నంద్యాల నుంచి మాకు పెళ్ళిపిలుపు వచ్చింది. బాగా దగ్గరివాళ్ళింట్లో పెళ్ళి. నేను, మా అమ్మ, చెల్లి- ముగ్గురమూ వెళ్ళాలి పెళ్ళికి. మా అమ్మ ముందుగానే బయలుదేరిపోయింది- నేనూ, చెల్లీ వెనకగా బయలుదేరాం నంద్యాలకి.

తీరా చేరుకున్నాక తెలిసింది మా తలతిక్క పనేంటో: పెళ్లి జరుగుతున్నది నంద్యాలలో కాదు- నందికొట్కూరులో! మా హడావిడిలో మేం‌ పెళ్ళిపత్రికని చూసుకోనే లేదు!

"అసలే ప్రొద్దుట్నుంచీ ప్రయాణం చేసీ చేసీ కడుపు కాలుతుంటే, మళ్ళీ ప్రయాణం చేయాలా!" అని విసుక్కుంటూ బస్టాండుకెళ్ళాం. మేం ఇంకా అడుగు పెట్టకనే నందికొట్కూరు బస్సు- వెళ్ళిపోయింది! ఇంకో రెండు గంటల పాటు ఎదురుచూసి, చివరికి వేరే బస్సెక్కాం. చింపిరి ముఖాలు వేసుకొని నందికొట్కూరు చేరుకున్నాం.

ఆ సరికి పెళ్ళి సమయం దాటిపోయింది. అయినా "వీడి తిక్కగానీ, ఈ పెళ్ళేదో వీడు నంద్యాలలోనే చేసుకొని ఉంటే మాకింత శ్రమ, ఇన్నేసి చార్జీలు- ఇవన్నీ తప్పేవి కదా!" అని తిట్టుకుంటూ వరుడ్ని కలిశాం.

అబ్బో ఆ దుస్తులూ, మేకప్పూ భలే చేశాడు. సెంటు కొట్టాడండీ బాబూ- ఏదో ఫారెన్ సెంటట- వాసనకు మా చెల్లి అయితే తల తిరిగి పడిపోయింది. అంత మంచి వాసన. ఎక్కడాలేనన్ని పూలు, లైట్లు, వీడియోలు పెట్టాడు. పలకరించేదంతా కొద్ది నిమిషాల్లో ఐపోయింది. పెళ్ళికి ఎవరెవరో వచ్చారు. అందరికీ హలో చెప్పేసి, "ఆకలి! ఆకలి! వివాహ భోజనంబు!" అనుకుంటూ భోజనశాలకు పరుగు పెట్టాము.

అబ్బబ్బ ఆ వంటలూ ఆ సువాసనా, ఏం చెప్పాలి?! ఆ మాంసాలూ, వేపుడు వంటలు, ఆ బిర్యానీ, పెరుగు పచ్చడీ, మిఠాయిలూ.. ఒక్కటీ విడువకుండా మొత్తం లాగించేసాను. "ఇంక కడుపులో చోటు లేదు" అనుకున్నాను. ఇప్పుడు నా పొట్ట నిండు కుండ. అయినా ఇంకేదో వెలితి- "కూల్ డ్రింక్ కావాలి"!

కూల్‌డ్రింక్ చేతిలో పట్టుకొని నడుస్తూ ఆ "గార్డెన్" వెనకవైపుకెళ్ళాను. అక్కడ పిల్లలు ఎవరో కొట్లాడుతున్నట్లున్నారు- ఏంటా అని అటువైపుకెళ్ళా- వాంతికొచ్చినట్లయింది. అక్కడ ఓ పదిమంది పిల్లలు- మేం తిని పారేసిన అన్నాన్నీ, చీకి పడేసిన ఎముకల్నీ ఏరుకుని తింటున్నారు. వాటికోసం కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు తింటున్న ఆ ఆహారాన్నీ, వాళ్ళున్న ఆ ప్రదేశాన్నీ చూస్తే నా ఒళ్ళు జలదరించింది. వాళ్ల చుట్టూతా పందులు,కుక్కలు- అన్నీ అక్కడికి విసిరి పడేస్తున్న విస్తర్ల కోసం వాళ్లతో బాటు ఎగబడుతున్నాయి. ఆ పిల్లలకు పోటీగా దొరికిన దాన్ని దొరికినట్లు ఆబగా తింటున్నాయి.

నేను నిశ్చేష్టుడినైపోయి అటూ ఇటూ చూసాను. రోడ్డు మీద అంతా బస్సులూ, లారీలూ, ఆటోలూ.. వాటిలో నిండా ప్రయాణీకులు.. వీళ్ళెవ్వరికీ కనిపించట్లేదా, ఈ పిల్లలు?! వీళ్ళంతా నాకొక్కడికే కనిపించేట్లు మాయ చేసాడా దేవుడు? లేదు.. వీళ్ళు అందరికీ కనిపిస్తూనే ఉన్నారు. కొందరు అప్పుడప్పుడూ వచ్చి వీళ్ళను అక్కడినుండి తరుముతున్నారు. తరిమిన వాళ్ళు అటు తిరగగానే వీళ్ళు మళ్ళీ వస్తున్నారు- వచ్చి, విస్తర్ల చుట్టూ కమ్ముకుంటున్నారు. ఇంతలో పడమటి వైపునుండి ఘాటుగా గాలి వీచింది. విచిత్రమైన కంపునొకదాన్ని మోసుకొచ్చింది. నేను భరించలేక వాంతి చేసేసుకున్నాను.

అక్కడున్న పిల్లలు నాకేసి ఓసారి చూసారు. చూసి, మళ్ళీ విస్తర్ల మీదికి ఎగబడ్డారు.

మన సమాజంలో ఒక భాగం ఇంత నికృష్టంగా ఉందే, మరి మనం అభివృద్ధి అనగానే సాంకేతికత గురించీ, రోడ్లు, సెల్‌ఫోనులు, కార్లు, విమానాలు, కంప్యూటర్ల గురించే మాట్లాడతా-మెందుకు? వీళ్ళని ఎవరమూ ఎందుకు, పట్టించుకోము?