అనగనగా 50 సంవత్సరాల క్రితం 'మేరీ' అనే యువరాణి ఉండేది.
అప్పుడు ఒక రోజున గాలి బాగా వీచింది. మేరీకి చాలా ఇష్టమైన కుండ ఒకటి- క్రింద పడి, పగిలిపోయింది!
దాంతో మేరీకి చాలా బాధ వేసింది. ఆమె హద్దూపద్దూ వదిలేసి వాయుదేవుడిని ఇష్టం వచ్చినట్లు తిట్టింది.
అది విని వాయుదేవుడికి ఎక్కడలేని కోపం వచ్చింది.
తనకి ఓ శాపం పెట్టాడు. 'తను రోజూ మూడు గంటల కన్నా ఎక్కువ సేపు పండుకోకూడదు. అట్లా పడుకుంటే తను ఒక బఠానీ గింజలాగా మారిపోతుంది. అంతేకాదు- తను ఇంకెప్పుడూ సూర్యడిని కూడా చూడకూడదు. ఎండకు ఉంటే తన రక్తం ఎండిపోయి, తను చనిపోతుంది!
ఆ రాత్రి తను చాలా అలసటతో వచ్చి పడుకున్నది...గంటైంది..రెండు గంటలు గడిచాయి ...మూడో గంట దాటేసరికి ఆమె మెల్లగా, చిన్నగా అవ్వటం మొదలుపెట్టింది.
ముదురు పచ్చ రంగుకి మారింది. చివరికి తను పూర్తిగా ఒక చిన్న బఠాణీ అయిపోయింది!
అప్పుడు గాలి చాలా గట్టిగా వీచింది. దాంతో ఆ బఠాణి కాస్తా దొర్లుకుంటూ పోయి బాల్కనీలో పడింది.
అంతలో ప్రొద్దెక్కింది. సూర్యుడు వచ్చాడు.
ఆ తర్వాత కొంతసేపటికి గానీ యువరాణికి మెలకువ రాలేదు. మెలకువ వచ్చాక ఏడుపొచ్చింది. తను బఠాణీ అయిపోయింది అని అర్థం చేసుకున్నది. వాయు దేవుడిని ఊరికే తిట్టినందుకు పశ్చాత్తాప పడింది.
సూర్యుడి వెలుగు వల్ల ఆమెలో రక్తం ఎండి పోవటం మొదలైంది. బఠాణీ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంక కదలలేదు!
ఆమె కష్టాలు చూసి వాయుదేవుడి మనసు కరిగింది.
ఆమె పశ్చాత్తాప పడింది అని ఆయనకు అర్థం అయ్యింది. ఆమెకు తను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించాడు.
"నన్ను క్షమించు! ఇంకెప్పుడూ నిన్ను తిట్టను. నీ శక్తిని చిన్నచూపు చూడను!" అన్నది యువరాణి.
వాయుదేవుడు తనని క్షమించాడు. "కనీసం ఆమెకు గుణపాఠం లభించిందిలే; ప్రకృతి శక్తుల్ని చిన్నచూపు చూడకూడదని అర్థమయ్యేట్లు చేసాను!" అని సంతోషపడ్డాడు.