మనం నివసించే ఈ భూమి చుట్టుకొలత సుమారు నలభై వేల కిలోమీటర్లు. వ్యాసార్థం ఆరున్నర వేల కిలోమీటర్లు. మన భూమి లాగానే సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు కనీసం ఇంకో ఎనిమిది ఉన్నాయి. వాటిలో కొన్ని భూమి కంటే చిన్నవి, కొన్ని పెద్దవి. సూర్యుడినుంచి లెక్కపెట్టుకుంటే మన భూమి మూడో గ్రహం. సూర్యుడికి అతి దగ్గరగా బుధుడు, తర్వాత శుక్రుడు ఉన్నై. భూమి తర్వాత వచ్చే నాలుగో గ్రహం అంగారకుడు చాలా చల్లగా ఉంది. బుధ గ్రహం చాలా వేడిగా ఉంటుంది (430 డిగ్రీల C). శుక్ర గ్రహం కూడా విపరీతమైన వేడిగా (460 డిగ్రీల C) ఉంటుంది.

వేడి అంత ఎక్కువ ఉండటం వల్ల ఆ గ్రహాలమీద "ప్రాణి" అంటూ ఏదీ ఉండే అవకాశం లేదు. ఇక చల్లబడిపోయిన అంగారక (-153 డిగ్రీల C) గ్రహంమీద జీవులంటూ ఇది వరకు ఎప్పుడో ఉండి ఉంటాయేమో గానీ ఇప్పుడైతే ఏవీ కనబడటం లేదు. సూర్యుడికి ఇంకా దూరంగా‌ఉన్న గ్రహాలైతే ఇంకా చాలా చల్లనివి. ప్రాణులు నివసించేందుకు అనువైనవి కావు. (గురుడు -234 డిగ్రీల C; శని -178 డిగ్రీల C; యురేనస్ -216 డిగ్రీల C; నెప్ట్యూన్ -200 డిగ్రీల C; ప్లూటో -240 డిగ్రీల C)

చూడగా సూర్యుడి చుట్టూ తిరిగే ఈ గ్రహాలన్నింటిలోకీ భూమి ఒకటే అసలు మనలాంటి ప్రాణులు నివసించేందుకు అనువుగా ఉన్నదని తెలుస్తున్నది. అంతరిక్షంలో ఇట్లా మన సూర్యుడిలాగా‌ లెక్కలేనన్ని నక్షత్రాలున్నై. ప్రతి నక్షత్రం చుట్టూ భూమి లాగానే ఇంకా లెక్కలేనన్ని గ్రహాలు తిరుగుతున్నై. వాటిలో ఎక్కడైనా ప్రాణులు ఉండే అవకాశం నిజంగానే లేకపోలేదు. శాస్త్రవేత్తలు ఏనాటినుండో ఆ దిశలో పరిశోధనలు సాగిస్తున్నారు.

ఇట్లా గ్రహాలు నక్షత్రాల చుట్టూ నిరంతరంగా తిరుగుతూ ఉండగా, కొన్ని ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయి; నిలవలేక పడిపోయి ఆ నక్షత్రాలలోనే కలిసిపోతున్నాయి; కొన్ని వివిధ కారణాల వల్ల పేలిపోతున్నాయి; ఇంకా‌ ఏవేవో ఘటనలు నిరంతర కాల ప్రవాహంలో భాగంగా అంతరిక్షంలో జరుగుతూనే‌ఉన్నాయి.

ఈ క్రమంలో ప్రాణులుగా‌ మనం గుర్తించాల్సిందేమిటి? మన భూమి బాగుంటే మనం బాగుంటాం: భూమి చల్లగా‌ఉండాలి; ఐతే మరీ చల్లగా ఐపోకూడదు. భూమి వెచ్చగా‌ఉండాలి; కానీ మరీ వేడిగా‌ కాలిపోకూడదు. భూమి మీద ఇప్పుడు పారుతున్నట్లు నదులు, వాగులు, వంకలూ పారుతుండాలి; వానలు కురుస్తూ ఉండాలి; సముద్రాలు పొంగకూడదు; భూకంపాలు, తుఫానులు రాకూడదు; అణు యుద్ధాల్లాంటివి అసలు ఏమాత్రం తలెత్తకూడదు; ప్రమాదకరమైన వాయువులు, రేడియేషన్ వ్యాపించకూడదు; మనమందరం పీల్చుకునేందుకు అనువైన గాలి ఉండాలి; అది చల్లగా, హాయిగా కదలాడాలి. వీటన్నిటికీ చెట్లతో సంబంధం ఉందని వేరేగా చెప్పనక్కర్లేదు.

అందుకని అందరం వీలైనన్ని చెట్లు నాటుదాం! ఈ వానాకాలం ఒకొక్కరం పదికి తక్కువ కాకుండా చెట్లు నాటుతామని, ఎన్ని తంటాలైనా పడి, వాటిని కాపాడుతామని ఆశిద్దాం! వందల, వేల, లక్షల సంవత్సరాల తరవాత కూడా ఈ భూమి ఇలా‌ ప్రాణులతో‌ సుసంపన్నంగా విలసిల్లాలని ఆశిద్దాం!

పచ్చని శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం