అనగనగా ఒక అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టులో‌ గోరింకల గుంపు ఒకటి ఉండేది. పెద్ద గోరింకలన్నీ పొద్దున్నే బయటికి వెళ్ళిపోయేవి. వెతికి వెతికి, పిల్లలకు నచ్చే ఆహారాన్ని దొరికించుకునేవి. దాన్ని తెచ్చి పిల్లలకు పెట్టేవి. వాటి తీరును గమనించాయి రెండు గ్రద్దలు.





పెద్ద గోరింకలు ఆహారం తెచ్చేందుకు వెళ్ళగానే అవి మర్రి చెట్టు మీద వాలటం మొదలెట్టాయి. గూళ్ళలో ఉన్న గోరింక పిల్లలను చంపి తినెయ్యటం, మరి కొన్నిటిని గోళ్ళకు గుచ్చుకొని ఎగిరి పోవటం మొదలెట్టాయి.

పిల్లలు కనబడక పెద్ద గోరింకలన్నీ రాత్రుల్లో ఏడుస్తూ కూర్చున్నాయి. ఆ రోజునే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి.


మరుసటి రోజు తెల్లవారగానే అవన్నీ ఆహారం తెచ్చేందుకు వెళ్ళినట్లే వెళ్ళినై. అక్కడక్కడా నక్కి, మర్రి చెట్టునే గమనించటం మొదలు పెట్టినై. అయితే ఆ సంగతి తెలీని గ్రద్దలు రెండూ కాసేపు ఆకాశంలో చక్కర్లు కొట్టి, చెట్టు మీద వాలినై. మరుక్షణం పెద్ద గోరింకలన్నీ వాటిమీదికి దూకి, అరిచి, ముక్కులతో పొడిచి, రెక్కలతో బాది, వాటిని అక్కడినుండి తరిమి వేసినై.

తర్వాత అవన్నీ ఆలోచించి, దగ్గర్లో ఉన్న గ్రామంలోకి వెళ్ళినై. అక్కడ ఓ పెళ్ళి జరుగుతున్నది. పెండ్లివాళ్లు వాయించిన తప్పెట్లు, తాళాలలో తాము మొయ్యగలిగినవాటినల్లా గువ్వలు ఎత్తుకొచ్చాయి. కొన్ని పక్షులు తమకు దొరికిన గిన్నెలను, పళ్ళేలను తెచ్చుకున్నాయి.

గువ్వలు ఆరోజు రాత్రి ఒక సంగీత విభావరిని ఏర్పాటు చేసుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలు ఎలా చెయ్యాలో నేర్చుకొన్నాయి.

మరుసటి రోజు ఉదయం గద్దలు ఆకాశంలో విహరిస్తుంటే గోరింకలు క్రింది నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేసాయి.

అవి విన్న గ్రద్దలు రెండూ భయపడ్డాయి. "ఎవరో మనుషులు ఉన్నట్లు ఉన్నారు- రేపు వద్దాం!" అని వెళ్ళిపోయాయి.

గోరింకలు చాలా సంతోషపడ్డాయి. మరుసటి రోజున గ్రద్దలు వచ్చే సమయానికి మళ్ళీ అదే తంతు. చివరికి భయపడినై గ్రద్దలు. అక్కడికి రావడం మానివేశాయి.

అటుపైన గోరింకలు హాయిగా బ్రతికాయి.