తేజ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదివే శ్రీకాంత్, సాయి కుమార్ ఇద్దరూ ప్రాణ మిత్రులు. ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళు, కలిసి ఆడేవాళ్ళు, ఏ పని చేసినా కలిసిచేసేవాళ్ళు. బడిలో ఎవరికి ఏం కావాలన్నా వీళ్లిద్దరూ ముందుకొచ్చి సహాయం చేసేవాళ్ళు.
శ్రీకాంత్ వాళ్ల నాయనమ్మ అక్కడికి దగ్గర్లోనే బక్కమంతుల గూడెంలో ఉంటుంది. ప్రతి సంవత్సరమూ వేసవి సెలవల్లో మనవళ్ళూ మనవరాళ్ళందరితో ఆ ఊరు ఊరంతా కళకళలాడేది. పిల్లలంతా ఆ ఊరి ముచ్చట్లే చెప్పుకుంటూ గడిపేవాళ్ళు సంవత్సరమంతా "ఈసారి సెలవల్లో నువ్వూ వస్తావా, మా నాయనమ్మ వాళ్ల ఊరు బలే ఉంటుంది!" అని ఊరించాడు శ్రీకాంత్. సాయికుమార్ వాళ్ళ ఇంట్లో వాళ్లనడిగితే వాళ్ళు "సరే మరి- కానీ జాగ్రత్తగా ఉండాలి. ఊరికే ఎవ్వరితోటీ గొడవలు పెట్టుకోకూడదు" అంటూనే అనుమతి ఇచ్చేసారు.
సెలవలు ఇవ్వగానే మిత్రులు ఇద్దరూ బస్సెక్కి పల్లెటూరులో దిగారు. బస్సు వాళ్లని దింపి ముందుకు వెళ్ళిపోయింది. అంతకు ముందు ఎన్నడూ పల్లెటూరును చూసి ఉండని సాయికుమార్‌కి అంతా కొత్తగా ఉంది. ఆ సరికి వాళ్లని తీసుకెళ్ళేందుకు ఎద్దులబండి ఒకటి వచ్చి ఉన్నది. ఎద్దులబండి ఎక్కటం, గతుకులు వచ్చినప్పుడల్లా ధబాలున నడుములు విరిగేట్లు పడటం, ఇద్దరూ నవ్వుకోవటం- అట్లా మొదలైంది సాయికుమార్ పల్లె అనుభవం.
కొద్దిరోజులకు పల్లెటూరు అలవాటైంది. వేసవి కాలం కదా, రోజూ శ్రీకాంత్ , సాయి కుమార్ మిగతా స్నేహితులు అంతా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న బావిలో ఈత కొట్టేవాళ్ళు. ఇద్దరూ కూర్చొని రోజూ అర్థగంట సేపు దినపత్రిక తిరగేసేవాళ్ళు. మధ్యాహ్నం అయ్యిందంటే చల్లటి నీళ్ల మజ్జిగ త్రాగేవాళ్ళు. ఇంట్లోనే రకరకాల ఆటలు ఆడేవాళ్ళు. సాయంత్రం అందరూ గట్లమీద చేరి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు.
ఒకరోజు సాయంత్రం వాళ్ళని ఆలోచింపజేసే సంగతి ఒకటి తెల్సింది: బక్కమంతుల గూడేనికి దగ్గర్లోనే మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఒకటి ఉన్నది. ప్రతి సంవత్సరమూ ఎండాకాలంలో అక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. అయితే ఎందుకనో, గత రెండేళ్ళుగా ఆ ఊరికి భక్తుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. అంతకు ముందు అక్కడ 'నిద్రలు' చేసే వాళ్ళు కూడా, ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతున్నారు.
"ఎందుకు వచ్చింది, ఈ మార్పు?" అడిగాడు సాయికుమార్.
వాళ్ళకు ఈ సంగతి చెప్పిన స్నేహితుడు రాజేష్ సిగ్గు పడుతున్నట్లు నవ్వాడు: "ఏమీ లేదు; ప్రతి రోజూ రాత్రి అవ్వగానే గుడినుండి భయం గొలిపే వింత వింత శబ్దాలు వస్తున్నాయి. గుడికి వచ్చిన వాళ్లందరికీ గుండెలు అదిరేలా చప్పుళ్ళు, ఎవరో ఏడుస్తున్నట్లు శబ్దాలు.. దాంతో గుడికి రాకపోకలు బాగా తగ్గాయి" అని చెప్పాడు.
"ఎందుకొస్తున్నాయి, శబ్దాలు?" అడిగాడు సాయి కుమార్.
"ఏమో మరి. దయ్యాలు అని అందరూ అంటున్నారు" చెప్పాడు రాజేష్.
" 'దయ్యాలు, భూతాలు అంటూ వేరే ఏవీ ఉండవు. అన్నీ మనుషులే' అని మన సైన్సు సార్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు కదా, లేని దయ్యాలు ఉన్న చప్పుళ్ళెలా చేస్తాయి?" అడిగాడు సాయికుమార్ ఆసక్తిగా.
శ్రీకాంత్ గట్టిగా నవ్వి వేరే సంగతేదో మాట్లాడాడు.
