అనగనగా ఒక ఊర్లో ఒక చెవిటివాడు ఉండేవాడు. అతని పేరు రాము. రాము భార్య పేరు విమల.
విమల ఒక రోజు తన భర్త చెవిలో గట్టిగా అరిచింది- "ఏమండీ మా నాన్న వస్తానంటున్నాడు మనింటికి" అని.
"ఎందుకే, నాకు చెవుడు కదా!" అన్నాడు రాము.
విమల విసుక్కున్నది- "అయినా ఎవరైనా మనింటికి వస్తామంటే ఎప్పుడూ రావద్దనటం ఏం బాగుంటుంది?" అని. తర్వాత భర్తకు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ గట్టిగా చెప్పి, "చెవిటి వాడు అనే అనుమానం రాకుండా నడుచుకోండి. ఇంకొంచెం సేపట్లో మా నాన్న వచ్చేస్తాడు" అని అరిచింది.
"సరేలే, ఇక తప్పదు" అనుకొని కూరగాయలు తెచ్చేందుకు సంతకు వెళ్ళాడు రాము.
అతను వెనక్కి తిరిగి వచ్చేసరికి వాళ్ళ మామ ఎదురయ్యాడు. "బాగున్నవా, మామయ్యా?!" అన్నాడు రాము చాలా మర్యాదగా.
"బాగున్నాను బాగున్నాను" అన్నాడు మామ.
"మీరంతా ఎట్లా ఉన్నారు?" అని అడుగుతాడనుకున్నాడు రాము. కానీ వాళ్ల మామ అట్లా ఏమీ అడగలేదు. అయినా ఆ సంగతి రాముకు తెలీదు కదా, అందుకని "మేం కూడా చాలా బాగున్నాం" అని చెప్పేసి, తర్వాతి ప్రశ్న వేసేసాడు: "నీ ఆరోగ్యం బాగుందా మామా, ఇప్పుడు ఏం మందులు వాడుతున్నావు?" అని.
"ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. మందులేమీ వాడట్లేదు ఇప్పుడు" చెప్పాడు మామ.
"ఏదో ఒక మందు పేరు చెబుతాడు" అనుకున్న రాము తనకు ఏమీ వినిపించకపోయినా "బాగుంది బాగుంది. మంచి మందే!" అన్నాడు. వాళ్ళ మామ అతనికేసి అదోలా చూసాడు.
అంతలో "ఇంతకీ మీరు వెళ్తున్నది ఏ డాక్టరు దగ్గరికి?" అని అడిగేసాడు రాము. వాళ్ళ మామ "ఇప్పుడు ఎవ్వరి దగ్గరికీ వెళ్ళట్లేదు అల్లుడూ!" అన్నాడు.
"ఎవరో వైద్యుడి పేరు చెప్పి ఉంటాడు" అనుకున్న రాము, తనకు ఏమీ వినపించకపోయినా "ఆఁ ఆఁ అవును. మంచి వైద్యుడే!" అనేసాడు.
అంతలో విమల కాఫీ పట్టుకొచ్చింది. "నాకు కొంచెం చక్కెర ఎక్కువ వేయమ్మా" అన్నాడు మామ.
అయితే రాము చటుక్కున లేచి, విమల చేతిలోంచి కాఫీ కప్పుని లాక్కొని వంటగదిలోకి పరుగు పెట్టాడు. సంగతి అర్థం కాని విమల వాళ్ళ నాన్న కేసి చూసి ఓ నవ్వు నవ్వింది "ఈయనకి అతిధులంటే చాలా ఇష్టం" అని చెబుతూ.
వంటగదిలోకి పరుగుపెట్టిన రాము ఆ కాఫీలోకి నాలుగు చెంచాల ఫినాయిల్ కలిపాడు. "కాఫీలోకి నేను ఫినాయిల్ కలుపుకుంటాను" అన్నాడనుకున్నాడు మరి!
అతను తెచ్చిచ్చిన కాఫీ తాగి మామ "ఏంటి, కాఫీ ఇట్లా ఉంది?" అన్నాడు.
ఆ ముక్క వినబడింది రాముకు. "నువ్వే కదా మామా! ఫినాయిల్ ఎక్కువ వేయమన్నది?!" అనేసాడు. ఆ దెబ్బకు అర్థమైపోయింది మామకు- తన అల్లుడికి వినపడదు అని!
తండ్రికి కూడా తెలీకుండా గుట్టుగా సంసారాన్ని ఈడ్చాలనుకున్న విమల వెర్రిమొహం వేసింది.
అలా కొన్ని రోజులు గడిచాయి. వాళ్ళకి ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టారు. "పిల్లలకు ఎవరైనా దేవుళ్ళ పేరు పెట్టు" అన్నారు రామువైపు వాళ్ళు.
"మా పెద్దవాళ్ల పేర్లు పెట్టు" అన్నారు విమల వైపు వాళ్ళు.
దాంతో రాముకి కోపం వచ్చింది. "నా పిల్లలు- నా ఇష్టం" అని, కొడుక్కి "విరిగిపోయిన" అని వింత పేరు ఒకటి పెట్టాడు. పెద్ద కూతురికి "చినిగిపోయిన" అని పెట్టాడు. మూడవ బిడ్డకు "పాడైపోయిన" అని పేరు పెట్టాడు.
ఒకసారి రాము బంధువులు కొందరికి పట్నంలో ఏదో పని పడింది. వాళ్లకు రాము అంటే ప్రత్యేకంగా ఇష్టం ఏమీ లేదు. నిజానికి వాళ్ల మనసుల్లో అంతా కల్మషమే నిండి ఉన్నది. అయినా, "వాళ్ళింటికి వెళ్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు!" అని వాళ్ళింటికి దిగబడ్డారు ఓ సాయంత్రం.
వాళ్లని చూడగానే విమల చాలా ఉత్సాహపడింది. "రాక రాక వచ్చారు, బంధువులు!" అని వాళ్ల కేసి నవ్వుతూ చూస్తూ, లోపలికి తిరిగి గట్టిగా అరిచింది: "పాడైపోయినా, కుర్చీ తీసుకురారా! విరిగిపోయినా పాలు యివ్వవే! చినిగిపోయినా టవలు యివ్వవే!" అని.
దాంతో ఆ వచ్చిన బంధువులంతా "వామ్మో! వీళ్ళకి మన సంగతి తెలిసిపోయింది" అని గబగబా పారిపోయారు!