వాడి నోట్సు వ్రాసిపెట్టింది సీత. మరోసారి వాళ్ల స్నేహితురాలు మాలతికి జ్వరం వచ్చింది- వారం పాటు తను స్కూలుకు రాలేకపోయింది పాపం. సీత ఆ పాపకు కూడా తానే నోట్సులన్నీ వ్రాసి ఇవ్వటమే కాక, వాళ్ల ఇంటికే వెళ్ళి, క్లాసులో జరిగిన పాఠాలన్నీ చెప్పింది. ఇట్లా ఎప్పుడూ ఎవరికో ఒకరికి, అడగకుండానే సాయం చేసేస్తుంటుంది తను.

అందుకనే అంతా సీతను ఇష్టపడతారు; కానీ గీత మాత్రం 'అబ్బ! ఈ పేద బుధ్ధుల సీతతో చస్తున్నాం!' అని విసుక్కునేది. "బడిలో పిల్లలంతా అందరూ లైబ్రరీ పుస్తకాలు చదవాలి" అని వాళ్ల హెడ్మాస్టరు గారికి గట్టి కోరిక. పిల్లలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలని, ఆయన కొత్తగా ఒక ప్రతిపాదన చేసారు: ప్రతి క్లాసు పిల్లలకూ వాళ్ళ వాళ్ల స్థాయికి తగినట్లు కొన్ని పుస్తకాలు ఇస్తారు. వాళ్ళు వాటిని అన్నిటినీ చదివి, సొంత మాటలతో ఒక నోట్సు తయారు చేయాలి. ఏ వారానికి ఆ వారం, తమ నోట్సును క్లాస్‌టీచర్ గారికి చూపించాలి. అట్లా పుస్తకాలు బాగా చదివి, నోట్సు తయారు చేసిన వాళ్లకు సంవత్సరాంతాన మంచి బహుమతులు ఇస్తారు!

ఆ క్రమంలో వీళ్లకి "గాంధీగారి ఆత్మ కథ-సత్యశోధన" పుస్తకం ఇచ్చారు.

తెలివైన గీత రోజూ ముఫ్ఫై పేజీల వరకూ చదివేసేది. ఆపైన "నువ్వు ఎన్ని పేజీలు చదివేసావు?" అని కనిపించిన వాళ్లనల్లా అడిగేది. "నువ్వెన్నో పేజీ?" అని వాళ్లెవరైనా అడిగితే తను మటుకు "నేను రోజుకు పది పేజీలు కూడా చదవలేకపోతున్నాను.. మీరే నయం" అని చెబుతుండేది.

కానీ రహస్యాలు ఎంత కాలం దాగుతాయి? సంగతి బయట పడనే పడింది. ఒకసారి గీత నూటయాభైయవ పేజీ చదువుతుండగా చూసిన పాప ఒకామె, సీతకు ఆ సంగతి చెప్పి- "ఎంత మోసపు పిల్లో చూడు. తనేమో ఎక్కువ చదివేసి, మనందరం తక్కువ చదవాలనే కదా, ఈ పాప ఇట్లా చేస్తున్నది?!" అన్నది. సీత తేలికగా నవ్వేస్తూ "ఎవరికి వాళ్లం, మనకు వీలైనంత మనం‌ చదువుదాం. దీనిలో పోటీ అవసరం లేదు!" అనేసింది.

ఆరోజు పిల్లలు బడి నుండి ఇంటికి వెళ్ళే సమయానికి పెద్ద సుడిగాలి వీచింది. గీత కంట్లో దుమ్ము పడి, కళ్ళు ఎర్రగా అయి వాచాయి. మరునాడు తను బడికి రాలేకపోయింది.

సాయంత్రం బడి ఐపోగానే వాళ్ళింటికి వెళ్ళింది సీత- "బడికి ఎందుకు రాలేదు?" అని అడిగేందుకు.

ఆ సమయానికి గీత ఇంట్లో పడుకొని ఉంది. వాళ్ళమ్మ కంట్లో మందు వేస్తున్నది.

"బాగున్నావా, సీతా?" అని పలకరించి, "ఇదిగో, చూడు, మీ ఫ్రెండు సీత వచ్చింది, నీ కోసం" అన్నది గీత వాళ్లమ్మ. గీత కళ్ళు తెరవకుండానే "ఏం సీతా! నా కళ్ళు బాగా వాచినై అని, చూసి సంతోషించేందుకు వచ్చావా?!" అంది కోపంగా.