మరుసటి రోజున మిత్రులిద్దరూ మట్టపల్లికి బయలుదేరారు. "రాత్రిలోగా తిరిగి వచ్చేస్తాం; ఒకవేళ ఆలస్యం అయితే మట్టపల్లి గుడిలో కాకుండా, ఊళ్ళోనే సుబ్బమ్మ అత్త దగ్గర ఆగి, రేపు తెల్లవారి వస్తాం" అని ఇంట్లో చెప్పారు: "లేకపోతే మా ఇంట్లోవాళ్ళు కూడా పోనివ్వరు" నవ్వాడు శ్రీకాంత్.
"మరి నేను చెప్పినట్లు మీ అమ్మ సెల్‌ఫోను దగ్గర పెట్టుకున్నావుగా? అది బాగా అవసరం కావొచ్చు!" అడిగాడు సాయికుమార్. "ఓఁ అదే మనకు టార్చ్ లైటుగాను, కెమెరాగా కూడాను పని చేస్తుంది ఇవాళ్ళ" అని జేబులోని సెల్‌ఫోను చూపించాడు శ్రీకాంత్.
ఇద్దరూ మట్టపల్లి చేరుకొని గుడి అంతా కలయ తిరిగారు. గుడికి చాలా ఎత్తైన ప్రహరీ గోడ ఒకటి ఉన్నది. ఊళ్ళో ఉన్నవాళ్లకు ఆ గోడ వెనక ఏమౌతున్నదో అస్సలు ఏమాత్రం కనిపించదు. అద్భుతమైన శిల్పకళతో విలసిల్లుతున్న ఆ గుడిని శ్రీకృష్ణదేవరాయలవారు కట్టించారు అని చెబుతారు. పిల్లలిద్దరూ దైవ దర్శనం చేసుకున్నారు. మెల్లగా సాయంత్రం అయ్యింది. ఇంక చీకటి పడుతుందనగానే అక్కడ చేరినవాళ్ళు, పూజారులు అందరూ గబగబా గుడికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. మిత్రులిద్దరూ అక్కడే కల్యాణమండపంలో ఓ స్తంభం మాటున దాక్కుని ఉండిపోయారు. మెల్లగా చీకటి అలుముకున్నది. చీకట్లతో పాటే "ధబ ధబ.. గుడ.. గుడ.. ఠాప్!" అంటూ పెద్ద పెద్ద శబ్దాలు కూడా మొదలయ్యాయి గుడి వెనకవైపునుండి.
"మెల్లగా అటువైపుకు నడు.. శబ్దం చేయకు అస్సలు..టార్చ్ వాడకు.." గుస గుసగా చెప్పాడు సాయికుమార్.
ఇద్దరూ మెల్లగా గుడి వెనక భాగానికి చేరారు:
అక్కడ అన్నీ రకరకాల వైర్లు పరిచి ఉన్నాయి. బాగా వెలుతురునిచ్చే ఫోకస్ లైట్లు, రకరకాల పరికరాలు, గనుల్లో ఉపయోగించే వాహనాలు వచ్చి చేరుకొని ఉన్నాయి. ఇంకొద్ది దూరంలోనే తెల్ల బట్టలు వేసుకొని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని ఉన్న రాజకీయ నాయకులు కొందరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కనబడ్డారు. చప్పుడు చేయకుండా, ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ రాకుండా వాళ్లందరినీ తమ దగ్గరున్న సెల్‌ఫోనుతో ఫొటోలు, వీడియోలు తీసాక, అక్కడినుండి బయటపడ్డారు శ్రీకాంత్, సాయికుమార్.
"అర్థమైందా? దయ్యాలు ఏం చేస్తున్నాయో? గుడినంతా గుప్తనిధుల కోసం త్రవ్విపారేస్తున్నాయి.
వాటికి అడ్డం అని, గుడిలోకి భక్తులెవ్వరూ రాకుండా శబ్దాలు చేసి, పుకార్లు పుట్టిస్తున్నాయి!" అన్నాడు సాయికుమార్.
"ఇప్పుడు మనుషులే వాటికి బుద్ధి చెప్పాలి. మనం పోలీసుల్ని పిలుద్దామా, ఇళ్ళలో జనాలని పిలుద్దామా?" అడిగాడు శ్రీకాంత్.
"వీళ్ళెవరో బాగా పెద్ద మనుషుల్లా ఉన్నారు. పోలీసుల్ని పిలిస్తేనే మంచిది" అని, పిల్లలిద్దరూ తమ దగ్గరున్న సమా-చారాన్నంతా పోలీసులకు అందజేసారు. చకచకా చర్యలు తీసుకున్న పోలీసులకు దొంగలందరూ అడ్డంగా దొరికిపోయారు!
ప్రభుత్వానికి చెందాల్సిన నిధులకోసం ప్రజల్ని భయాందోళనలకు గురిచేసినందుకు దొంగలందరికీ శిక్షలు పడ్డాయి. శ్రీకాంత్, సాయికుమార్‌లు ఇద్దరినీ ప్రభుత్వం చాలా అభినందించింది.