"ఒరే, పిల్లలూ! మూడొకట్లు హెచ్చిస్తే ఎంతొస్తుందిరా?" అడిగాడు తాతయ్య.

"మూడొకట్లు మూడు" అన్నాడు సురేషు. వాడు తెలుగు మీడియం ఒకటో తరగతి.

"త్రీ- వం జా- త్రీ" అన్నది స్మిత. తను ఇంగ్లీషు మీడియం ఒకటో తరగతి.

"అది కాదమ్మా నేను అడిగేది! మూడు ఒకట్లను మల్టిప్లై చేస్తే ఎంతొస్తుంది?" అడిగాడు తాతయ్య.

"ఓహో, 13 కావాలా?! 1x1x1 = 1 " అన్నాడు రవి. వాడు ఎనిమిదో తరగతి.

"అవునవును. మా చిన్నప్పుడు దాన్ని 'ఒకటి ఘనం' అనేవాళ్లం! మరి 23 ఎంత?" అడిగాడు తాతయ్య మళ్లీ.

"ఆరు!" అరిచాడు సురేషు

"కాదురా! రెండు రెళ్లు నాలుగు, నాలుగు రెళ్లు ఎనిమిది! సమాధానం ఎనిమిది!" అన్నాడు రవి.

"సరే, మరిప్పుడు మీరంతా పదిహేను వరకూ అంకెల క్యూబ్‌లు రాయండి!" ఆదేశం‌ ఇచ్చాడు తాతయ్య.

వెంటనే పిల్లలంతా లేచి కాయితాలకోసం పరుగెత్తారు చివరికి వాళ్లంతా రాసింది ఈ పైన ఉంది.

"బాగుంది బాగుంది." మెచ్చుకున్నాడు తాతయ్య.

"సరే, ఇప్పుడు చెప్పండిరా, చూద్దాం: ‘13 +23 ఎంత?"

"ఒకటికి ఎనిమిది కూడితే వచ్చేది, తొమ్మిది!" అరిచారు పిల్లలు.

"సరే సరే! యీ తొమ్మిదినే మరో రెండు క్యూబుల మొత్తంగా చెప్పండి చూద్దాం!" అన్నాడు తాతయ్య, ఆ కాగితం ముందు వేసుకొని.

"ఎట్లా వస్తుంది తాతయ్యా! రాదు! 13కి 33 కలిపినా 28 వచ్చేస్తుంది కదా! తొమ్మిదిని దాటి పోతుంది" చెప్పేసింది సింధు.
సింధు ఇప్పుడు పదో తరగతి. తను లెక్కలు బాగా చేస్తుంది.

"అవునవును- మిగతావి ఏవి కూడినా తొమ్మిదిని దాటిపోతై" అన్నాడు రవి.

"సరే, కానియ్యండి- అయితే ఈసారి మరో పని చేయండి: 73+ 63 ఎంత వస్తుంది, చెప్పండి?!" అడిగాడు తాతయ్య.

"216+343=559" చెప్పింది చంద్రకళ, తను రాసుకున్న కాగితం చూసి.

"ఒకె. మరి యీ ఐదొందల యాభై తొమ్మిదిని తెప్పించండి, వేరే క్యూబ్‌లు ఏవైనా రెండింటిని కలిపి! ఇదే ఇవాల్టి ఛాలెంజ్‌!" అన్నాడు తాతయ్య.

పిల్లలంతా రకరకాల అంకెలు వేసుకొని కూడారు; కానీ ఎవ్వరికీ సమాధానం దొరకలేదు.

"ఇది కూడా రాదు - పో, తాతయ్యా! రెండు క్యూబులు కూడితే వచ్చిన అంకె, వేరే ఏ రెండు క్యూబులు కూడినా రాదు !” అన్నది సింధు.