సీత నవ్వి "కాదు గీతా! నువ్వు ఇంకా గాంధీగారి ఆత్మకథ పూర్తి చేయలేదు కదా?! రేపే మనం నోట్సు సబ్మిట్ చేయాలి. అందుకని నీకు చదివి పెట్టి పోదామని వచ్చాను" అంది.

సీత మంచి బుద్ధి, అడక్కుండానే అందరికీ సాయం చేసే మనస్సు గీతకు తెల్సు కనుక లోలోపల సంతోషపడింది గీత.

ఆలోగా సీత తన దగ్గరున్న గాంధీగారి ఆత్మకథ పుస్తకం తీసి "ఎన్ని పేజీలు చదివావు గీతా?! ఆ పేజీ నుండే గట్టిగా చదువుతాను. నువ్వు జాగ్రత్తగా విని, చెబితే నీ నోట్సు కూడా నేనే వ్రాసి పెడతాను" అన్నది.

గీత ఆలోచనలో పడింది- "నిజానికి తను పుస్తకం చివరికి వచ్చింది.. కానీ ఆ సంగతి ఎవ్వరితోటీ చెప్పలేదు- 'ఏదో, ఊరికే నలభై-యాభై పేజీలు చదివా' అన్నట్లు చెప్పింది. మరి ఇప్పుడు ఈ సీతకి అసలు సంగతి తెలిసిపోతే ఎలాగ? కానీ ఇప్పుడు తను నిజం చెప్పలేదనుకో, మరి నోట్సు ఎవరు రాసిపెడతారు? ఇదేదో పెద్ద సమస్యే వచ్చి పడిందే!" అని.

చివరికి అయిష్టంగానే, తప్పదన్నట్లు, తను చదివిన పేజీ నెంబరు చెప్పేసింది. "ఇంతవరకూ వచ్చావా?" అని సీత ఆశ్చర్యపడుతుంది అనుకున్న గీతకు నిరాశే ఎదురైంది. సీత ఏమీ అనలేదు. తను చెప్పిన పేజీ తీసి చదవటం మొదలు పెట్టింది.

చదవటం అయ్యాక, నోట్ బుక్ తీసుకుని " చెప్పు గీతా, నోట్సు వ్రాసి పెడతాను"అంది.

గీత చెప్పినదంతా చక్కగా రాసి పెట్టింది సీత. అంతా అయి చివరికి ముగిస్తుండగా సీత అడిగింది- "గీతా! గాంధీగారి ఆత్మకథనుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి?" అని.

గీత చెప్పింది కళ్ళుమూసుకునే- "ఏముంది సీతా! మనం ఆయనలా గొప్ప పేరు తెచ్చుకోవాలి" అని.

"కాదు గీతా! మనం కూడా ఆయన లాగా సత్యవాదులుగా అవ్వాలి: ఎన్నడూ ఎవ్వరికీ అసత్యం చెప్పకూడదు. ఎవ్వరికీ అపకారం తలపెట్టకూడదు: అహింసా మూర్తులమవ్వాలి. అందుకేనట, హెడ్మాస్టరు గారు మనకు ఈ ఆత్మకథ పుస్తకాన్ని ఇచ్చింది. "మన ప్రవర్తనను మనమే సరిదిద్దుకోవాలి; సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలి" అని రాయమన్నారు. ఇదిగో నీ నోట్సు! నువ్వు చెప్పిన దాని చివర్లో నేను ఈ వాక్యాల్ని కూడా చేర్చేసానులే.

మరి రేపు వస్తావుగా, స్కూలుకు?! నువ్వే టీచర్ గారికి ఇచ్చేయచ్చు!" అంటూ తన చేతిలో నోట్స్ పెట్టింది సీత. గీత చప్పున సీత చెయ్యి పట్టుకుని "సారీ సీతా! నీ పట్ల అసూయతో ప్రవర్తించాను; అబద్ధాలు చెప్పాను; నిన్ను బాధ పెట్టాలనుకున్నాను. నన్ను క్షమించు" అన్నది.

"ఏమీ పర్లేదులే గీతా! 'మన తప్పును మనమే తెల్సుకుని, మనల్ని మనం సరిదిద్దుకోవటమే ఉత్తమ లక్షణం' అని హెడ్మాస్టరుగారు చెబుతుంటారు కదా! దాన్లో నువ్వు ముందున్నావ్! ఏం పర్వాలేదులే! వస్తాను మరి! ఆలస్యం అవుతున్నది" అంటూ కదిలింది సీత, ఇంటికెళ్ళేందుకు.

ఆ తర్వాత గీత చాలా మారింది. తోటివాళ్ల గురించి దయతో ఆలోచించసాగింది. అందరితోటీ బాగా కలిసిపోయింది.