దేవుడు అన్ని పక్షులకూ రంగులు వేస్తున్నాడు. ముందుగా నెమలి వెళ్ళి, దేవుడి దగ్గరున్న అన్ని రంగులూ తనకు వేయించుకున్నది.

అదే, వచ్చి మిగతా పక్షులకు కూడా చెప్పింది.

దాంతో‌ అన్ని పక్షులూ దేవుడి ముందు క్యూ కట్టి నిల్చున్నాయి. ఆయన దగ్గరున్న రంగుల్లోంచి ఎంచుకొని, తమకు ఇష్టం వచ్చిన రంగులు వేయించుకున్నాయి.

అయితే ఈ జాతర జరిగే సమయానికి కోకిల వేరే ఊరికి వెళ్ళి ఉన్నది. దానికి ఈ సంగతి తెలీలేదు. తీరా సాయంత్రం వచ్చేసరికి దేవుడి దగ్గర అన్ని రంగులూ అయిపోయాయి.

"ఇంకే రంగులూ మిగల్లేదు కోకిలమ్మా! నలుపు రంగు ఒక్కటే ఉంది. అది వేసుకో" అన్నాడు దేవుడు.

"ఏ రంగయితే ఏమున్నదిలెండి స్వామీ! నలుపే చాలు!" అంటూ నలుపు రంగు వేసుకున్నది కోకిల.

అప్పుడు గుర్తుకొచ్చింది దేవుడికి- "కోకిలని నలుపు రంగు వేసుకొమ్మన్నాను కానీ, దీనికి కాకికి తేడా ఏముంటుంది?! ఇద్దరిదీ నలుపు రంగే అయ్యిందే!" అని బాధపడ్డాడు.

అయినా కోకిల మటుకు ఏమీ చిన్న పోలేదు.

అప్పుడు దేవుడు "అందరికీ వాళ్ళు కోరిన రంగులు వేశాను. కానీ పాపం నీకు అట్లా కుదరలేదు. అందుకని ఒక పని చేస్తాను. నీ రంగు సంగతి ఎట్లా ఉన్నా, నీకు మటుకు మంచి గొంతును ఇస్తాను.

తీయని నీ గొంతును వినగానే అందరూ నిన్ను 'కోయిల' అని గుర్తు పట్టేస్తారు. నీ పాట వినగానే అందరికీ 'వసంతం వచ్చేసింది' అని అర్థమౌతుంది" అన్నాడు.

ఆ రోజు నుంచి కోకిలకు మధుర స్వరం వచ్చేసింది. వసంతకాలం వచ్చేసిందని మనందరికీ ఆ కోకిలే చెబుతున్నది, ప్రతిసారీ!