"వామ్మో బలే సిద్ధంతం చెప్పేసావే! కానీ తప్పు. కొన్ని అంకెల్ని అట్లా రెండు క్యూబుల మొత్తాలుగా- రెండు రకాలుగా- రాయచ్చు! ప్రయత్నించి కనుక్కోండి!" అన్నాడు తాతయ్య నవ్వుతూ.

కొద్ది సేపు కష్ట పడ్డాక, రవి అడిగాడు "ఇది చాలా కష్టం తాతయ్యా! ఎన్ని అంకెలు కూడాలి, మేం మాత్రం?! క్లూ ఇవ్వు ఏదైనా !"

"సరే, ఆ అంకె ఏదో నేనే చెప్పేస్తాను- 1729. ఇది ఏ రెండు క్యూబులు కూడితే వస్తుందో మీరే కనుక్కోండి" చిలిపిగా నవ్వాడు తాతయ్య, సురేషు కేసి చూసి కన్ను గీటుతూ.

" 1728 కి ఒకటి కూడితే సరి, 1729 వచ్చేస్తుంది!" అరిచేసాడు సురేషు చటుక్కున.

తాతయ్య వాడిని మెచ్చుకుంటూ, "బాగుంది. ఇంతమంది పెద్ద పిల్లలుండగా యీ చిటుకు కనుక్కున్నాడు చూడండి కిటుకు! మరిప్పుడు పెద్దవాళ్ళూ, మీరు చెప్పండి : 1729 ని వేరే రెండు క్యూబుల మొత్తంగా చెప్పండి చూద్దాం!"

రెండు నిముషాలయ్యక సింధూ కనుక్కున్నది:

“9క్యూబ్‌ + 10క్యూబ్‌ = 729 + 1000 = 1729!"

"బాగుంది" మెచ్చుకున్నాడు తాతయ్య "మీరందరూ బలే తెలివైన పిల్లలు".

"పో తాతయ్యా! ఊరికే ఇంత కష్టం లెక్కలు చేయించి ఉడికిస్తున్నావు!" మూతి ముడిచింది పద్మ. తనకి 'లెక్కలు రావు' అని పేరు.

"కాదులేవే, ఇంతకీ మీకు 1729 కధ తెలుసా, తెలీదా?!” అడిగాడు తాతయ్య.

"అమ్మో! ఇప్పుడు నువ్వు చరిత్ర పాఠం చెప్పబోతున్నావా, ఏంటి?!" నిర్ఘాంతపోయినట్టు అరిచారు పిల్లలు.

"లేదురా, అంకె కథే. మన దేశపు కుర్రవాడు ఒకడు, లండన్‌లో చాలా పేరు ఉన్న లెక్కల ప్రోఫెసరు గారికి ఒకరికి తను రాసుకున్న చిత్తు నోట్సు కాయితాలను పంపించాడట, చాలా ఏళ్ల క్రితం "అయ్యా! నేను లెక్కలు పెద్దగా చదువుకోలేదు. ఇండియాలో జమ-ఖర్చు లెక్కలు రాసే గుమస్తా పని చేస్తుంటాను. రోజులు సరిగా గడవట్లేదు. ఐతే నాకు లెక్కలంటే చాలా ఇష్టం. ఇదిగోండి, నానోట్సులో నేను సొంతంగా కనుక్కున్న లెక్కలు కొన్ని ఉన్నై. వీటిని చూసి, నా లెక్కలు కరెక్టో, తప్పో చెప్పండి ప్లీజ్‌!" అంటూ.

ముందు ఆ ప్రొఫెసర్‌ దాన్ని చూసి చెత్త అనుకున్నాడు. తర్వాత నిజంగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందులో ఉన్నవి ఆనాటి వరకూ ఇంకా ఎవరూ, ఏ గణిత శాస్త్రజ్ఞుడూ కనుక్కోని కొత్త సిద్ధాంతాలు!

ఆ ప్రొఫెసరు- ఆయన పేరు హార్డీ- ఆయన చాలా మంచివాడు. లెక్కలంటే మక్కువ ఉన్నవాడు. ఆయన ఆ కుర్రవాడిని మెచ్చుకొని, "చాలా బాగున్నాయి, కానీ ఒరే, నువ్వు చెబుతున్నవి కొన్ని నాక్కూడా అర్ధం కాలేదు, ఇక్కడి కొచ్చి మా కాలేజీలో చేరరాదా, కొన్ని లెక్కలు నువ్వు నేర్చుకోవచ్చు; కొన్ని నేను నేర్చుకుంటాను?! నీకు బాగా డబ్బులు కూడా ఇస్తారు, మా యూనివర్సిటీ వాళ్లు?" అని రాసాడట.

అట్లా వెళ్ళాడట మన రామానుజన్‌, లండన్‌లో కేంబ్రిజ్‌ యూనివర్సిటీకి!" ఆపాడు తాతయ్య. ఓహో! ఇది శ్రీనివాస రామానుజన్‌ కథా?!" ఆశ్చర్య పోయారు పిల్లలు.

అవును ఇందాక మనం కనుక్కున్నామే, ఆ అంకె 1729 ని రామానుజన్‌-హార్డీ నంబర్‌ అంటారు" చెప్పాడు తాతయ్య. "ఎందుకలాగ?!" అడిగింది సింధు.

తాతయ్య చెప్పాడు "రామానుజన్‌కి ఒకసారి చాలా జబ్బు చేసిందిట. చావు బ్రతుకుల సమస్య. ఆ సమయంలో అతన్ని పలకరించేందుకు ఓ టాక్సీ ఎక్కి వచ్చాడు హర్డీ. ఆ టాక్సీ నెంబర్‌ అతనికి గుర్తుంది- 1729!

ఆస్పత్రిలో అవీ ఇవీ మాట్లాడాక, అతను రామనుజన్‌తో అన్నాడట, యధాలాపంగా- "ఏంటో, రామానుజన్‌! ఇవాళ్ల అంతా 'డల్‌' గా ఉంది. చివరికి నేను ఎక్కివచ్చిన టాక్సీ నెంబరు కూడా 'డల్‌' గానే ఉంది! 1729. ఎందుకూ పనికిరాని అంకె!" అని.

రామానుజన్‌ చటుక్కున కళ్లు తెరిచి, నవ్వాడట- "కాదు. అది చాలా ఆసక్తికరమైన అంకె! రెండు క్యూబుల మొత్తాలుగా, రెండు రకాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో అతి చిన్నది 1729! అన్నాడట.

తర్వాత హర్డీ లెక్క చూసుకుంటే ఏముంది, అది నిజమే! అర్థమైనాయా, అతని తెలివితేటలు?

అట్లా రామానుజన్‌ చాలా కష్టమైన లెక్కల్ని తనే సొంతంగా చేసి పెట్టుకున్నాడు. చాలా మేధావి. కానీ పాపం ఆయన ఆరోగ్యం ఏనాడూ సరిగా లేదు. 32 ఏళ్ల వయసుకే చనిపోయాడు. డిసెంబర్‌ ఇరవై రెండు ఆయన పుట్టిన రోజు. దాన్ని మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుగుపుకుంటున్నాం! ఒరే, శ్రీనివాస రామానుజన్‌ని గురించి మీరంతా బాగా చదవాలి.
అట్లాంటివాడు మళ్లీ పుడతాడో, అసలు పుట్టడో!" ఆగాడు తాతయ్య.

"ఎందుకూ?! నేను ఉన్నానుకదా! 1+1728 అని కనుక్కొలేదా, ఒక్క క్షణంలో ?! నేనూ ఆయనంత వాడిని అవుతాను!" అన్నాడు సురేష్‌, సీరియస్‌గా.

పిల్లలంతా నవ్వారు. "అవున్రా! మీరంతా రామానుజన్‌లయిపోండి. అందరికీ లెక్కలన్నీ సులభం చేసెయ్యండి!" నవ్వాడు తాతయ్య.